Sunday, November 1, 2026

HMWSSB 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు_

*హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ HMWSSB 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 01:

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ HMWSSB 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.గత 37 సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు, మురుగునీటి నిర్వహణ సేవలను కల్పించడంలో HMWSSB కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజారోగ్యం, సమగ్ర ప్రగతికి బోర్డు అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
హైదరాబాద్ నగరం నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో నీటి భద్రతకు, విలువైన జల వనరుల సుస్థిర నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, ఉత్పన్నమవుతున్న  పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మంచినీటి వనరులను పరిరక్షించేందుకు, గృహావసరాలకు సంబంధం లేని ఇతర అవసరాల కోసం మంచినీటి వినియోగాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ రోజు నుంచి ‘డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ, సుస్థిర నీటి నిర్వహణ దిశగా ఇది సరైన సమయంలో చేపట్టిన కీలకమైన కార్యక్రమమని అభివర్ణించారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డిను ఆయన అభినందించారు.HMWSSBకి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సంస్థలు తమ తోటల పెంపకం, నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటిని Treated Wastewater మరింత విస్తృతంగా వినియోగించాలని కోరారు. దీనివల్ల మంచినీటిపై ఆధారపడటం తగ్గడంతో పాటు, అత్యవసర గృహావసరాలకు మంచినీరు అందుబాటులో ఉండేలా చూడవచ్చని పేర్కొన్నారు.నీటి సంరక్షణను సమిష్టి బాధ్యతగా స్వీకరించాలని, సుస్థిరమైన, నీటి భద్రత కలిగిన హైదరాబాద్ నిర్మాణంలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి గారు ప్రజలకు, సంబంధిత భాగస్వాములందరికీ పిలుపునిచ్చారు.కోర్ అర్బన్ రీజియన్ CURE ప్రజలకు సేవలందించే లక్ష్యంతో HMWSSB తన ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

బాపట్ల కృష్ణమోహన్ కు జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం_



*బాపట్ల కృష్ణమోహన్ కు జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం*

*మీడియా రంగంలో ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు.. మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్ కు అరుదైన గౌరవం.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 31:

మీడియా రంగంలో మరియు సామాజిక కార్యకర్తగా మానవ హక్కుల బాద్యులుగా మరియు ప్రజాసంకల్పం సంస్థ ఫౌండర్ గా విశేష సేవలందిస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్ జాతీయ జర్నలిస్ట్ పురస్కారం–2026కు ఎంపికయ్యారు.కృష్ణమోహన్ మీడియా రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించిన ఎం.వి.రావు ఫౌండేషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తన మాతృమూర్తి లక్ష్మి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భవనం సమీపంలో గల నెల్లూరు హాస్పిటల్ ఆడిటోరియంలో అక్టోబర్ 29న ఘనంగా నిర్వహించిన జాతీయ జర్నలిస్టుల పురస్కారాల కార్యక్రమంలో ఈ అవార్డును బాపట్ల కృష్ణమోహన్ కు అందజేశారు.జర్నలిస్టుగా మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ అవినీతి అక్రమాలను నిలదీస్తూ పౌరసమాజాన్ని జాగృతం చేస్తున్న బాపట్ల కృష్ణమోహన్ సేవలను గుర్తించి ఎం.వి రావు ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఎంపిక చేసింది.
ఎం.వి రావు ఫౌండేషన్ చైర్మన్ ఎం. లీలా మోహన్ కృష్ణ, రిటైర్డ్ ఏఎస్పీ కే. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత సాధనాల వెంకటస్వామి నాయుడు చేతుల మీదుగా బాపట్ల కృష్ణమోహన్ ఈ పురస్కారం, మెడల్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

**మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక లో జర్నలిస్ట్ గా బాధ్యతగా కొనసాగుతూ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం బాపట్ల కృష్ణమోహన్ వృత్తిపరమైన ప్రయాణంలో విశేషమైన ఘట్టం.**

ఈ సందర్బంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ నాకు మీడియా రంగంలో స్ఫూర్తినిచ్చిన గురువులు ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు సారు మరియు పాశం యాదగిరి సారు మరియు మీడియా టుడే సంస్థల చైర్మన్ కె. కోటేశ్వరరావు సారు మరియు మానవ హక్కుల వేదిక జీవన్ కుమార్ సారు అని తెలిపారు.అలాగే వారి అడుగుజాడలలో నడుస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా జర్నలిస్ట్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నాను అని అన్నారు.గతంలో రెండు సార్లు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాను అని తెలిపారు.ప్రజలను చైతన్యవంతులుగా (ఆలోచనాపరులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా) తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రజాసంకల్పం అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి అవినీతి అక్రమాలమీద అలుపెరుగనిపోరాటం చేస్తున్న కృష్ణమోహన్.ఈ సంస్థ ద్వారా సామాజిక మాధ్యమాల (Media) సద్వినియోగం చేసుకొని సమాజంలో జరుగుతున్న విషయాలపై సరైన అవగాహన కల్పించడానికి టీవీ, ఇంటర్నెట్, పత్రికలను బలంగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజాసంకల్పం గ్రూప్ మీడియా వేదికలు అయిన యూట్యూబ్ ఛానెల్ మరియు ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ మరియు పేస్ బుక్ ల ద్వారా అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న కృష్ణమోహన్.ప్రముఖ హక్కుల నేత దివంగత కె. బాలగోపాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన 
మానవ హక్కుల వేదిక Human Rights Forum - HRF ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న  ప్రముఖ పౌర హక్కుల సంస్థలో సభ్యులుగా ఉన్న కృష్ణమోహన్.
సీనియర్ పొయట్ జర్నలిస్ట్ విజయసంకల్పం ప్రసాద్ ప్రోత్సాహం,సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు పాత్రికేయులు హాజరయ్యారు.జర్నలిస్టుల సేవలను గుర్తించి, వారి ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పురస్కారాలను ప్రకటించారు. మీడియా టుడే జాతీయ దినపత్రిక జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్ కు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు తన వృత్తిపరమైన ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.జర్నలిజం రంగంలో సాధించిన ఈ ఘనత కృష్ణమోహన్ కు మరింత ఉత్సాహాన్ని అందించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మరియు ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల సమ్మె_

*హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మరియు ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల సమ్మె*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, అక్టోబర్ 28:

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మరియు ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు మౌలిక వసతుల కొరత మరియు పెండింగ్ స్టైపెండ్ల సమస్యలపై అక్టోబర్ 27, 2026 నుండి తమ సమ్మెను తిరిగి ప్రారంభించారు.అక్టోబర్ 12-13 తేదీల్లో జరిగిన మొదటి విడత సమ్మె సమయంలో సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటిని నెరవేర్చకపోవడంతో డాక్టర్లు మళ్లీ ఆందోళనకు దిగారు.ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, మందులు మరియు సరైన సౌకర్యాలు లేకపోవడం.నెలవారీ స్టైపెండ్లు సకాలంలో విడుదల కాకపోవడం, ఫైనాన్స్ విభాగంలో బిల్లులు పెండింగ్‌లో పడటం.

*డిమాండ్లు :*

*(1)*: పెండింగ్ ఉన్న స్టైపెండ్లను బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలి.
*(2)*:  బ్యూరోక్రటిక్ జాప్యాన్ని నివారించడానికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)కి నేరుగా స్టైపెండ్లు పంపిణీ చేసే అధికారం ఇవ్వాలి.
*(3)*: ప్రతి నెలా సక్రమంగా స్టైపెండ్లు అందేలా ఒక పక్కా షెడ్యూల్ అమలు చేయాలి

ట్రాన్స్‌జెండర్ వైద్యురాలిగా చరిత్ర సృష్టించిన - డాక్టర్ కొయ్యల రూత్ జాన్‌పాల్‌_

*ట్రాన్స్‌జెండర్ వైద్యురాలిగా చరిత్ర సృష్టించిన - డాక్టర్ కొయ్యల రూత్ జాన్‌పాల్‌*

*డాక్టర్ జాన్‌పాల్‌ ను సత్కరించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్ ఐపీఎస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్, 28

ఎమర్జెన్సీ మెడిసిన్‌లో  ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ గారి సంకల్పాన్ని అభినందిస్తూ, వారిని సత్కరించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్ ఐపీఎస్.ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ... పట్టుదలతో చదువుకుని, న్యాయపోరాటం చేసి పీజీ పూర్తిచేసిన ఆమె జీవన ప్రయాణం ప్రశంసనీయం.
ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో సేవలందిస్తూ ఎందరో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. అన్ని అవరోధాలనూ అధిగమించి నిలిచిన ఈ తొలి ట్రాన్స్ వైద్యురాలి అకుంఠిత దీక్ష సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. డాక్టర్ రూత్ గారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని, తన లక్ష్యాలను చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని సజ్జనార్ అన్నారు.ఈ ప్రయాణంలో డాక్టర్ రూత్ గారికి వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన ముకుంద మాల గారికి, వైజయంతి వసంత గారికి, రచన ముద్రబోయిన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ - కర్టెన్ రైజర్_

*ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ - కర్టెన్ రైజర్*

*ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ఈ నెల 29న ఢిల్లీలో నిర్వహించే కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 28:

హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ లో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు.గ్లోబల్ సుమ్మిట్ నిర్వహణతో తెలంగాణ ప్రతిష్ఠ ప్రపంచస్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ రంగాల ప్రముఖులు,  అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు.క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు చెందిన ప్రపంచస్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని చెప్పారు. AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు.తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో డిజైన్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు  తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు.
బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యేకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎల్ నినో, నీటి సంక్షోభం నేపథ్యంలో భారీ ఏ.ఐ డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలి_

*పత్రిక ప్రకటన*

*ఎల్ నినో, నీటి సంక్షోభం నేపథ్యంలో భారీ ఏ.ఐ డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలి*

*మానవ హక్కుల వేదిక HRF*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 28:

భారీ స్థాయి ఏఐ కృత్రిమ మేధ డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ వనరుల వినియోగం తాగునీటి అవసరాలకు, వ్యవసాయానికి, పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించదని ప్రజలకు అందుబాటులో ఉండే అధ్యయనాలు నిర్ధారించే వరకు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే  డేటా సెంటర్ ల ఏర్పాటు అమలు కు  హామీల ను నిలిపివేయాలని, కొత్తగా ఎలాంటి హామీలూ ఇవ్వకూడదని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. 
ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత డేటా సెంటర్లన్నింటినీ కలిపి సమగ్రంగా అంచనా వేయాలి. 
ఈ ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో
పాటు, వనరుల వినియోగంపై అమలు చేయదగిన పరిమితులను విధించాలి.
ఎల్ నినో ప్రభావం, ముంచుకొస్తున్న నీటి సంక్షోభం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఆయన ప్రభుత్వం భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును  ప్రోత్సహించడం తీవ్ర వైరుధ్యంతో కూడుకున్నది. రాష్ట్రం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ఇప్పటికే సమస్య గా ఉన్న నీరు, విద్యుత్ వనరులపై మరింత భారాన్ని  పెంచే భారీ కంప్యూటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఏమాత్రం ముందుచూపు లేని నిర్ణయం.
రానున్న నెలల్లో వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించారు. తాగునీటిని కాపాడుకోవడానికి రైతులు ఒక పంట కాలాన్ని వాయిదా వేసుకోవాలని కూడా కోరారు. అంతేకాకుండా, ప్రజలకు తాగునీరు అందించడాన్ని సైతం హామీ ఇవ్వడం కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు.  హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు HMWSSB నీటి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి.వ్యవసాయానికి నీరు అందించలేని, కనీసం ప్రజలకు తగినంత తాగునీటిని కూడా హామీ ఇవ్వలేని ప్రభుత్వం, అపారంగా నీటిని వినియోగించే భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లను రాష్ట్రానికి ఆహ్వానించడం తగదు. తెలంగాణలో రైతులకు నీరు లేదు, ప్రజల అవసరాలకు సరిపడా నీరు లేదు, కానీ బడా సాంకేతిక సంస్థలకు మాత్రం సమృద్ధిగా నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది
 ప్రాధాన్యతలను తలకిందులు చేసే ఈ చర్య ,
ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.

**భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లు సాధారణ పారిశ్రామిక సంస్థలు కావు**

వీటిలో అపారమైన కంప్యూటింగ్ కార్యకలాపాలకు భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. వీటిని చల్లబరిచేందుకు అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థలు అవసరమవుతాయి. 
ఈ వ్యవస్థలు గణనీయమైన పరిమాణంలో నీటిని వినియోగించవచ్చు. అంతేకాకుండా, ఈ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే నీటిని కూడా వాటి మొత్తం నీటి వినియోగంలో భాగంగా పరిగణించాలి. వాస్తవ ప్రభావం శీతలీకరణ సాంకేతికత, నిర్వహణ పరిస్థితులు, నీరు మరియు విద్యుత్ వనరులపై ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే హామీల మాటున ఈ ప్రభావాలను మరుగునపరచకుండా, స్వతంత్రంగా అంచనా వేయాలని HRF అభిప్రాయపడుతోంది.ఈ ప్రాజెక్టులను సమర్థించుకోవడానికి ప్రభుత్వం నీటి పునర్వినియోగం, శుద్ధి చేసిన మురుగునీటి వినియోగం, నీటి వినియోగంలో నికర ప్రభావం లేని రూపకల్పన వంటి అంశాలను ప్రస్తావించవచ్చు. అయితే, వాస్తవ నీటి వినియోగం, వివిధ రుతువుల్లో నీటి లభ్యత, నీటి కోసం పోటీ పడుతున్న ఇతర అవసరాలపై పారదర్శకమైన అధ్యయనాలకు ఇవి ప్రత్యామ్నాయం కాలేవు. పెట్టుబడులు, సాంకేతిక రంగంలో ప్రతిష్ఠ వంటి అంశాలకు ప్రజల ప్రాథమిక అవసరాలు, స్థానిక పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు.
ఈ భారీ ఏఐ డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్ మిగులు రాష్ట్రం కాని తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ఇప్పటికే ఒత్తిడి పెరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్రాలకు భారీ మొత్తంలో విద్యుత్‌ను కేటాయించడం వల్ల ప్రస్తుత సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. గృహాలు, వ్యవసాయం, ఇతర ఉత్పాదక రంగాల అవసరాలతో విద్యుత్ కోసం పోటీ పెరుగుతుంది. ఇప్పటికే పంట కోత సమయంలో రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, 2029 నాటికి 5 గిగావాట్ల GW సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కేంద్రాలు నిరంతరం, 24 గంటలూ పనిచేస్తాయి. వీటికి రెండు విద్యుత్ గ్రిడ్ల నుంచి సరఫరా ఉంటుందని హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర రంగాల ఇంధన అవసరాలకు విఘాతం కలగకుండా ఈ అదనపు విద్యుత్ డిమాండ్‌ను ఎలా తీర్చగలదో ప్రభుత్వం వివరించాలి.దేశీయ, అంతర్జాతీయ భారీ సాంకేతిక సంస్థల కంప్యూటింగ్ అవసరాలను ప్రధానంగా తీర్చే మౌలిక సదుపాయాల కోసం విలువైన భూమి, నీరు, విద్యుత్ వనరులను కేటాయించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈ భారీ పెట్టుబడుల వల్ల ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చేస్తున్న గొప్ప ప్రకటనలను, ఇటువంటి అధిక మూలధనంతో ఏర్పాటయ్యే కేంద్రాలు శాశ్వతంగా కల్పించే ఉద్యోగాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుoది. అంతేకాకుండా, ఈ విధ్వంసకర భారీ ప్రాజెక్టుల పర్యావరణ వ్యయాన్ని చివరకు భరించాల్సి వచ్చేది స్థానిక ప్రజలే.అరుదుగా లభించే నీటి వనరులను సమానత్వ ప్రాతిపదికన పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. రైతులు రానున్న కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తాగునీటి సరఫరాపై కూడా అనిశ్చితిని అంగీకరిస్తున్న ప్రభుత్వం, అత్యధిక వనరులను వినియోగించే పరిశ్రమలకు మాత్రం సాదర స్వాగతం పలకడం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోంది? ఎవరి మూల్యంగా ఆ ప్రయోజనాలను నెరవేర్చాలనుకుంటోంది? అనే తీవ్రమైన ప్రశ్నలను ఈ విధానం లేవనెత్తుతోంది.బడా సాంకేతిక సంస్థల విస్తరణ ఆకాంక్షల కంటే ప్రజల ప్రాథమిక అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. నీటి కొరతతో సతమతమవుతున్న రాష్ట్రంలో, భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లను పర్యావరణానికి అనుకూలంగా ఎలా ఏర్పాటు చేయాలన్నది మాత్రమే ప్రశ్న కాదు.అసలు వాటిని ఏర్పాటు చేయడం సమంజసం కాదు.

**వి.ఎస్. కృష్ణ**
**ఎస్. జీవన్ కుమార్**
మానవ హక్కుల వేదిక (HRF)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూముల పూర్తి రికార్డులు బయటపెట్టాలి - అడ్వకేట్ వి. రవికృష్ణ డిమాండ్_

*ప్రెస్ నోట్*

*ప్రభుత్వ అసైన్డ్ భూములు ప్రైవేటు పట్టా భూములుగా ఎలా మారాయి?*

*మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూముల పూర్తి రికార్డులు బయటపెట్టాలి - అడ్వకేట్ వి. రవికృష్ణ డిమాండ్*

*చౌదరపల్లి సర్వే నెం.294 భూముల వ్యవహారంపై విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తు జరగాలి*

*1954–55 సేత్వార్‌లో సర్కారీ భూమి - 1958 విధానం ప్రకారం భూమిలేని పేదలకు అసైన్‌మెంట్ - ఆ తరువాత 84 ఎకరాలకు ఎన్ఓసీ NOCలు, రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యమయ్యాయి?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 27:

సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట్–భూంపల్లి మండలం, చౌదరపల్లి గ్రామంలోని సర్వే నెం.294కు సంబంధించిన ప్రభుత్వ భూములు, పేద రైతులకు జరిగిన అసైన్‌మెంట్లు, తదనంతరం జారీ అయినట్లు పేర్కొంటున్న ఎన్ఓసీ NOCలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తీవ్రమైన చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని అడ్వకేట్ వి. రవికృష్ణ పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు మార్లు జిల్లా కలెక్టర్, రాష్ట్ర రెవెన్యూ శాఖ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, అసలు భూముల చట్టపరమైన స్థితిని స్పష్టంగా నిర్ధారించే సమగ్ర నివేదికను ఇప్పటివరకు అందించలేదని తెలిపారు.

**2026 అక్టోబర్ 25న తెలంగాణ విజిలెన్స్ అధికారులకు, అవినీతి నిరోధక శాఖ ACBకు సమగ్ర ఫిర్యాదు పంపినట్లు వెల్లడించారు.**

*(1)*: 1954–55 సేత్వార్‌లో భూమి స్వరూపం ఏమిటి?

అందుబాటులో ఉన్న 1954–55 సేత్వార్ రికార్డుల ప్రకారం సర్వే నెం.294లో సుమారు 172 ఎకరాల 12 గుంటల భూమి పొరంబోకు/సర్కారీ భూమిగా నమోదై ఉన్నట్లు రవికృష్ణ తెలిపారు.అయితే తదుపరి రెవెన్యూ రికార్డులు, ఫిర్యాదుల్లో సర్వే నెం.294 మొత్తం విస్తీర్ణం 175 ఎకరాల 12 గుంటలుగా పేర్కొనబడిందని, ఈ రెండు విస్తీర్ణాల మధ్య తేడాను కూడా అసలు సేత్వార్, సప్లిమెంటరీ సేత్వార్, సర్వే రికార్డుల ఆధారంగా ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
ఒక భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నప్పుడు, అది ఏ తేదీన, ఏ ఉత్తర్వుల ప్రకారం, ఏ అధికార పరిధిలో ప్రైవేటు పట్టా భూమిగా మారిందనే విషయానికి స్పష్టమైన ప్రభుత్వ రికార్డులు ఉండాలని అన్నారు.

*(2)*: జి.ఓ.ఎమ్ఎస్.నెంబర్ 
G.O.Ms.No.1406/1958 ప్రకారం పేద రైతులకు భూముల అసైన్‌మెంట్.

జి.ఓ.ఎమ్ఎస్.నెంబర్ G.O.Ms.No.1406, తేదీ 25.07.1958 ద్వారా అమలులోకి వచ్చిన అసైన్‌మెంట్ విధానం ప్రకారం, భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములను అసైన్ చేసినట్లు సంబంధిత పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు.ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన పలువురు రైతుల అసైన్‌మెంట్ పట్టాలు, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు, పాస్‌బుక్కులు, రెవెన్యూ రికార్డుల్లో 1980–90 దశకాలకు చెందిన వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.అయితే పట్టా సర్టిఫికెట్ జారీ చేసిన తేదీనే అసలు అసైన్‌మెంట్ తేదీగా భావించరాదని, ప్రభుత్వం ఒరిజినల్ అసైన్‌మెంట్ ప్రొసీడింగ్స్, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, లావోని రికార్డులను బయటపెట్టి అసలు తేదీలను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.

*(3)*:  హైకోర్టులో తహసీల్దార్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌కు విరుద్ధంగా ఎన్ఓసీ NOCలు ఎలా?

రిట్ పిటిషన్ నెంబర్ 
W.P.No.16161 of 2025లో అక్బర్‌పేట్–భూంపల్లి తహసీల్దార్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో సర్వే నెం.294లోని భూముల అసైన్‌మెంట్చరిత్ర,

జి.ఓ.ఎమ్ఎస్.నెంబర్ G.O.Ms.No.1406/1958 ప్రస్తావన ఉన్నట్లు ఫిర్యాదులో వివరించామని రవికృష్ణ తెలిపారు.ప్రభుత్వం తరఫున హైకోర్టులో సమర్పించిన ప్రమాణపూర్వక ప్రకటన ఒకవైపు, అదే భూముల్లోని కొన్ని భాగాలను బదిలీ చేయదగిన ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించడం మరోవైపు కనిపిస్తే, ఆ వైరుధ్యాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా వివరించాలని అన్నారు.
హైకోర్టులో ప్రభుత్వమే అసైన్‌మెంట్ చరిత్రను ప్రస్తావించినప్పుడు, ఆ భూములపై ఉన్న చట్టపరమైన బదిలీ నిషేధం ఏ ఉత్తర్వుతో తొలగిపోయిందో ప్రభుత్వం వెల్లడించాలి.

*(4)*: సర్వే నెం.294/1 నుంచి 294/10 వరకు బై నంబర్లు ఎలా ఏర్పడ్డాయి?

ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం సర్వే నంబర్ల విభజన అని రవికృష్ణ పేర్కొన్నారు.ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రికార్డుల్లో 294/1 నుంచి 294/4 వరకు మాత్రమే ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో, తదనంతరం 294/5, 294/6, 294/7, 294/8, 294/9, 294/10 తదితర సబ్‌డివిజన్లు ఏ విధంగా ఏర్పడ్డాయనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా 294/7, 294/8, 294/9, 294/10 సబ్‌డివిజన్లలోని భూములపై నమోదైన లావాదేవీల విషయంలో అసలు సర్వే మ్యాపులు, సబ్‌డివిజన్ ప్రొసీడింగ్స్, ఫైసల్ పట్టీలు, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, మ్యూటేషన్ ఫైళ్లు పరిశీలించాలని కోరారు.ఈ భూములు 1958కు ముందే ఎటువంటి బదిలీ నిషేధం లేని పట్టా భూములుగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తే, అందుకు సంబంధించిన 1958కు పూర్వపు అసలు పట్టాలు, అసైన్‌మెంట్ ఉత్తర్వులు, రికార్డు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

*(5)*: ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూములు. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, ఖాతా వివరాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు పరిశీలించినప్పుడు మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లతో సంబంధం ఉన్న భూ లావాదేవీలు కనిపిస్తున్నాయని తెలిపారు.

**మాధవనేని సింధు - ఖాతా నెం.60433**

**మంజుల మాధవనేని - ఖాతా నెం.60418**

ఈ రెండు ఖాతాలకు సంబంధించిన సర్వే నెం.294లోని వివిధ సబ్‌డివిజన్లలో నమోదైన భూములు, వాటి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, యాజమాన్య మార్పులపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సుమారు 84 ఎకరాల భూములకు సంబంధించిన ఎన్ఓసి NOCలు, లావాదేవీలపై ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో, అసలు ఎంత విస్తీర్ణానికి ఎన్ఓసీ NOCలు జారీ అయ్యాయి, ఎంత భూమి రిజిస్టర్ అయింది, ఎంత విస్తీర్ణం ప్రస్తుతం ఆయా ఖాతాల్లో ఉంది అనే అంశాలను వేర్వేరుగా నిర్ధారించాలని కోరారు.

*(6)*  అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టాన్ని ఎన్ఓసీ NOCతో అధిగమించగలరా?

తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధ) చట్టం, 1977లోని సెక్షన్ 3 ప్రకారం, చట్ట పరిధిలోకి వచ్చే అసైన్డ్ భూముల బదిలీలు నిషేధించబడి, నిషేధానికి విరుద్ధమైన బదిలీలు చెల్లవు.
సెక్షన్ 4 ప్రకారం చట్టబద్ధమైన స్వాధీన పునరుద్ధరణ చర్యలకు అవకాశం ఉంది. సెక్షన్ 5 ప్రకారం అసైన్డ్ భూములకు సంబంధించిన కొన్ని రిజిస్ట్రేషన్లపై నిషేధం వర్తిస్తుంది.
అదేవిధంగా రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం చట్టపరంగా నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రత్యేక నియంత్రణలు అమలులో ఉన్నాయి.ఒక భూమి 1977 చట్టం ప్రకారం బదిలీ నిషేధానికి లోబడి ఉన్నప్పుడు, కేవలం ఎన్ఓసీ NOC లేదా మ్యూటేషన్ ద్వారా ఆ నిషేధాన్ని తొలగించలేరు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏ చట్టం ప్రకారం, ఏ ఆధారాలతో ఎన్ఓసీ NOCలు జారీ చేశారో వెల్లడించాలని రవికృష్ణ డిమాండ్ చేశారు.

*(7)*: రెవెన్యూ అధికారులకు నేరుగా ప్రశ్నలు

•చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు రవికృష్ణ పలు ప్రశ్నలు సంధించారు.

•ప్రభుత్వ అసైన్డ్ భూములకు ఎన్ఓసీ NOCలు జారీ చేసే ముందు అసలు అసైన్‌మెంట్ రికార్డులను పరిశీలించారా?

•భూములు అసైన్డ్ కాదని నిర్ణయించిన అధికారి ఎవరు? ఆ నిర్ణయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉన్నాయి?

•294/7, 294/8, 294/9, 294/10 సబ్‌డివిజన్లలోని భూములు ఎప్పుడు, ఏ చట్టం ప్రకారం బదిలీ చేయదగిన పట్టా భూములుగా మారాయి?

•ఈ భూములపై 1977 చట్టం వర్తించదని నిర్ధారించిన చట్టపరమైన ఉత్తర్వు ఏది?

•ఎన్ఓసీ NOCలు జారీ చేయడానికి ముందు సెక్షన్ 22-A నిషేధిత ఆస్తుల రికార్డులను పరిశీలించారా?

•ఒకవేళ అసలు రికార్డులకు విరుద్ధంగా ఎన్ఓసీ NOCలు జారీ చేసి ఉంటే, సంబంధిత అధికారులపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?

*(8)*: అధికారులకు లంచాలు అందాయా? రాజకీయ ఒత్తిడి పనిచేసిందా? లేక చట్టబద్ధమైన నిర్ణయాలేనా?

ఇంత పెద్ద విస్తీర్ణంలో ప్రభుత్వ అసైన్‌మెంట్ చరిత్ర ఉన్న భూములకు సంబంధించిన ఎన్ఓసీ NOCలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితుల్లో, వాటి వెనుక అధికార దుర్వినియోగం లేదా అవినీతి ఉందా అనే ప్రశ్నను విస్మరించలేమని రవికృష్ణ పేర్కొన్నారు.ఎన్ఓసీ NOCలు జారీ చేసిన అధికారులకు ఏవైనా అక్రమ ఆర్థిక ప్రయోజనాలు అందాయా? ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రభావం లేదా ఒత్తిడి పనిచేసిందా? లేక ప్రతి నిర్ణయానికీ చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఊహాగానాల ద్వారా కాకుండా, అసలు ఫైళ్లు, అధికారుల నోట్‌షీట్లు, ఆమోద ఉత్తర్వులు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్y రికార్డుల ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు ద్వారా తేలాలని అన్నారు.ఎవరి మీదైనా నేరం రుజువైందని ముందుగానే ప్రకటించడం తమ ఉద్దేశం కాదని, అధికారుల నిర్ణయాలు చట్టబద్ధమైనవా కాదా, అవినీతి లేదా అక్రమ ప్రభావం ఏమైనా ఉందా అన్నది నిష్పక్షపాతంగా విచారించడమే ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.

*(9)*: ఎంపీ రఘునందన్ రావు కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి

ప్రజా సమస్యలను ప్రశ్నించే ఒక పార్లమెంట్ సభ్యుని కుటుంబ సభ్యుల పేర్లపై ఇంత పెద్ద విస్తీర్ణానికి సంబంధించిన భూ లావాదేవీలపై సందేహాలు తలెత్తినప్పుడు, వాటిని నివృత్తి చేయడానికి సంబంధించిన అసలు పత్రాలను ప్రజల ముందుంచడం పారదర్శకతకు దోహదపడుతుందని రవికృష్ణ అన్నారు.రఘునందన్ రావు గారూ, మీ కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైన భూములు ప్రభుత్వ అసైన్డ్ భూములు కావని చెప్పడానికి ఆధారమైన అసలు పట్టాలు, టైటిల్ చైన్,ఎన్ఓసీ NOCలు, సబ్‌డివిజన్ ఉత్తర్వులు, మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ ప్రజల ముందుంచడానికి సిద్ధంగా ఉన్నారా?

ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర విజిలెన్స్, ఏసీబీ దర్యాప్తుకు మీరు బహిరంగంగా మద్దతు ఇస్తారా?ఈ ప్రశ్నలు ప్రజాప్రతినిధిగా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించినవేనని పేర్కొన్నారు.

*(10)*: అక్టోబర్ 25న విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదు

ఈ అంశంపై 25.10.2026న తెలంగాణ విజిలెన్స్ అధికారులకు, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు వివరణాత్మక ఫిర్యాదు పంపినట్లు రవికృష్ణ తెలిపారు.ఆ ఫిర్యాదును చీఫ్ సెక్రటరీ,సీసీఎల్ఏ CCLA, సిద్దిపేట జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు మరియు సంబంధిత అధికారులకు కూడా పంపినట్లు వెల్లడించారు.
ఫిర్యాదులో ప్రభుత్వ అసైన్‌మెంట్ రికార్డులు, సేత్వార్, సప్లిమెంటరీ సేత్వార్, నిషేధిత ఆస్తుల రికార్డులు, పాస్‌బుక్కులు,ఈసీ ECలు, మ్యూటేషన్ వివరాలు, హైకోర్టు కౌంటర్ అఫిడవిట్ తదితర పత్రాలను పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.

*(11)*: ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు

*(1)* సర్వే నెం.294 మొత్తం భూమి యొక్క అసలు చట్టపరమైన స్థితిని నిర్ధారించాలి. 172 ఎకరాల 12 గుంటలు, 175 ఎకరాల 12 గుంటల మధ్య ఉన్న రికార్డు వ్యత్యాసాన్ని వివరించాలి.

*(2)* 294/1 నుంచి 294/10 వరకు అన్ని సబ్‌డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన అసలు సర్వే, రెవెన్యూ ప్రొసీడింగ్స్ బయటపెట్టాలి.

*(3)* సుమారు 84 ఎకరాలకు సంబంధించినట్లు ఆరోపిస్తున్న ఎన్ఓసీ NOCల అసలు విస్తీర్ణం, ప్రొసీడింగ్స్ నంబర్లు, ఆమోదించిన అధికారుల వివరాలు వెల్లడించాలి.

*(4)* ఖాతా నెం.60433, 60418లకు సంబంధించిన పూర్తి భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, టైటిల్ చైన్‌ను స్వతంత్రంగా పరిశీలించాలి.

*(5)* W.P.No.16161/2025లో ప్రభుత్వ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌ను అసలు అసైన్‌మెంట్ రికార్డులతో సరిపోల్చాలి.

*(6)* ఎన్ఓసీ NOCల జారీ, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లలో అవినీతి, అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిడి లేదా రికార్డుల తారుమారు జరిగిందా అనే అంశాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరపాలి.

*(7)* అసలు భౌతిక రికార్డులతో పాటు Dharani/Bhu Bharati డిజిటల్ ఆడిట్ ట్రయల్స్, ఫైల్ నోటింగ్స్, ఆమోద వివరాలను భద్రపరచాలి.

*(8)* చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే సంబంధిత చట్టాల ప్రకారం భూముల స్వాధీన పునరుద్ధరణ, అర్హులైన వారికి చట్టబద్ధమైన పునరుద్ధరణ, బాధ్యులపై శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు చేపట్టాలి.

*(9)* విచారణను సంబంధిత నిర్ణయాల్లో గతంలో పాల్గొనని స్వతంత్ర అధికారులతో నిర్వహించాలి.

*(10)* పూర్తి విచారణ నివేదిక, కారణాలతో కూడిన ఉత్తర్వులు, Action Taken Report ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

*(11)* పేద రైతుకు ఒక చట్టం — పలుకుబడి ఉన్నవారికి మరో చట్టమా?

భూమిలేని పేద రైతుల కోసం రూపొందించిన అసైన్‌మెంట్ విధానం ఉద్దేశం వారి జీవనోపాధికి భరోసా కల్పించడమేనని రవికృష్ణ అన్నారు.అటువంటి భూములపై చట్టపరమైన నిషేధాలు ఉన్నప్పటికీ, అధికారుల నిర్ణయాల ద్వారా అవి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదిలీ అయ్యాయని తేలితే అది సాధారణ రెవెన్యూ పొరపాటు మాత్రమే కాదని, ప్రజా పరిపాలనలో తీవ్రమైన జవాబుదారీతన సమస్యగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
“పేద రైతు అసైన్డ్ భూమిని బదిలీ చేస్తే చట్టం అమలవుతుంది. అదే భూమి పలుకుబడి ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల పేర్లకు వెళితే చట్టం ఎందుకు వర్తించకూడదు? చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి.”
“ప్రభుత్వం మాటలతో కాదు - అసలు రికార్డులతో సమాధానం చెప్పాలి. NOC ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఏ చట్టం ప్రకారం ఇచ్చారు? అసైన్డ్ భూమి ప్రైవేటు పట్టా భూమిగా ఎలా మారింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.”
ఈ వ్యవహారం రాజకీయ పార్టీలు లేదా వ్యక్తుల మధ్య వివాదం కాదని, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేద రైతుల హక్కులు, రెవెన్యూ అధికారుల బాధ్యత, చట్టపాలనకు సంబంధించిన ప్రజా ప్రయోజన అంశమని స్పష్టం చేశారు.
స్వతంత్ర విచారణ జరిపి, నిజానిజాలను ప్రజల ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వి. రవికృష్ణ
అడ్వకేట్

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన_

*తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన*

*తెలంగాణ గ్రూప్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC నిర్వహించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి TGPCB అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్  AEE పరీక్ష నిర్వహణ లో పారదర్శకత లోపాలు*

తెలంగాణ గ్రూప్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC నిర్వహించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి TGPCB అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్  AEE పరీక్ష నిర్వహణ లో పారదర్శకత లోపాలు ఉన్నాయి అని అభ్యర్థులు తెలిపారు.చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ,హిమాయత్ నగర్, మొయినాబాద్ పరీక్షా కేంద్రంలో నిర్వహణ లోపాలు మరియు అక్రమాలపై ఫిర్యాదు.

**అభ్యర్తులు ఎదుర్కొన్న సమస్యలు**

*(1)*: తరగతులు మరియు పరీక్ష ఒకేసారి జరగడం: పరీక్ష జరుగుతున్న సమయంలోనే కళాశాలలో విద్యార్థులకు మామూలు పాఠాలు (క్లాసులు) చెబుతున్నారు. ఒకపక్క పరీక్ష రాస్తుంటే, ఇంకోపక్క లెక్చరర్లు క్లాస్ చెప్పే శబ్దాలు (Sound) స్పష్టంగా వినిపిస్తూ తీవ్ర అంతరాయం కలిగించాయి.

*(2)*: అరకొర తనిఖీలు & గందరగోళం: కళాశాల బయట మాత్రమే హడావుడిగా తనిఖీలు (Checking) చేశారు. లోపలికి వెళ్లిన తర్వాత కళాశాల విద్యార్థులు, పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు (Aspirants) కలసిపోవడంతో అసలు ఎవరు విద్యార్థులో, ఎవరు అభ్యర్థులో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. క్లాస్ రూమ్ లోపల ఎలాంటి తనిఖీలు జరగలేదు.

*(3)*: బయోమెట్రిక్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం: బయోమెట్రిక్ విధానం అనేది అభ్యర్థి కూర్చున్న సీటు వద్ద గానీ లేదా పరీక్ష రాసే క్లాస్ రూమ్‌లో గానీ జరగాలి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేక గదిలో బయోమెట్రిక్ పూర్తి చేసి, ఆ తర్వాత హాల్ టికెట్ పట్టుకుని వేరే రూమ్‌కి వెళ్లి పరీక్ష రాయమన్నారు. దీనివల్ల బయోమెట్రిక్ ఇచ్చిన అభ్యర్థి కాకుండా వేరొకరు పరీక్ష రాసే అవకాశం ఏర్పడి, పారదర్శకత లోపించింది.

*(4)*: వరుస విద్యుత్ అంతరాయం Power Cuts: పరీక్ష జరుగుతున్న సమయంలో కనీసం 20 సార్లు కరెంట్ పోయింది. దీనివలన తీవ్ర అసౌకర్యానికి గురయ్యాము.
 
దాదాపు గా అన్నీ ఎగ్జామ్ సెంటర్స్ లో ఇదే పరిస్థితి. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కి అయినా కామన్ గా పోలీస్ బందోబస్తు ఉంటుంది .నిన్నటి ఎగ్జామ్ సెంటర్ వద్ద ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడ లేడు.

ఈ రకమైన నిర్లక్ష్యపు నిర్వహణ వలన కష్టపడి చదివి పరీక్ష రాసే అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కావున ఇలాంటి పరీక్షా కేంద్రాల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అన్నారు.