ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు కాకెక్కుతున్నాయి. నిన్న మొన్నటివరకు ప్రతిపక్షమే లేదనుకున్న టీఆర్ఎస్ కు… ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ తలనొప్పిగా మారాయి. ఆ రెండు పార్టీ స్పీడ్ చూస్తుంటే కేసీఆర్ కు భయం మొదలైనట్టే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన వ్యూహం మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి షాక్ తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది.
మూడోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపైన పడకుండా ఉండాలంటే ఈసారి సిట్టింగ్ ఎమ్మేల్యేలకు నో చెప్పి.. కొత్త వారికి తమ అదృష్టాన్ని పరిక్షించుకునే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల లిస్ట్ లో తమ పేరు ఉందా..? అనే ఆందోళనలో ఉన్నారు గులాబీ నేతలు. నిజంగా అదే జరిగితే ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? ఎవరి పైన వేటు పడుతుందనే చర్చ అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇటీవల చాలామంది టీఆర్‌ఎస్ నేతలు తమకు టచ్‌లో ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుచుకుంటామని చెప్పారు. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని ఆయన చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. బీజేపీకి టచ్‌లోకి వెళ్లిన టీఆర్ఎస్ నేతల లిస్టు కేసీఆర్‌కు చేరిందని.. అందుకే కొత్తవారికి ఛాన్స్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది.
No comments:
Post a Comment