Friday, December 17, 2021

మీరు ఫెయిలైతే.. ఫలితం మాకా?

మీరు ఫెయిలైతే.. ఫలితం మాకా?

తెలంగాణలో నిన్న విడుదలైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. పాసైన వారు కేవలం 49 శాతం మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఫెయిల్ అయ్యారంటూ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పేపర్ వాల్యుయేషన్ చేయాల్సిందని మండిపడుతున్నారు.

ఈ మహమ్మారి కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు లేకుండా సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయ్యారు. ఇటీవల కరోనా తీవ్రత తగ్గడంతో ఫస్టియర్ పరీక్షల నిర్వాహణ జరిగింది. ఫస్టియర్ పరీక్షలు ఉండవని.. సెకండ్ ఇయర్ పై ఫోకస్ చేసిన విద్యార్థులకు.. సడెన్ గా ఎగ్జామ్స్ రాయడం ఇబ్బందిగా మారింది. గత ఏడాది పాస్ పర్సంటేజ్ 60గా ఉంటే.. ఈ సంవత్సరం 49కు పడిపోయింది. ఇప్పటికే సెకండ్ ఇయర్ పరీక్షలు దగ్గర పడటంతో సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉండే అవకాశం కనిపించడం లేదు. రెండో సంవత్సరం పరీక్షలతో కలిపి ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాయాల్సి ఉంటుంది. దీంతో మరింత ఒత్తిడి ఎదుర్కోవాలి. కరోనాకు తోడు ఇంటర్ బోర్డు నిర్వాహణ వైఫల్యం పిల్లలకు యమపాశంగా మారిందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఒత్తిడితో నిన్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని.. మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యత వహించాలని ట్వీట్ చేశాడు. మరోవైపు నిజామాబాద్ లో కూడా మూడు సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడంతో ఉరివేసుకొని మరో విద్యార్థి మృతి చెందాడు. గతంలో కూడా పరీక్షా ఫలితాలు తారుమారు కావడంతో ఇంటర్ విద్యార్థులు సుమారు 30 మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఘటనల నుంచైనా.. ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ నేర్చుకోవాలని విద్యార్థి సంఘాలు గుర్తు చేస్తున్నాయి.


No comments:

Post a Comment