Monday, December 13, 2021

భగవద్గీత లో శ్రీ కృష్ణుడు మనకు ఏం చెప్పారు?

భగవద్గీత లో శ్రీ కృష్ణుడు మనకు ఏం చెప్పారు?

నరుడికి నారాయణుడు బోధించిన జీవనసారం భగవద్గీత.. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్తవ్య బోధ మాత్రమే కాదు, ఇది సకల ఉపనిషత్తుల సారం. ప్రపంచంలోనే తొలి వ్యక్తిత్వ, మరో వికాస గ్రంథం ఇది. ప్రతి మనిషినీ మహోన్నతునిగా తీర్చిదిద్దడానికి వికాస సూత్రాలు భగవద్గీతలో ఉన్నాయి..
ఆధునిక గురవులు బోధించే టైం మేనేజ్ మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్, పర్సనల్ మేనేజ్ మెంట్, టీం వర్క్, గ్రూప్ టాస్క్ వంటివి అన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో భగవద్గీతలో చెప్పాడు..
భగవద్గీత అంటే వైరాగ్యం కలిగినప్పుడో, వృద్దాప్యంలో కాలక్షేపం కోసమో పఠించే గ్రంథం కాదు. నిత్య జీవితంలో మనం ఆచరించాల్సిన విధులన్నీ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. భగవద్గీతను దేవుని ముందు పెట్టి పూజిస్తే వచ్చే పుణ్యమేమీ ఉండదు.. ప్రతినిత్యం పఠించి, అందులోని అంశాలను త్రికరణ శుద్ధితో ఆచరించాలి..

ప్రతి వ్యక్తి చిత్తశుద్ధితో ఆచరించాల్సిన నియమావళి ఇది.. ఆనాడు రాగద్వేషాలు అర్జునుడిని విచలితుణ్ని చేస్తే.. ఈ రోజు రకరకాల ఉద్రేకాలు యువతను కకావికలం చేస్తున్నాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో గీత సూటిగా చెప్పింది. జీవితంలో ప్రతిక్షణాన్ని ఉపయుక్తం చేసుకునే ఉపాయాలను ఉపదేశించింది. అన్ని దేశాలకూ, అన్ని కాలాలకూ గీతా సందేశం వర్తిస్తుంది.
గీతా అర్థమేమిటంటే..‘గీ’అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. ‘త’అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది..
భగవద్గీత గ్రంథంలోని మొత్తం 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో తొలి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన, ఆ తర్వాతి 6 అధ్యాయాలలో జ్ణాన యోగం, చివరి అధ్యాయాలలో భక్తి యోగం గురించి చెప్పబడింది.
శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో.. రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు. క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని ఆదిలోనే హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పాడు కృష్ణుడు.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నీ పని నువ్వే చేయమని భగవద్గీతలో నేరుగా చెప్పాడు కృష్ణుడు..
‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు.. కర్మ అంటే వృత్తి ధర్మం. అంటే పనిచేయడం. నేటి పోటీ ప్రపంచంలో అనుక్షణం మేటి అని నిరూపించుకోవాల్సిందే! బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారినే విజయం వరిస్తుంది..’
పోరాడితే పోయేదేం లేదు.. పోరాడకుండా పారిపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. పోరాడితే అయితే విజయం దక్కుతుంది, ఓటమి ఎదురైతే జీవితానికి విలువైన పాఠం దొరుకుతుంది. పలాయనవాదం ఎప్పటికీ సరైనది అనిపించుకోదు. పోరాడితే పోయేదేం లేదని వెన్నుతట్టాడు గీతచార్యుడు..
‘అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది. ఏదైనా ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు’ అని పార్థుడిని పురిగొల్పాడు శ్రీకృష్ణుడు. జీవితంలో పోరాడే సమయంలో పారిపోతే సమస్యలు తప్ప సంతోషాలు ఉండవు. పోరాటాన్ని అలవాటుగా చేసుకోగలిగితే.. మరుక్షణంలో విజయం రాకపోవచ్చు! కానీ, పోరాట తత్వం లక్షణంగా మారుతుంది. తొలి ప్రయత్నంలో విఫలమైనా మరో ప్రయత్నంలో లక్ష్యం అందుకోవచ్చన్న నమ్మకం కల్పించాడు..
ఎంత చక్కని ఉపదేశం ఇది.. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవండి.. చదివించండి.. నిత్య జీవితంలో ఆచరించి చూపించండి..
Courtesy :- Kranthi Dev Mithra

No comments:

Post a Comment