Thursday, December 9, 2021

అంతర్జాతీయ మానవ హక్కుల దినం: మనిషిగా మీకున్న హక్కులు ఏమిటో మీకు తెలుసా... ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ఏం చెబుతోంది?

అంతర్జాతీయ మానవ హక్కుల దినం: మనిషిగా మీకున్న హక్కులు ఏమిటో మీకు తెలుసా... ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ ఏం చెబుతోంది?

Courtesy by BBC మీడియా ట్విట్టర్ 
  • రవిశంకర్ లింగుట్ల
  • బీబీసీ ప్రతినిధి

ఎలీనర్ రూజ్వెల్ట్

ఫొటో సోర్స్,WIKIPEDIA/FDR PRESIDENTIAL LIBRARY & MUSEUM

ఫొటో క్యాప్షన్,

యూడీహెచ్‌ఆర్ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు

ఈ రోజు మానవాళి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటోంది. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈరోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తోంది.

ఐక్యరాజ్యసమితి 'సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ -యూడీహెచ్‌ఆర్)'ను ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబరు 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.

మానవ హక్కుల చరిత్రలో- ఈ డిక్లరేషన్ ఒక ప్రధానమైన పత్రం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండేళ్లలో దీనిని రూపొందించారు. యూడీహెచ్‌ఆర్ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు.

అన్ని దేశాలు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా ఈ పత్రాన్ని నిర్దేశిస్తూ 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచమంతటా పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించింది. డిక్లరేషన్‌ ఏం చెబుతోంది?

డిక్లరేషన్

ఫొటో సోర్స్,UN.ORG

ఫొటో క్యాప్షన్,

మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయని ఆర్టికల్ 1 చెబుతోంది

పీఠికలో ఏముంది?

మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతిలకు పునాది.

మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు క్రూరమైన దుష్కృత్యాలకు కారణమయ్యాయి. ఇవి మానవాళి అంతరాత్మకు గాయం చేశాయి. భావప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష.

నిరంకుశత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్టచివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన(రూల్ ఆఫ్ లా)తో రక్షించాలి.

దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం.

ఈ పత్రంలో- ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువపై, స్త్రీ,పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించటానికి ఐరాస సభ్యదేశాలు సంకల్పించాయి.

ఐక్యరాజ్యసమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనీన గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్యదేశాలు ప్రతిన బూనాయి.

ఈ ప్రతిజ్ఞను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైనది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తోంది.

ప్రతి వ్యక్తీ, సమాజంలోని ప్రతి వ్యవస్థా ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ, విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించటానికి కృషి చేయాలి.

ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన, ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి.

హక్కుల కోసం నినదిస్తున్న మహిళ

ఫొటో సోర్స్,STANDUP4HUMANRIGHTS.ORG

ఏ ఆర్టికల్ ఏం చెబుతోంది?

ఆర్టికల్ 1

మనుషులందరికీ పుట్టుకతోనే స్వేచ్ఛ, సమానత్వం లభిస్తాయి. గౌరవం, హక్కుల విషయంలో అందరూ సమానులే. మనుషులందరికీ సొంత ఆలోచన, అంతః చేతన ఉంటాయి. ఒకరితో మరొకరు సోదరభావంతో మెలగాలి.

ఆర్టికల్ 2

ఈ పత్రంలోని అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జాతి, రంగు, లింగం, భాష, మతం లాంటి అంశాల ప్రాతిపదికగాగాని, రాజకీయ నేపథ్యంవల్లగాని, భిన్నాభిప్రాయం వల్లగాని, జాతీయ లేదా సామాజిక మూలాలవల్లగాని, సంపదలో వ్యత్యాసాలవల్లగాని, పుట్టుక లేదా ఇతర ప్రాతిపదికల వల్లగాని వివక్ష చూపడానికి వీల్లేదు.

వ్యక్తులను వారి దేశం లేదా భూభాగం రాజకీయ/అంతర్జాతీయ హోదా ఏమిటనేదాని ప్రాతిపదికగా ఎలాంటి వివక్షా చూపరాదు.

ఆర్టికల్ 3

జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, స్వీయ భద్రతా హక్కు ప్రతి మనిషికీ ఉంటాయి.

ఆర్టికల్ 4

ఎవ్వరినీ బానిసగా చేసుకోవడానికి వీల్లేదు. బానిసత్వాన్ని, బానిస వ్యాపారాన్ని అన్ని రూపాల్లో నిషేధించాలి

ఆర్టికల్ 5

ఎవ్వరినీ చిత్రహింసలకు గురిచేయరాదు. ఎవ్వరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమానకరమైన శిక్షకు గురిచేయరాదు.

న్యాయవ్యవస్థ

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఆర్టికల్ 6

ప్రతి చోట చట్టం ముందు వ్యక్తిగా గుర్తింపు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

ఆర్టికల్ 7

చట్టం ముందు అందరూ సమానులే. ఎలాంటి వివక్షా లేకుండా చట్టపరమైన రక్షణ పొందే హక్కు అందరికీ ఉంది. ఈ డిక్లరేషన్‌కు విరుద్ధంగా, ఎలాంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమానమైన రక్షణ ఉంటుంది.

ఆర్టికల్ 8

రాజ్యాంగం, లేదా చట్టం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే చర్యల విషయంలో సంబంధిత జాతీయ ట్రైబ్యునల్ నుంచి పరిష్కారం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

ఆర్టికల్ 9

ఎవ్వరినీ ఏకపక్షంగా అరెస్టు చేయడానికిగాని, నిర్బంధించడానికిగాని, ప్రవాసానికి పంపించడానికిగాని వీల్లేదు.

ఆర్టికల్ 10

క్రిమినల్ నేరాభియోగాలపైగాని, తన హక్కులను, బాధ్యతలను నిర్ణయించే విషయంలోగాని స్వతంత్ర, నిష్పాక్షిక ట్రైబ్యునల్ ఆధ్వర్యంలో నిష్పాక్షిక, బహిరంగ విచారణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంది.

డిక్లరేషన్

ఆర్టికల్ 11

(1) శిక్షార్హమైన నేరాభియోగాన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ, బహిరంగ విచారణలో చట్ట ప్రకారం దోషిగా తేలే వరకు నిర్దోషిగానే భావించాలి. ఈ మేరకు ఆ వ్యక్తికి హక్కు ఉంది. ఈ విచారణలో, తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని హామీలూ వ్యక్తికి ఉంటాయి.

(2) ఎవరైనా వ్యక్తి చేసిన తప్పిదం లేదా పని అది జరిగిన సమయానికి జాతీయ, లేదా అంతర్జాతీయ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం కాకపోతే, ఆ వ్యక్తిని శిక్షార్హమైన నేరంలో దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. శిక్షార్హమైన నేరం జరిగినప్పుడు వర్తించే శిక్ష కన్నా తీవ్రమైన శిక్షను విధించడానికి కూడా వీల్లేదు.

ఆర్టికల్ 12

ఏ ఒక్కరి వ్యక్తిగత గోప్యత, కుటుంబం, ఇల్లు, ఉత్తరప్రత్యుత్తర విషయాల్లో ఏకపక్షంగా జోక్యం చేసుకోవడానికిగాని, గౌరవ ప్రతిష్ఠలపై దాడి చేయడానికిగాని వీల్లేదు. అలాంటి జోక్యం, దాడుల నుంచి చట్టపరమైన రక్షణ పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

ఆర్టికల్ 13

(1) దేశంలో స్వేచ్ఛగా తిరిగే, నివసించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

(2) సొంత దేశం నుంచి లేదా ఏ దేశం నుంచి అయినా వెళ్లిపోయే హక్కు, తన దేశానికి తిరిగి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి.

ఆర్టికల్ 14

(1) పీడన నుంచి తప్పించుకొనేందుకు ఇతర దేశాలను ఆశ్రయం అడిగే, పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి.

(2) ఐక్యరాజ్యసమితి సూత్రాలకు, ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలు లేదా రాజకీయతేర నేరాలపై నిజమైన ప్రాసిక్యూషన్ జరిగే సందర్భంలో ఈ హక్కు ఉండకపోవచ్చు.

ఆర్టికల్ 15

(1) ఏదైనా జాతీయతను కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

(2) ఎవరికీ ఏకపక్షంగా జాతీయతను తొలగించకూడదు, అలాగే జాతీయతను మార్చుకొనే హక్కును నిరాకరించకూడదు.

మానవ హక్కులు

ఆర్టికల్ 16

(1) జాతి, జాతీయత లేదా మతం పరిమితులు లేకుండా పెళ్లి చేసుకొనేందుకు, కుటుంబాన్ని కలిగి ఉండేందుకు వయోజనులైన మహిళలకు, పురుషులకు హక్కు ఉంది. వివాహం చేసుకొనేటప్పుడు, వివాహ బంధంలో ఉన్న కాలంలో, దీనిని రద్దుచేసుకొనేటప్పుడు వారికి సమానమైన హక్కులు ఉంటాయి.

(2) పెళ్లికి ఇద్దరు వ్యక్తుల్లో స్వేచ్ఛాయుత, సంపూర్ణ అంగీకారం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.

(3) సమాజంలో కుటుంబమనేది ఒక సహజమైన, ప్రాథమికమైన భాగం. కుటుంబానికి సమాజం, రాజ్యం రక్షణ కల్పించాలి.

ఆర్టికల్ 17

(1) సొంతంగాగాని, ఇతరులతో కలసి గాని ఆస్తులు కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది.

(2) ఎవరికీ ఏకపక్షంగా ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదు.

ఆర్టికల్ 18

స్వేచ్ఛాయుత అంతఃచేతనత్వానికి, స్వేచ్ఛగా ఆలోచించడానికి, మతాన్ని పాటించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. మతాన్ని లేదా విశ్వాసాన్ని మార్చుకొనే హక్కు ఇందులో భాగం. ఒంటరిగాగాని, ఇతరులతో కలిసిగాని ప్రైవేటుగాగాని, బహిరంగంగాగాని తన మతవిశ్వాసాలను పాటించే, బోధించే స్వేచ్ఛ, పూజించే స్వేచ్ఛ అందరికీ ఉన్నాయి.

ఆర్టికల్ 19

ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా హక్కు ఉంది. ఇతరుల జోక్యం లేకుండా సొంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు, సరిహద్దులతో సంబంధం లేకుండా ఏ మార్గం నుంచైనా సమాచారం, ఆలోచనలు కోరే, స్వీకరించే హక్కు ఇందులో భాగం.

ఆర్టికల్ 20

(1) స్వేచ్ఛగా శాంతియుతంగా సమావేశమయ్యేందుకు, సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికీ హక్కుంది.

(2) ఏదైనా సంఘంలో భాగస్వామి కావాలని ఎవరినీ బలవంతపెట్టడానికి వీల్లేదు.

బానిసత్వం

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

బానిసత్వాన్ని, బానిస వ్యాపారాన్ని అన్ని రూపాల్లో నిషేధించాలని ఆర్టికల్ 4 చెబుతోంది

ఆర్టికల్ 21

ప్రతి ఒక్కరికీ తమ దేశ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా లేదా ఎంచుకున్న ప్రతినిధి ద్వారా భాగస్వామ్యమయ్యే హక్కు ఉంది.

1) ప్రతి ఒక్కరికీ తమ దేశంలో ప్రభుత్వ సేవలను సమానంగా పొందే హక్కు ఉంది.

2) ప్రభుత్వానికి ప్రజాభీష్టం ప్రాతిపదిక కావాలి. నిర్దేశిత కాలానికి జరిగే నిజమైన ఎన్నికల్లో ఈ ప్రజాభీష్టం వ్యక్తంకావాలి. ఈ ఎన్నికల్లో సార్వజనీన, సమానమైన ఓటు హక్కు ఉంటుంది. రహస్య ఓటింగ్ లేదా దానికి సమానమైన స్వేచ్ఛాయుత ఓటింగ్ నిర్వహించాలి.

ఆర్టికల్ 22

సమాజంలో సభ్యులుగా ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత హక్కు ఉంది. తన గౌరవానికి, తన వ్యక్తిత్వం స్వేచ్ఛగా అభివృద్ధి చెందటానికి ఆవశ్యకమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను జాతీయ కృషి, అంతర్జాతీయ సహకారం ద్వారా దేశ వనరులకు అనుగుణంగా సాధించుకునే హక్కు ఉంది.

ఆర్టికల్ 23

(1) ప్రతి ఒక్కరికీ పని చేయడానికి హక్కుంది. స్వేచ్ఛగా కోరుకొన్న ఉపాధిని పొందడానికి, పనిచేయటానికి న్యాయమైన, అనుకూలమైన పరిస్థితులు పొందడానికి, నిరుద్యోగిత నుంచి రక్షణ పొందటానికి అందరికీ హక్కుంది.

(2) ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్షా లేకుండా సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ఉంది.

(3) పని చేసే ప్రతి ఒక్కరికీ తాను, తన కుటుంబం మానవ గౌరవంతో మనుగడ సాగించటానికి హామీ ఇచ్చేలా న్యాయమైన, అనుకూలమైన వేతనం పొందే హక్కు ఉంది. అవసరమైతే ఇతర మార్గాల్లో అదనంగా సామాజిక రక్షణ పొందే హక్కు ఉంది.

(4) ప్రతి ఒక్కరికీ తన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం కార్మిక సంఘాలు ఏర్పాటు చేయటానికి, వాటిలో చేరటానికి హక్కు ఉంది.

ఆర్టికల్ 24

ప్రతి ఒక్కరికీ పనిగంటలకు హేతుబద్ధమైన పరిమితిని, నిర్దేశిత కాలానికి వేతనంతో కూడిన సెలవులను పొందే హక్కు, విశ్రాంతి, విరామం తీసుకునే హక్కు ఉన్నాయి.

ఆర్టికల్ 25

(1) ప్రతి వ్యక్తికీ ఆహారం, దుస్తులు, నివాసం, వైద్యసేవలు, ఇతర సామాజిక సేవలు సహా.. తను, తన కుటుంబ ఆరోగ్య, సంక్షేమాలకు తగిన జీవన ప్రమాణం పొందే హక్కు ఉంది. నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, వైధవ్యం, వృద్ధాప్యం లేదా తన నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల జీవనోపాధి లేకపోవటం నుంచి భద్రత పొందే హక్కు ఉంది.

(2) మాతృత్వం సమయంలో మహిళలకు, బాల్యదశలో చిన్నారులకు ప్రత్యేక సేవ, సహాయాలు పొందే హక్కు ఉంది. పెళ్లి ద్వారా పుట్టినా, పెళ్లి కాకుండా పుట్టినా చిన్నారులు అందరికీ సమానమైన రక్షణ లభించాలి.

మానవ హక్కులు

ఆర్టికల్ 26

(1) ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు ఉంది. కనీసం ప్రాథమిక, మౌలిక స్థాయుల్లో అయినా అందరికీ విద్య ఉచితంగా అందాలి. ప్రాథమికవిద్య తప్పనిసరిగా ఉండాలి. సాంకేతిక విద్య, వృత్తినైపుణ్య విద్య అందుబాటులో ఉండాలి. ఉన్నతవిద్య ప్రతిభ ప్రాతిపదికన అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి.

(2) మానవ వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించేలా, మానవ హక్కులను, మౌలిక స్వాతంత్ర్యాలను గౌరవించేదిగా విద్య ఉండాలి.

(3) తమ పిల్లలకు ఏ తరహా విద్య అందించాలో ఎంచుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది.

ఆర్టికల్ 27

(1) ప్రతి ఒక్కరికీ సమాజ సాంస్కృతిక జీవనంలో స్వేచ్ఛగా పాలుపంచుకోవడానికి, కళలను ఆస్వాదించడానికి, శాస్త్రీయ పురోగతిలో, వాటి ప్రయోజనాల్లో భాగం పంచుకోవడానికి హక్కు ఉంది.

(2) ప్రతి వ్యక్తికీ తను సృజించిన ఎలాంటి శాస్త్రీయ, సాహిత్య, కళా ఉత్పత్తుల నుంచి లభించే నైతిక, భౌతిక ప్రయోజనాలను పరిరక్షించుకునే హక్కు ఉంది.

ఆర్టికల్ 28

ఈ ప్రకటనలో నిర్దేశించిన హక్కులు, స్వాతంత్ర్యాలు సంపూర్ణంగా సాకారమయ్యే సామాజిక, అంతర్జాతీయ పరిస్థితులు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

ఆర్టికల్ 29

తన వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించటం సాధ్యమయ్యే సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యతలు కూడా ఉన్నాయి.

(1) ప్రతి ఒక్కరూ తన హక్కులు, స్వాతంత్ర్యాలను వినియోగించుకొనే క్రమంలో- ప్రజాస్వామ్య సమాజంలో ఇతరుల హక్కులు, స్వాతంత్ర్యాలకు తగిన గుర్తింపు, గౌరవం, నైతికత, శాంతిభద్రతలు, సాధారణ సంక్షేమం కోసం చట్టం నిర్దేశించిన పరిమితులకు మాత్రమే లోబడి ఉండాలి.

(2) ఈ హక్కులు, స్వాతంత్ర్యాలను ఏ విధంగానూ ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, సూత్రాలకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు.

ఆర్టికల్ 30

ఈ ప్రకటనలోని ఏ అంశమైనా ఇందులో నిర్దేశించిన హక్కులు, స్వాతంత్ర్యాల్లో దేనినైనా ధ్వంసం చేసేందుకు, లేదా ఏమైనా చేసేందుకు ఏ రాజ్యానికీ, సంఘానికీ, వ్యక్తికీ వీలు కల్పిస్తున్నట్లు భావించరాదు.

మానవ హక్కులు

No comments:

Post a Comment