బీఆర్ అంబేడ్కర్: ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూ
బీఆర్ అంబేడ్కర్: ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూ
గాంధీకి అంబేడ్కర్‌కు మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకొచ్చాయి? గాంధీని మొదటిసారి అంబేడ్కర్ ఎప్పుడు కలిశారు? ఆ తరువాత గాంధీపై అంబేడ్కర్ అభిప్రాయం ఎందుకు మారింది? ఈ విషయాలన్నీ బీఆర్ అంబేడ్కర్ 1955 ఫిబ్రవరి 26వ తేదీన బీబీసీ రేడియో ఫోర్ ప్రతినిధులు ఫ్రాన్సిస్ వాట్సన్, మౌరిస్ బ్రౌన్‌లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
. ఆ రోజు గాంధీ గురించి ప్రధానంగా మాట్లాడుతూ అంబేడ్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇవి.
గాంధీని మొదట అంబేడ్కర్ ఎప్పుడు, ఎక్కడ కలిశారు?
అంబేడ్కర్: గాంధీని నేను తొలిసారి 1929లో కలిశాను. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకరు నన్ను కలవమని గాంధీకి చెప్పారు. దాంతో నన్ను కలవాలని ఉందని గాంధీ నాకు లేఖ రాశారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు వెళ్లడానికి కాసేపటి ముందు నేను ఆయన్ను కలిశాను. కానీ ఆ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరయ్యారు. అప్పుడు ఆయన 5-6 నెలలు ఉన్నారు. అక్కడ ఆయన్ని కలవడమే కాదు, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఆయన్ను నేను ఎదుర్కొన్నాను కూడా.
పూనా ప్యాక్ట్‌పై సంతకం అయిన తరువాత కూడా ఆయన నన్ను కలవమని కబురు పంపారు. నేను వెళ్లేప్పటికి ఆయన జైల్లో ఉన్నారు.
నేను ప్రతిసారీ గాంధీని ఓ ప్రత్యర్థి హోదాలోనే కలిశాను. దాంతో ఆయన గురించి మరింత తెలుసుకొనే అవకాశం నాకు దొరికింది. గాంధీ తన నిజ స్వరూపాన్ని నా ముందు ప్రదర్శించారు. నిత్యం ఆయన దగ్గరుండే వ్యక్తులకు కూడా గాంధీ లోపలి మనిషిని చూసే అవకాశం దొరకలేదు. ఎందుకంటే వాళ్లంతా భక్తుల్లాగా వెళ్లేవాళ్లు. అందుకే గాంధీ గురించి వారికంటే నాకే ఎక్కువగా తెలుసు. ‘మహాత్ముడి’గా ఆయన బాహ్య రూపాన్ని మాత్రమే అందరూ చూస్తుంటారు. కానీ, నేను ఆయనలోని అసలైన మానవ రూపాన్ని, ముసుగులేని మనిషిని చూశాను.
అంబేడ్కర్: బయటి ప్రపంచం, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు గాంధీపైన చూపించే ఆసక్తి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్‌కు సంబంధించినంత వరకు, నా అభిప్రాయం ప్రకారం, భారత చరిత్రలో గాంధీ ఒక భాగం మాత్రమే. ఆయన చరిత్రను సృష్టించిన వ్యక్తి ఎంతమాత్రమూ కాదు. ఈ దేశ ప్రజల మెదళ్లలో నుంచి గాంధీ ఎప్పుడో కనుమరుగయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏటా ఆయన పుట్టిన రోజు నాడో, లేదా ఆయన జీవితానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన రోజునో సెలవు ప్రకటిస్తుంది, గాంధీ వారోత్సవాలు నిర్వహిస్తుంది కాబట్టి ప్రజలకు ఆయన గుర్తుంటున్నారు. అదే ఈ కృత్రిమ శ్వాసను అందించకపోతే గాంధీని ప్రజలు ఎప్పుడో మరచిపోయేవారు.
గాంధీ మొత్తంగా దేశ మౌలిక స్వరూపాన్ని మార్చలేదంటారా?
అంబేడ్కర్: లేదు, అస్సలు ఎంత మాత్రమూ లేదు. గాంధీ నిజానికి మొదట్నుంచీ ‘డబుల్ డీలింగ్’ చేశారు. ఆయన రెండు వార్తా పత్రికలు నిర్వహించారు. ఒకటి ఇంగ్లిష్‌లో హరిజన్, అంతకుముందు యంగ్ ఇండియా. గుజరాత్‌లో దీన్ బంధు లాంటి మరో పత్రిక నిర్వహించారు. ఈ రెండు పత్రికలను చదివితే గాంధీ ప్రజలను ఎలా మోసం చేసేవారో తెలుస్తుంది. ఇంగ్లిష్ పత్రికలో ఆయన కులవ్యవస్థకు, అంటరానితనానికి వ్యతిరేకిగా, ప్రజాస్వామికవాదిగా తనను తాను చూపించుకున్నారు.
అదే ఆయన గుజరాతీ మేగజీన్‌ను చదివితే గాంధీ ఛాందసవాది అని, కుల వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాన్ని, లేదా తరతరాలుగా భారత్‌ను వెనక్కు నెట్టిన సంప్రదాయ మూఢ విశ్వాసాలకు ఆయన మద్దతిస్తున్నారని అర్థమవుతుంది. నిజానికి హరిజన్ పత్రికలో గాంధీ చేసిన వ్యాఖ్యలను, తన గుజరాతీ పత్రికలో ఆయన చేసిన వ్యాఖ్యలను తులనాత్మకంగా విశ్లేషించి ఆయన జీవిత చరిత్రను ఎవరో ఒకరు రాయాలి.
పాశ్చాత్య ప్రపంచం ఇంగ్లిష్ పేపర్ మాత్రమే చదువుతుంది. అక్కడ గాంధీ తన ప్రజాస్వామ్య విధానాలనే ప్రబోధిస్తూ కనిపిస్తారు. కానీ, మరో పత్రికలో ఆయన ప్రజలతో ఏం మాట్లాడారో చూడాలి. ఆ పని ఎవరూ చేసినట్టు లేదు. ఆయన జీవిత చరిత్రలన్నీ హరిజన్, యంగ్ ఇండియా పత్రికలపై ఆధారపడి రాసినవే తప్ప, ఆయన గుజరాతీ రాతలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు.
No comments:
Post a Comment