హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ 35 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కు ధరించకపోతే నేటి నుంచి పోలీసులు రూ. వెయ్యి జరిమానా విధిస్తారని తేల్చిచెప్పారు. మాస్కు ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు.
ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కట్టడిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. తప్పనిసరిగా అందరూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలి. ఒమిక్రాన్ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలి. జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే వాస్తవాలవుతాయి. ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది అని శ్రీనివాస్ రావు హెచ్చరించారు.
ఒమిక్రాన్ వేరియంట్.. 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకంటున్నామని తెలిపారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడంతో వైరస్‌ను అరికట్టొచ్చు. ఫంక్షన్స్, పండుగల్లో జాగ్రత్తలు పాటించాలి. కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదు. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది.
తెలంగాణలో సుమారు 25 లక్షల మందికి పైగా సెకండ్ డోసు తీసుకోని వారు ఉన్నారు. 15 లక్షల మందికి పైగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు తీసుకోవడం ద్వారానే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉందన్నారు. మాస్కులే వ్యాక్సిన్‌లా పని చేస్తాయి. మాస్కు ధరించకపోతే రూ. 1000 జరిమానా పోలీసులు విధిస్తారు. సామాజిక బాధ్యతగా వచ్చే రెండు, మూడు నెలలు మాస్కు ధరిస్తే థర్డ్ వేవ్‌ను అరికట్టే అవకాశం ఉంది. అన్ని రకాల పని ప్రదేశాల్లో, ప్రయాణికులు కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి అని శ్రీనివాస్ రావు సూచించారు.
No comments:
Post a Comment