ఖాళీ ఉంటే కబ్జా.. పబ్లిక్ టాయిలెట్స్ అయినా.. స్కూల్ అయినా.. బస్తీలో కబ్జాగాళ్లు పార్ట్-1
– పేదల టాయిలెట్స్ స్థలం కబ్జా
– 260 గజాల భూమి హాంఫట్
– కబ్జారాయుళ్లకు టీఆర్ఎస్ నేత అండదండలు
– ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
– ఆఖరికి స్కూల్ స్థలం కూడా మాయం
కాదేది కబ్జాకనర్హం అన్నట్లుగా హైదరాబాద్ లో దందాలు నడుస్తున్నాయి. చిన్నపాటి బిట్ ఎక్కడ ఉన్నా కర్చీఫ్ వేసేస్తున్నారు కబ్జారాయుళ్లు. ఆఖరికి పేదల టాయిలెట్స్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం లేపేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ సంజీవరెడ్డి నగర్ కి అనుకుని 500 కుటుంబాలు జీవించే బాపునగర్ బస్తీ ఉంది. ముంబై హైవేకి హాఫ్ కిలోమీటర్ వెంబడి పొడవునా ఉంటుంది. గజం 2 లక్షలు పెట్టినా దొరకదు. 1948 నుంచి లంబాడీ కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి. అప్పట్లో ప్రధాని ఇందిరగాంధీ నేరుగా వచ్చి 40 నుంచి 60 గజాలకు పట్టాలు ఇచ్చారు. ఆనాడే గిరిజన కుటుంబాల మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని ఖాళీ స్థలాలను వదిలారు. అయితే ఆ స్థలాలు ఇప్పుడు కబ్జాకోరుల చేతిలో చిక్కుకున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నాయకుల అండదండలతో నాన్ లంబాడీల అధిపత్యం కొనసాగుతోంది. దొంగ పత్రాలు సృష్టించడం.. ఖాళీ ప్రాంతాలను మింగేయడం కామన్ అయిపోయింది. అసలే ఇరుకైన ఇండ్లు. ఒక్కొక్క దాంట్లో 3 కుటుంబాలు జీవిస్తాయి. టీబీ ఆసుపత్రి ముందు గల్లీలో 265 గజాల స్థలంలో సెప్టిక్ ట్యాంక్, పబ్లిక్ కి ఉపయోగపడేలా టాయిలెట్స్ ఉండేవి. కాలక్రమేనా వాటిని నిర్వీర్యం చేశారు. వాటి పక్కనే ఉన్న ఇళ్ల వారితో నేతలు కబ్జాలు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటి నెంబర్ 7-1-632/115/09, 7-1-632/120/24 గల ఇళ్ల వారు పూర్తిగా జరుపుకుని నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం.
కబ్జా అయిన ప్రాంతాన్ని కాపాడాలని బస్తీ వాసులు వేడుకుంటున్నారు. అందుకు ఎమ్మార్వో, కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఖైరతాబాద్ డీసీకి ఫిర్యాదులు చేశారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. సర్వే చేయిస్తామని చెప్పుతున్నా వారు వచ్చేసరికి అంతస్థులు వెలుస్తున్నాయి. కనీసం పని ఆపే ధైర్యం చేయలేకపోతున్నారు. క్రిమినల్ కేసులు పెట్టాల్సిన చోట.. డబ్బులు పంచుకొని తమదేం పోతుందిలే అని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఎమ్మార్వో రిపోర్ట్ వచ్చాక చర్యలు.. తొలివెలుగుతో బస్తీ ప్రెసిడెంట్
గిరిజన, లంబాడీ బిడ్డలకు కేటాయించిన పబ్లిక్ టాయిలెట్స్ భూమిని కూడా కబ్జా చేయడంపై తొలివెలుగు వివరాలు సేకరించింది. బస్తీ ప్రెసిడెంట్ నుంచి సమాచారం సేకరించింది. హైదరాబాద్ లో భూమి రేటు పెరిగితే.. కనీస సౌకర్యాలు కూడా మిగిల్చలేని పరిస్థితి ఎంటని అడగ్గా.. ఎమ్మార్వో రిపోర్ట్ వచ్చాక వారిపై చర్యలు ఉంటాయని బాపునగర్ బస్తీ ప్రెసిడెంట్ హరి సింగ్ అన్నారు. నిర్మాణం పూర్తి అయ్యాక నివేదిక ఇస్తే.. వాళ్లు కోర్టులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కబ్జాదారులు అటు అధికారులను, ఇటు నాయకులను పెంచిపోషించడంతో ఏడు దశాబ్దాలుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ఇక కనుమరుగు కానున్నాయని అంటున్నారు ప్రజలు.
ఇక ఇదే బస్తీలో స్కూల్ స్థలం కబ్జా గురించి బస్తీలో కబ్జాగాళ్లు పార్ట్-2 లో చూద్దాం.
No comments:
Post a Comment