Sunday, December 19, 2021

రాజకీయాల్లో తగ్గుతున్న న్యాయవాదుల సంఖ్య‌

రాజకీయాల్లో తగ్గుతున్న న్యాయవాదుల సంఖ్య‌

సామాజిక సృహ మీద ప్రజలకు అవగాహన కల్పించాల‌న్నారు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. హ‌న్మ‌కొండలో ప‌ది కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ… కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న కోర్టుల సముదాయాలను తీసివేసి అధునాతన సౌకర్యాలతో నిర్మించాలని తాను సంకల్పించాన‌న్నారు. త‌న‌ ఆలోచనలు, భావాలకు అనుగుణంగా వరంగల్ కోర్టును నిర్మించార‌ని.. దీన్ని మోడల్ కోర్టు భవనంగా చేసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంపిస్తాన‌ని తెలిపారు.

కోర్టుల్లో మౌలిక సౌకర్యాల ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై జులైలో కేంద్రానికి ప్రతిపాదన పంపామ‌న్నారు సీజేఐ. అలాగే ఇండియన్‌ జ్యుడీషియరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపైనా స‌మాచారం ఇచ్చామ‌ని చెప్పారు. అయితే ఇప్పటివరకూ న్యాయమంత్రిత్వశాఖ, కేంద్రం నుంచి సమాధానం రాలేద‌ని.. ప్రత్యేక సంస్థపై పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టరూపంలో తెస్తారని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో న్యాయ‌వాదుల అధికంగా ఉండేవార‌ని… ఇప్పుడు ఆ సంఖ్య త‌గ్గింద‌న్నారు ఎన్వీ ర‌మ‌ణ‌. ఈ సంఖ్య‌ను పెంచి, స‌మాజానికి మంచి చేయాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కుటుంబం, వృత్తితో పాటు సమాజం, రాష్ట్రం, దేశం గురించి కూడా న్యాయ‌వాదులు ఆలోచించాల‌ని సూచించారు.


కాళోజీ స్ఫూర్తితో తెలుగులోనే మాట్లాడిన ఎన్వీ ర‌మ‌ణ‌.. వ‌రంగ‌ల్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఓరుగల్లు పుట్టినిల్లని కొనియాడారు. “వరంగల్ పోరాట గడ్డ. విప్లవకారులు తిరిగిన నేల. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ప్రాంతం. పొరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్ కు వందనం. చారిత్రాత్మక సంపదకు ఈ నేల‌ నిలయం. అద్భుతమైన ఆనవాళ్లకు కేంద్రం. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, పోరాటాయోధులు ఇక్కడ నుంచి వ‌చ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించా. మనకున్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించింది. వేయి స్తంభాల ఆలయం శిలా, కళా వైభవానికి ఖ్యాతి” అంటూ ఎంతో అద్భుతంగా ప్ర‌సంగించారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

No comments:

Post a Comment