Friday, December 3, 2021

ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది? RT-PCR పరీక్షతో గుర్తించొచ్చా?

ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది? RT-PCR పరీక్షతో గుర్తించొచ్చా?

Courtesy by BBC తెలుగు Twitter 
ఒమిక్రాన్

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్‌లోనూ బయటపడ్డాయి. కర్నాటకలో రెండు కేసులను గుర్తించినట్లు ధ్రువీకరించారు.

వారిలో ఒకరి వయసు 66 సంవత్సరాలు కాగా మరొకరి వయసు 46 సంవత్సరాలు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని, ఆయన నవంబర్ 27 నుంచి క్వారంటైన్‌లో ఉన్నారని బీబీసీ కోసం పనిచేసే ఇమ్రాన్ ఖురేషికి అధికారులు చెప్పారు.

RT-PCR టెస్టుతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించొచ్చా

ఒమిక్రాన్‌ నుంచి ప్రపంచానికి పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ - డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

కొన్ని రకాల RT-PCR పరీక్షలతో ఒమిక్రాన్‌ సోకిందో లేదో గుర్తించవచ్చని WHO చెప్పింది. ఈ పరీక్షలతో ఒమిక్రాన్‌ను గుర్తించి, అది వ్యాప్తి చెందకుండా నియంత్రించొచ్చని వివరించింది. అయితే, ఇతర వేరియంట్లను గుర్తించడానికి మాత్రం జీనోమ్ సీక్వెన్స్ చేయాల్సి రావొచ్చని తెలిపింది.

కానీ, RT-PCR పరీక్షలతో ఒమిక్రాన్ సోకిందో లేదో తెలుసుకోవడం అంత సులువు కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్, ఇతర వేరియంట్ల మధ్య తేడాను చాలారకాల RT-PCR పరీక్షలు గుర్తించలేక పోతున్నాయని వారు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొంది.

డెల్టా, ఒమిక్రాన్‌ల మధ్య తేడా ఏమిటి?

ఒక వ్యక్తికి కరోనావైరస్ సోకిందా లేదా అన్న విషయాన్ని మాత్రమే RT-PCR పరీక్షలు వెల్లడిస్తాయి. కానీ ఆ వ్యక్తికి ఏ రకమైన వేరియంట్ సోకిందో ఈ పరీక్షలో తెలియదు. అలాంటప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ అవసరం అవుతుంది.

కానీ వైరస్ సోకిన ప్రతి ఒక్క శాంపిల్‌ను జీనోమ్ సిక్వెన్సింగ్‌కు పంపించలేరు. ఈ ప్రక్రియ చాలా నెమ్మెదిగా సాగుతుంది. చాలా క్లిష్టమైంది. అలాగే ఖర్చుతో కూడుకున్నది కూడా.

రోగి శరీరంలో కరోనావైరస్ ఉందా లేదా అన్నది మాత్రమే RT-PCR పరీక్షలో తెలుస్తుంది. అయితే, ఈ విషయంలో శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేసే దాదాపు పరీక్షల్లో SARS Cov-2 (కరోనావైరస్)ను గుర్తించవచ్చు.

కానీ ఆ వ్యక్తికి ఏ వేరియంట్ సోకిందన్నది మాత్రం ఇవి కచ్చితంగా నిర్ధరించి చెప్పవు. ఎందుకంటే ఈ టెస్టుల్లో, వైరస్‌లో పెద్దగా మార్పు చెందని భాగాన్ని పరీక్షిస్తారు. మ్యుటేషన్‌లో వ్యత్యాసాన్ని బట్టి వేరియంట్‌ను నిర్ణయిస్తారు.

ఒమిక్రాన్ విషయంలో.. ఈ వ్యత్యాసం స్పైక్ ప్రొటీన్‌లో వచ్చిన మ్యుటేషన్లతో ముడిపడి ఉంటుంది. మందులు, రోగ నిరోధక కణాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో తరచూ మార్పులు వస్తూ ఉంటాయి.

అందుకే ఒమిక్రాన్‌ను పరీక్షించడం కాస్త కష్టం. చాలావరకు పరీక్షలు.. ఒక వ్యక్తికి కరోనావైరస్ సోకిందో లేదో మాత్రమే వెల్లడిస్తాయి. అంతేకానీ, అతనికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిందని కచ్చితంగా చెప్పవు.

ఒమిక్రాన్

జెనెటిక్ సీక్వెన్స్‌తో వెల్లడి

ఏ రకమైన వేరియంట్ సోకిందన్న విషయం తెలుసుకోవడానికి వైద్యులు.. ఆ రోగి శాంపిల్స్‌ను జెనెటిక్ సీక్వెన్సింగ్‌ కోసం ప్రత్యేక ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ జెనెటిక్ సీక్వెన్సింగ్ సాయంతో ఒమిక్రాన్ జెనెటిక్ సిగ్నేచర్‌ను పరీక్షిస్తారు.

థర్మో షిషర్ సైంటిఫిక్ కంపెనీ ప్రవేశపెట్టిన పీసీఆర్ పరీక్ష.. కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడమే కాదు, అది ఏ వేరియంట్ అన్నదాన్ని కూడా పరీక్షిస్తుంది.

ఈ పరీక్ష కరోనావైరస్ మూడు భాగాలపై దృష్టి సారిస్తుంది. వీటిలో రెండు భాగాలు స్థిరంగా ఉంటాయి. ఇక మూడోది వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో వచ్చిన మార్పులను గమనిస్తుంది.

ఒక వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకితే, టెస్టులోని మొదటి రెండు భాగాలు పాజిటివ్ వస్తాయి.

అయితే, అల్ఫా వేరియంట్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది.

కానీ ఒక వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లయితే, వైరస్ స్పైక్ ప్రొటీన్ భాగంపై జరిపిన పరీక్షలో నెగెటివ్ వస్తుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 99శాతం కేసులు డెల్టా వేరియంట్‌ కేసులే.

డెల్టా వేరియంట్‌ విషయంలో మాత్రం ఒమిక్రాన్‌లో వస్తున్నట్లు మూడో భాగంలో నెగెటివ్ రావడం లేదు. థర్మో షిషర్ పీసీఆర్ టెస్టులో మూడు భాగాల్లోనూ పాజిటివ్ ఫలితాలే వస్తున్నాయి.

అంటే ఈ పరీక్ష చేసినప్పుడు మూడు భాగాల్లో పాజిటివ్ వస్తే..అది డెల్టా వేరియంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒమిక్రాన్ గురించి మొదట చెప్పిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్
ఫొటో క్యాప్షన్,

ఒమిక్రాన్ వేరియంట్‌ గురించి మొదట చెప్పిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్

చాలా స్వల్ప లక్షణాలు

ఈ కొత్త వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఆ తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. కొత్త వేరియంట్‌ను నవంబర్ 24న డబ్ల్యూహెచ్‌ఓ నిర్ధారించింది. గత వారం దీనికి ఒమిక్రాన్ అని పేరుపెట్టింది.

ముందుగా అనుకున్న దానికంటే ఈ వేరియంట్‌లో మ్యుటేషన్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది.

ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ మొదట గుర్తించారు.

ఈ వేరియంట్ సోకిన వాళ్లకు చాలా తేలికపాటి కోవిడ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆమె బీబీసీకి చెప్పారు.

ఒంటి నొప్పులు, తీవ్రమైన అలసట ఉన్నట్లు చాలా మంది రోగులు చెబుతున్నారని ఆమె అన్నారు. అయితే, తాను చెబుతున్నది యువకుల గురించి మాత్రమేనని, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి గురించి కాదని ఆమె వివరించారు.

అయితే, ఈ వేరియంట్‌ కలిగించే వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఇంకాస్త సమయం పడుతుందని డాక్టర్ ఏంజెలిక్ చెప్పారు.

ఒమిక్రాన్

ఇదెంత ప్రమాదకరం?

అన్ని రకాల మ్యుటేషన్లు ప్రమాదకరం కాదు. అందుకే వైరస్‌లో ఎలాంటి మ్యుటేషన్లు వచ్చాయన్నది చాలా కీలకం.

ఒక్క విషయం మాత్రం స్పష్టం. చైనాలోని వూహాన్‌లో బయటపడిన ఒరిజినల్ కోవిడ్19 వైరస్‌కు, ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రాథమికంగా భిన్నంగా ఉంది.

అంటే.. ఒరిజినల్ వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కోవిడ్ వ్యాక్సీన్లు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై పెద్దగా పనిచేయకపోవచ్చన్న ఆందోళన ఉంది.

ఇతర వేరియంట్లలోనూ కొన్ని రకాల మ్యుటేషన్లను గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో వాటి పాత్ర ఏంటన్నది శాస్త్రవేత్తలకు అవి కొంత సమాచారం ఇవ్వొచ్చు. ఉదాహరణకు.. N501Y అనే మ్యుటేషన్ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.

శరీర రోగ నిరోధక శక్తి.. వైరస్‌ను గుర్తించకుండా చేసే కొన్ని మ్యుటేషన్లు ఉన్నాయి. అలాంటివి వ్యాక్సీన్ సమర్థతపై ప్రభావం చూపుతాయి. మరికొన్ని మ్యుటేషన్లు పూర్తి భిన్నంగా ఉంటాయి.

No comments:

Post a Comment