Thursday, June 25, 2026

_బెదిరించి డబ్బు వసూలు, నకిలీ పత్రాల సృష్టి మరియు భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్_

*బెదిరించి డబ్బు వసూలు, నకిలీ పత్రాల సృష్టి మరియు భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా క్రమబద్ధంగా బెదిరించి డబ్బు వసూలు చేయడం, నకిలీ పత్రాలను సృష్టించడం, నేరపూరిత కుట్ర మరియు భూ ఆక్రమణలకు పాల్పడుతున్న నేరస్తుడిని చాదర్‌ఘాట్ పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారు.నిందితుడు మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, వ్యాపారవేత్త, బండ్లగూడ (హైదరాబాద్) నివాసి. హైదరాబాద్‌లోని న్యూ మలక్‌పేటకు చెందిన శ్రీ మహమ్మద్ నజముద్దీన్ షాకిర్ ఒక ఫిర్యాదు చేశారు. GHMC అనుమతితో తన కుటుంబానికి చెందిన పూర్వీకుల స్థలంలో నిర్మాణం మొదలైన తర్వాత, మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ నకిలీ 'హిబానామా' (బహుమతి దస్తావేజు) పత్రాలు మరియు నకిలీ స్టాంప్ పేపర్లను ఉపయోగించి ఆ ఆస్తిపై తప్పుడు యాజమాన్య హక్కులను ప్రకటించాడని ఆయన ఆరోపించారు.ఈ వివాద సమయంలో, ఖుద్దూస్ తరపున వ్యవహరించిన సహ-నిందితుడు రాజా (A-2), ఫిర్యాదుదారుని రూ. 10 లక్షలు డిమాండ్ చేయడంతో పాటు, తప్పుడు క్రిమినల్ కేసులతో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత, ఇద్దరు నిందితులు కలిసి ఫిర్యాదుదారుని భయపెట్టారు మరియు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే హత్య కేసుల్లో ఇరికిస్తామని బెదిరించినట్లు తెలిసింది.ఆస్తులపై తప్పుడు యాజమాన్య హక్కులను ప్రకటించడానికి, అలాగే న్యాయపరమైన చిక్కులు మరియు తప్పుడు క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేయడానికి నిందితుడు తరచుగా నకిలీ 'హిబానామా' పత్రాలను ఉపయోగించేవాడు. విచారణలో, అతను పలువురు బాధితుల నుండి సుమారు రూ. 40 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. బెంగళూరుకు పారిపోయిన నిందితుడిని ప్రత్యేక పోలీసు బృందం గుర్తించి అరెస్టు చేసింది; తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

_రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా_

*ఐటీ కారిడార్‌లో 5 ఎక‌రాల భూమికి హైడ్రా ఫెన్సింగ్‌*

*రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. స‌ర్వే నంబ‌రు 42లో మెట‌ల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. అక్క‌డ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గ‌దిని కూడా నిర్మించారు.5 ఎక‌రాల చుట్టూ రేకుల షీట్ల‌తో ప్ర‌హ‌రీ కూడా నిర్మించే క్ర‌మంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి త‌న‌దిగా చెబుతూ ఎవ‌రినీ అటువైపు రానీయ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితుల్లో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డుల‌తో పాటు.. నిర్మించిన గ‌దితో పాటు ఫెన్సింగ్‌ను హైడ్రా తొల‌గించింది. 
మొత్తం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యికోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

_"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే"_

*నల్లగొండ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచింది*

*ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయం*

*ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో మూతపడే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుండటం గ్రామ ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ప్రభుత్వ విద్యను కాపాడాలని వేదికలపై మాట్లాడేవారు చాలా మంది ఉన్నప్పటికీ, ఆ మాటలను ఆచరణలో చూపించే వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రజాసేవకు, తాను నమ్మిన రాజకీయాలకు కార్యాచరణే ప్రాణమని విశ్వసించే వై. పురుషోత్తం రెడ్డి, "ముందుగా మనం మారితేనే సమాజం మారుతుంది" అనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం విశేషమని పేర్కొంటున్నారు.ఇటీవల పాఠశాల పరిస్థితులను పరిశీలించిన సందర్భంగా, గత విద్యా సంవత్సరంలో మొత్తం 23 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 10 మంది పై తరగతులకు వెళ్లిపోయిన తర్వాత కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరంలో వై. పురుషోత్తం రెడ్డి గారి ఇద్దరు కుమారులు, మరో బీసీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి చేరడంతో ప్రస్తుతం మొత్తం 16 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు.అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఒకే గదిలో బోధన కొనసాగుతోంది. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడటం అంటే కేవలం ఒక భవనం మూతపడటం కాదని, పేద పిల్లల విద్యా అవకాశాలు, గ్రామ భవిష్యత్తు, సామాజిక సమానత్వం దెబ్బతినడమేనని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరచడం, ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించడం, గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయడం ద్వారా మాత్రమే ఊరి బడిని కాపాడగలమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనేది కేవలం విద్యాశాఖ బాధ్యత మాత్రమే కాదని, అది సమాజం మొత్తం బాధ్యత అని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి. వై. పురుషోత్తం రెడ్డి చూపించిన ఆచరణను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మాత్రమే కాదు, గ్రామీణ ప్రభుత్వ విద్య కూడా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*సందేశం*

"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే."

"ఊరు బడి కోసం మాటలు కాదు... పిల్లల అడ్మిషన్‌లే నిజమైన మద్దతు."

Wednesday, June 24, 2026

హైదరాబాద్ మెట్రో దారి ఎటువైపు?

_పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి_

*పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి*

*తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే*

*ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్*

*అనురాధ రావు అధ్యక్షులు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

పిల్లల చదువు పేరుతో తల్లితండ్రల జేబు ఖాళీ చేస్తున్నాయి విద్యాసంస్థలు. బత్తిడి చేసి బయట 20 రూ|| దొరికే నోటు పుస్తకం - 40రూ॥లకు అమ్ముతున్నారు వీళ్లు. ఇది చాలా తీవ్రమైన విషయం.ఇటీవల సోషల్ మిడియాలో కొన్ని విడియోలు వైరలు అవుతున్నాయి, ప్రైవేటు స్కూల్స్, కాలేజేలకి సంబంధించినవి. వీటిలో భారిగా స్టేషనరీ నిలవలు, యూనిఫాం, బ్యాగులు, సాక్స్ కనిపిస్తున్నాయి. ఈ సంస్థలు అన్నీ కూడా బాగా పేరు పొందినవే. (Narayana school kothapet, Sloka International school, Sri Triveni school, Pulla Reddy Memorial school, Dilshuknagar Public school, Srichaitanya) etc...ఒకవేళ పేరెంట్ బయట కొంటే ప్రధానోపద్యాయులే పేరెంట్స్ పై తిరగబడిన సంఘటనలు కూడా చూస్తున్నం.మీరు ఇక్కడే కొనాలి అని, అన్నింటిపై వీరి సంస్థ బ్రాండ్ ప్రింట్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇది తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే కదా.
విద్యారంగం సేవారంగంలో ఉండాలి, కాని పూర్తి వ్యాపర రంగంగా మార్చేశారు.అధికారుల కళ్ళు మూతలు పడ్డాయా? వీళ్ల దృష్టిలో లేదు అని అనుకోవడం తప్పు, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటే ఏ ఒక్క అధికారికి తెలియదు అని అనుకోకుండా ఉండలేం.పూర్తిగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది .ఈ వైరల్ విడియోల ఆరోపణలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి గారు, అధికారాలు స్పందించాలని, వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నది బాలల హక్కుల సంఘం.రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
బలవంతపు స్టేషనరీ అమ్మకాలు జరుగుతున్న విషయంపై విచారణ చేయాలి.మార్కెట్ ధరలకంటే అధిక ధరలతో విక్రయిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలి.తల్లి తండ్రులు ఎంపిక చేసుకునే హక్కును రక్షించాలి.పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి. ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్

*తెలంగాణ మేధావులతో దిగిన ఈ ఫోటో పట్ల చాలా మందికి ఆసక్తి ఉంది - పవన్ కళ్యాణ్*


*తెలంగాణ మేధావులతో దిగిన ఈ ఫోటో పట్ల చాలా మందికి ఆసక్తి ఉంది - పవన్ కళ్యాణ్*

*ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసిన ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

తెలంగాణ ఉద్యమం మరియు 'సామాజిక తెలంగాణ' భావన చుట్టూ సాగిన లోతైన చర్చలతో కూడిన ఆ రోజులను ఈ ఫోటో గుర్తుచేస్తుంది అని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.బహుజన భావజాలం, సామాజిక న్యాయం మరియు అణగారిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలు మా చర్చల్లో ప్రధానంగా ఉండే రోజులు అవి. తెలంగాణ మేధావులతో పాటు బహుజన ఉద్యమకారులు అగస్టీన్ గారు, విప్లవ గాయకులు గద్దర్ గారు మరియు ఇతరులతో కలిసి, మేము తరచుగా తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికారం యొక్క న్యాయమైన పంపిణీ ఆవశ్యకత మరియు 'సామాజిక తెలంగాణ' అనే విస్తృత లక్ష్యం గురించి లోతుగా చర్చించేవాళ్ళం. నా తండ్రి శ్రీ కొణిదాల వెంకట్ రావు గారు మరణించిన తర్వాత, అగస్టీన్ గారు మరియు గద్దర్ గారు మా ఇంటికి వచ్చినప్పటి (పీఆర్పీ పార్టీ ఏర్పాటుకు ముందు నాటి) దృశ్యం ఇది. రాజకీయాలకు అతీతంగా, సామాజిక మార్పు, సమానత్వం మరియు సామాజిక న్యాయం రాజకీయ అధికారంగా మారాలనే ఆకాంక్షతో కూడిన చర్చలు జరిగిన ఆ కాలానికి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం ఇది.

*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*

*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

జ్వలంత జాతీయవాద చింతకుడు, గొప్ప విద్యావేత్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మన మార్గదర్శకులు పూజ్య డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా, నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు.ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ “ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం” అనే దృఢ సంకల్పంతో, మాతృభూమి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం డా. ముఖర్జీ గారు తన ప్రాణాలను అర్పించారు అని అన్నారు. ఆయన జీవిత త్యాగం, ధైర్యం, తపస్సు మరియు అచంచల దేశభక్తి చిరస్మరణీయ గాథగా నిలిచింది.జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైభవం మరియు దేశ సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది అని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యం వైపు మనం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో, ఆయన ఆదర్శాలు ప్రతి అడుగులోనూ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అని అన్నారు.భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే త్యాగం, పోరాటం చేసిన ఈ మహనీయ జాతీయ నాయకుడికి పునఃపునః వందనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Friday, June 19, 2026

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ - నిద్దురమత్తులో తెలంగాణ విద్యాశాఖ

*మీ పిల్లలను ఏ స్కూల్లో చేర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.*

*అది ప్రభుత్వ గుర్తింపు పొందినదా? లేదా ?*

*తెలంగాణ విద్యా శాఖ కీలక పెచ్చరికలను జారీ చేసింది.*

*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలలహక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 19:

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు,గుర్తింపు లేకుండా పుట్ట గొడుగుల్లా ప్లే స్కూళ్లు, Primary, High school వెలిసాయి. అవి చిన్న చిన్న  భవనాల్లో బహుళ అంతస్తుల్లో కనీస వసతులు లేకుండా తగినంత ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలలు 500 పైగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి.మన విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి వచ్చినా, గాఢ నిద్రలో ఉన్నారు,
వారికి ఏమీ పట్టదు.యధేచ్చగా స్కూళ్లు తమ వ్యాపారాలు చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన విధంగా ఉంది.తీసుకున్న జీతానికి న్యాయం చేయండి,పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.విద్యాశాఖ అధికారులు మీ కుర్చిలనుండి దిగి పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం విన్నపం.ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ల వివరాలను జిల్లాల వారిగా, మండలాల వారిగా అధికారిక పోర్టల్లో అందుబాటులో పొందుపరిచారు. Website: 
www.schooledu.telangana,gov.in 
మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, చేసేది వేరే. ఆ శాఖ ముఖ్య మంత్రి గారి దగ్గర వుంది. అధిక ఫిజులకు అడ్డుకట్ట వేస్తా అంటున్నారు  కానీ దోపిడి చేస్తున్న ఉన్నారు స్కూల్ యాజమాన్యాలకు అడ్డుకట్ట వేయడం లేదు.తల్లిదండ్రులకు విజ్ఞప్తి,ఫీజులు కట్టే ముందు ఒక్క విషయం చెక్ చేయకపోతే మీపిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు.ఒక వేళ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ...
* విద్యా ప్రమాణాలు సరిగా ఉండవు
* భద్రతా నిబంధనలు పాటించరు, మీ పిల్లల భద్రత మీదే.
* అర్హత లేని సిబ్బందితో భోధన  
* భవిషత్తులో సర్టిఫికెట్లకు సమస్య అవుతుంది.
స్కూల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చెక్ చేయండి అధికారిక వెబ్ సైటులో ఆ స్కూల్ పేరు ఉందో లేదో చూడండి.అఫిలియేషన్ వివరాలు తీసుకోండి CBSE, ICSE of State Board  ఏదైనా సరే, దానికి సంబంధించిన వివరాలు.స్కూల్ ను స్వయంగా సందర్శంచండి, ప్రకటనలు చూసి మోసపోకండి. తరగతి గదులు, భద్రత,మరుగుదొడ్లు,తాగునీటి సౌకర్యం,ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఎలా ఉంది, ఒక వేళ బస్సు అయితే, ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందా? బస్సు లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, అన్ని అనుమతి పత్రాల గురించి అడగండి.చెల్లించిన డబ్బుకు రసీదులు అన్ని బద్ర పరుచుకోవాలి.అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి, విద్యాబోధన ఏవిదంగా ఉంది అని. తెలుసుకోవాలి.అన్ని గుర్తింపు పత్రాలు చూడాలి.
పిల్లల విద్య పెట్టుబడి కాదు, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.స్కూల్ లో చేర్చుకునే సమయం లో పిల్లలకు ఐడి క్రియేట్ చేస్తారు అదే"పెన్"
నెంబర్,11 డిజిట్స్ తో క్రియెట్ చేస్తారు, దీని వల్ల పిల్లల చదువులు ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ట్రాక్ చేయడానికి, బోర్డు ఎగ్జామ్స్ కు ఉపయెగ పడుతుంది. ఇది క్రియేట్ అయ్యాక 'అపార్' ఐడి క్రియేట్ చేస్తారు,
ఇది ఒక యూనిక్ ఐడి.12 డిజిట్స్ తో ఉంటుంది. ఈ ఐడి లో పిల్లల మార్కులు, వారి అకాడమిక్ రికార్డ్స్, సర్టిఫికెట్స్ అన్ని ఒక డిజి లాకర్ లో డిజిటల్ గా భద్రపరుస్తారు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్/ అడ్మిషన్ కోసం సులభం అవుతుంది.
One Nation,One student ID అని నేషనల్ ఎజుకెషన్ పాలసీ 2020 ప్రకారం 2023/25 విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభం అయింది.

Wednesday, June 17, 2026

_జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది_

*పాత్రికేయ కుటుంబాలకు అండగా తెలంగాణ మీడియా అకాడమీ*

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మొత్తం 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయబడింది. ఇందులో 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మరియు 4 మంది అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1,00,000 ఏకమొత్తo ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, అలాగే కుటుంబంలోని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 159 మందికి యిలాంటి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.  

అనంతరం సభలో పాల్గొన్న వారందరూ తమ మధ్య నేడు లేని పాత్రికేయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు,  మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, జర్నలిస్టులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.                                                              *Bplkm✍️*

Friday, June 12, 2026

మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్_

*మానవత్వం పరిమళించే - CPR చేసి మహిళ ప్రాణాలు కాపాడిన "క్రైమ్ రిపోర్టర్"*

*మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

మౌలాలి రైల్వే స్టేషన్ లో జనవరి 5,2026 న జరిగింది ఈ సంఘటన.ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళ మౌలాలి లో స్టేషన్ కు చేరుకున్న తరువాత ట్రైన్ లో నుండి దిగుతూ కాలు జారీ ట్రైన్ కింద పడిపోయింది.అందరు చూస్తున్నారు కానీ ఆపదలో ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి సహాయం చేద్దాం అనే వారు కరువయ్యారు. ఇదే ట్రైన్ లో ఖమ్మం నుంచి వస్తున్న సురేష్ ఈ సంఘటన చూసి తన మిత్రుడు అయిన *క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్* కు ఫోన్ చేయగా  "యాదృచ్ఛికం" గా మౌలాలి పరిసర ప్రాంతంలో ఉన్న విజయ్ కుమార్ వెంటనే మౌలాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి ట్రైన్ కింద పడిపోయిన మహిళను పైకి లాగి మహిళకు CPR(కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - Cardiopulmonary Resuscitation) చేసి ఆ మహిళను అంబులెన్సు లో తీసుకెళ్లి ప్రాణం కాపాడిన రామంతాపూర్ కి చెందిన హైదరాబాద్ క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్.ఎవరైనా గుండెపోటుతో పడిపోయినా లేదా శ్వాస ఆడక స్పృహ కోల్పోయినా, వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మెదడుకు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కొనసాగుతుంది. ఇది వారి ప్రాణాలను కాపాడే అవకాశం.ప్రతి ఒక్కరు CPR శిక్షణ (Training), ప్రథమ చికిత్స (First-aid) గురించి అవగాహన చేసుకుంటే ఇలాంటి సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు.ఈ సమాజంలో ఎవరికి ఏమైతే నాకు ఏంటి అనుకునే ఈ వ్యవస్థలో మహిళను కాపాడిన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ కి అభినందనలు.

బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం_

*జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం...*

*బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం*

*బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

పాలు కావలని అడిగే చేతులు - పనిముట్లను,ఇటుకలను మోస్తున్నాయి, ఇది బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం. *International labour Organization* 2003 లో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపడానికీ, దీని గురించి అవగాహనకల్పించడం, కావల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది.138 మిలియన్ పిల్లలు అంటే 13.8 కోట్ల చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారు. దీంట్లో 54 మిలియన్ / 5.4 కోట్ల మంది చిన్నారులు హానికరమైన పనుల్లో బలైతున్నారు.ఒక చిన్నారి రాత్రి 12 గంటల వరకు పని చేసి, ఉదయం పుస్తకాల సంచితో స్కూల్ కు వెళ్ళితే, ఆ బ్యాగు బరువు పుస్తకాలది కాదు, తన బాల్యానిది.చాలా వరకు చిన్న పిల్లలు పాలకోసం లేస్తారు కాని, ఈ చిన్నారులు పనికోసం లేస్తున్నారు. వీరిచేతుల్లో పుస్తకాలకు బదులుగా స్తుత్తి, పార, ఇటుకలు మోస్తూ, హోటల్స్లో టీ కప్పులు కడుగుతూ, ప్లేట్లు తీస్తు కనిపిస్తారు, ఇండ్లల్లో పనులు చేస్తూ ఉంటారు.కారణం పేదరికం, అనాధలుగా మరడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం, ట్రాఫికింగ్ కు గురి కావడం.ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది.మన దేశంలో ప్రతి ఆరునెలలకు ఒక రిస్క్యు ఆపరేషన్ జరుగుతుంది, జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మైల్. దీంట్లో తప్పిపోయిన చిన్నారులను, బాలకార్మికులను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.కాని సంవత్సరాలు మారుతున్నాయి,
బాలకార్మిక వ్యవస్థలో మార్పు లేదు. ఆపరేషన్ ముస్కాన్లో దొరుకుతున్నారు, ఆపరేషన్ స్మైల్లో దొరుకుతున్నారు. అది
ఒక మొక్కుబడి కార్యక్రమం అని అనుకోవచ్చు. కారణం ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుంతుంది.మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ బాలకార్మికులు ఉన్నారు, వారు ఇతర రాష్ట్రాలకు కూడా ముఠాలు తీసుకుని వెళుతాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర.ప్రతి చిన్నారి స్కులుకు వెళ్లాలి, బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించాలి.బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాన్ని, వారి ఫ్యాక్టరీలను/ సంస్థలను ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్థలు, హోటల్స్, గాజుల ఫ్యాక్టరీలు, ముఖ్యంగా బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఏవైనా సరే సీజ్ చేసి కఠినంగా శిక్షలు,భారి జరిమాన విధించాలి.ప్రతిఒక్కరు తమ బాధ్యతగా ప్రతిజ్ఞ చేయాలి ,నా చుట్టూ ఉన్న పిల్లలను పని చేయకుండా స్కూల్ కు పంపుతాను అనే ప్రతిజ్ఞ చేద్దాం. ఆటపాటలతో వారి బాల్యాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. బాల్యాన్ని చిదిమి వేయకుండా బడికి వెళ్లే విధంగా చుద్దాం - వారికి చేయుత నిద్దాం.

GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు_

*GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు*

*అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని GHMC కమీషనర్, సికింద్రాబాద్ జోనల్ కమీషనర్,అంబర్పేట్ డిప్యుటీ కమీషనర్*

*అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను GHMC అధికారులు గౌరవిస్తలేరు - బాపట్ల కృష్ణమోహన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

అంబర్పేట్ బాపు నగర్ అంబికా సారీస్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణం అక్రమమా? సక్రమమా? అంబర్పేట్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ సమాధానం చెప్పాలి.ఐదు ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేశారు.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఐదు ఫ్లోర్లు & పెంట్ హౌస్ వేసే దాకా GHMC అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ? TGBPASS / బిల్డ్ నౌ లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం. సెట్‌బ్యాంక్ ఉల్లంఘనలు అంటే స్థలాన్ని వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేస్తున్నారు. కమర్షియల్ మార్పులు అంటే నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుంటే తక్షణమే ఆ నిర్మాణంను ఆపితే యజమానికి నష్టం జరుగదు. లేకపోతే అట్టి అక్రమ నిర్మాణంను అడ్డుపెట్టుకొని అవినీతి GHMC అధికారులతో కుమ్మక్కై కొందరు ప్రజాప్రతినిధులు / రాజకీయ నాయకులు / మీడియా ప్రతినిధులు అక్రమ నిర్మాణ యజమాని వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుంటుండ్రు అని నిత్యం ఫిర్యాదులు.వీళందరు కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయానికి గండి కొడుతున్నారు.ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు తీరని నష్టం.మున్సిపల్ చట్టాలను, TGBPASS నిబంధనలు ఉల్లంగించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు అని గతంలో కూడా "మీడియా టుడే" లో వార్త కథనాలు వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. కానీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు అంటే అవినీతి కి పాల్పడుతున్న అంబర్పేట్ జిహెచ్ఎంసి అధికారులు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై GHMC కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భవనాలను సీజ్ చేస్తున్నాం అన్నారు కానీ ఆలా జరగడం లేదు.సీజ్ చేసిన భవనాలు పూర్తి కూడా అయి గృహప్రవేశం అయిన సందర్భాలు ఎన్నో.
రాజకీయ రక్షణ, ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే అవినీతి అధికారులు వందల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టగలుగుతున్నారు.తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అని అర్ధం అవుతుంది.ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి నిత్యం ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / ఫేస్ బుక్ ద్వారా సీఎం కమ్ పురపాలక శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి,తెలంగాణ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ముఖ్య కార్యదర్శికి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (MA&UD & HMDA) జయేష్ రంజన్,IAS కు,జిహెచ్ఎంసి కమీషనర్ కు,సైబరాబాద్ కమిషనర్ కు, మల్కాజిగిరి కమీషనర్ కు, అన్ని జోనల్ కమిషనర్లకు కు, డిప్యుటీ కమీషనర్లకు వందల ఫిర్యాదులు.GHMC ట్విట్టర్ ఆన్లైన్ లో ఎన్నిసార్లు 
ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం అని సమాధానం వస్తుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ? అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను గౌరవించరు ఎందుకు ?అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు గతంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అక్రమ నిర్మాణాల పై మౌనం వహిస్తే ఎట్లా ? అంబర్పేట్ సర్కిల్ లో చాలా అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై పూర్తిగా విచారణ జరిపించాలి... బాపట్ల కృష్ణమోహన్.

Thursday, June 11, 2026

బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!

*బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!*

*ప్రజావాణిలో ఫిర్యాదు – విచారణకు ఆర్డీఓ ఆదేశాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకులపాడు గ్రామానికి చెందిన గందం జ్యోతి భర్త అశోక్ తనకు పూర్వీకుల ఆస్తిలో రావలసిన మూడు ఎకరాల 10 గుంటల భూమిని అక్రమంగా కాజేయడానికి జరిగిన భారీ కుట్రపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, తాను బ్రతికి ఉండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి, తన అన్న అయిన బొడ్డు విజయ్ (తండ్రి వీరమల్లు) కొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమ పట్టా పొందినట్లు ఆరోపించారు. తనకు చట్టబద్ధంగా రావలసిన వాటా భూమిని దోచుకునేందుకు ఈ కుట్ర జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు గందం జ్యోతి ప్రజావాణి ఫిర్యాదు నంబర్: PV-B 172/2026, తేదీ: 04-06-2026 ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన నల్లగొండ జిల్లా ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి గారు విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాలి గౌరారం తహసీల్దార్ (ఎంఆర్వో)కు ఆదేశాలు జారీ చేశారు.*ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి..*:ఒక మహిళ బ్రతికి ఉండగానే ఆమెను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టుగా చూపించేంత ధైర్యం ఎవరిచ్చారు? తప్పుడు ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అక్రమ పట్టా పొందడానికి ఎవరు సహకరించారు? ప్రభుత్వ భూముల రికార్డులను తమ ఇష్టానుసారం మార్చుకునే మాఫియాలకు అధికార యంత్రాంగంలో అండదండలు ఉన్నాయా? ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, వాటికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గందం జ్యోతికి చట్టబద్ధంగా రావలసిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.

*హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.*

*హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తల్లితండ్రుల ఫిర్యాదు*

*మీడియా టుడే ను ఆశ్రయించిన పేరెంట్స్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

మా కుమార్తె జె. శ్రీనికా (నర్సరీ) ఉప్పుగూడ హనుమాన్ నగర్ లో ఉన్న విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ లో నర్సరీ చదువుతోంది. ఆమెకు సంబంధించిన ఒక తీవ్రమైన అంశాన్ని బాధ్యత గల తల్లితండ్రులుగా మేము జె.శ్రీ సాయి హరికిరణ్ (తండ్రి),
జె. రవళిక (తల్లి)హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తేది 20-04-2026 న తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.20-04-2026 తేదీన మా కుమార్తె రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి తల్లి జె. రవళిక పాఠశాల వెళ్లినప్పుడు, స్కూల్ అడ్మిన్ సిబ్బంది (శ్రీమతి స్వప్న) రిపోర్ట్ కార్డ్ అందజేసి, ఎటువంటి సరైన కారణం లేదా వివరణ ఇవ్వకుండా మా కుమార్తెను పాఠశాల నుండి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విధమైన ప్రవర్తన పూర్తిగా అనుచితమైనది మరియు ఆమోదయోగ్యం కానిది.
అంతేకాకుండా, గతంలో ఒక ఉపాధ్యాయురాలు మా కుమార్తెపై శారీరకంగా దాడి చేసిన సంఘటనను కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఆమె ముఖంపై ఉపాధ్యాయురాలి వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయంపై మేము పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, వారు బాధ్యతారాహిత్యంగా స్పందించి మా ఆందోళనలను సరైన విధంగా పరిష్కరించలేదు.ఇంకా, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవర్తన కూడా అత్యంత అవృత్తిపరమైనది మరియు అవమానకరమైనది. ఆమె అహంకారపూరితమైన మరియు అనుచితమైన భాషను ఉపయోగిస్తూ, “మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేసుకోండి, నాకు ఎలాంటి సమస్య లేదు” అని సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాఖ్యానించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇటువంటి ప్రవర్తన చాలా ఆందోళనకరమైనది.ఇలాంటి వాతావరణం చిన్నపిల్లల భద్రతకు మరియు మానసిక వికాసానికి హానికరంగా ఉంటుంది.అందువల్ల హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి, పాఠశాల యాజమాన్యం మరియు సంబంధిత సిబ్బంది దుర్వ్యవహారంపై తగిన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, విద్యార్థుల భద్రత, గౌరవం మరియు సంక్షేమాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.తేది 13-05-2026 నాడు  RTIA పిటిషన్ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు... స్పందన కోసం తల్లితండ్రులు వేచి చూస్తున్నాము అని అన్నారు.

Monday, June 8, 2026

_NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది_

*NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది*

*ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది*

*CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు*

*అనురాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

ప్రపంచ సమయాన్ని మార్చే ముందు భూమధ్య రేఖ ఎక్కడ ఉందో మన  కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి తెలుసా? April నెల 2026 ఉజ్జయినిలో జరిగిన అంతర్జాతీయ "Master of Time సదస్సు" లో ధర్మేంద్ర ప్రదాన్ గారు మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు ఉపయోగిస్తున్న Greenwich Mean Time (GMT)
స్థానంలో మహకాల్ స్టాండర్డ్ టైం పరిగణలోకి  తీసుకోవాలని సూచించిన మహా మేధావి మన కేంద్ర విద్యాశాఖ మంత్రి .ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే,ఉజ్జయినిలో ఈ భుమధ్య రేఖ మరియు కర్కాటక రేఖ  కలుస్తాయని చెప్పారు.అంటే ఎంత మేధావో మన మంత్రి గారు, అవి సమాంతర రేఖలు, భౌగోళికంగా కలిసే అవకాశం లేదు అనే విషయం తెలియదా? అందుకే విద్యాశాఖ మంత్రి అయ్యారు.ప్రపంచ సమయ ప్రమాణాన్ని మార్చడం అనేది అంతంతీయ స్థాయి విషయం అని కూడ తెలియని మేధావి చేతిలో విద్యావ్యవస్థ ఉంది.ఒక దేశ ప్రధాని కాని,మంత్రి కాని ఈ టైం మార్చగలరా? May 3వ తేదిన NEET UG 2026 పరీక్ష నిర్వహించారు,22 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు.
ప్రతి సంవత్సరం లాగే పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ కావడం,పరీక్ష రద్దు చేయడం జరిగింది.సంవత్సరాలు మారుతున్నాయి కాని పేపర్ లీకేజీ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం.
పరీక్ష రద్దు,మళ్లి పరీక్ష నిర్వహణ అనే స్థాయికి ఎదిగాం.ఒక పేపర్ లీక్ అంటే లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేయడం.ఎన్ని కుటుంబాలు ఆవేదనకు గురైతాయి? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల పై పెట్టుకుంటారు. ఆ కలలు బుడిదైతే బాధ్యత ఎవరిది?.NEET కోసం ఆరవ తరగతి నుండే కోచింగ్ ప్రారంభం అవుతుంది.దానికోసం అధిక ఫీజులు వసూలు చేస్తాయి పాఠశాలలు.ఇంటర్ లో సెపరేట్ కోచింగ్.ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలిసిన విషయమే. ఒక సాధారణ కుటుంబం మళ్లి మళ్లి ఇలా ఖర్చు చేయాలి అంటే ఆ కుటుంబం వీధిన పడ్డట్టు.అటు మానసికంగా, ఇటు ఆర్థికంగా దెబ్బ తింటున్న కుటుంబాలు ఎన్నో.ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక ఈ సమస్య ఉండగానే CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు బయట పడ్డాయి. వేల సంఖ్యలో విద్యార్థులు మార్కింగ్ లోపాల పై ఫిర్యాదులు చేశారు.ఒకరి ఆన్సర్ షీట్ వేరే వాళ్ళకు, ఒకరికి ఖాలీ షీట్, ఒక ప్రశ్న కు వేరే ఆన్సర్ అలా రకాల రకాలుగా వచ్చాయి. 
ఇక దరఖాస్తుల పేరిట 100 రూపాయలు, వెరిఫికేషన్కు వంద, ప్రశ్నలు చూడాలి అంటే ప్రతి ప్రశ్నకు 25 రూపాయలు ఇలా దోచుకోవడం. అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారు - వ్యత్యాసాలు ఉన్నాయి అని కాజువల్ అన్నారు.కాని ఏం చేశారు ఆ తప్పు చేసిన వారిని ?  
2019 లో గ్లోబరీనా చేసిన నిర్వాకానికి 25 మంది విద్యార్థులు బలి అయ్యారు. ఇలాంటి
అదే గ్లోబరీనా కంపెనీకే (పేరు మార్చుకున్నా) ఈ On Screen Marking పనిని అప్పగించారు.
ఇట్లా జరిగితే వేరే ఏదేశ ప్రజలైనా నిలదిసే వారు, కాని మన దేశంలో నాకెందుకు అని అనుకోవడం.
ఇదే తమ పిల్లలకు జరిగితే ఊరుకుంటారా? మనకున్న చట్టాలను గౌరవిస్తే ఇన్ని దారుణాలు జరిగేవా? ఇంత మంది విద్యార్థులు చనిపోతే కనీసం బాధ్యత లేని ప్రభుత్వం.
మన ప్రధానమంత్రి కి చదువు గురించి పట్టదు, పిల్లలు ఆశగా మన్ కి బాత్ ప్రోగ్రాం చూస్తే/వింటే ఒక్క మాట కూడ ఈ సమస్యలపై స్పందించలేదు.ఎప్పుడైతే విద్యావ్యవస్థ పై నమ్మకం కోల్పోతామో,భవిష్యత్తు పై నమ్మకం కోల్పోతాం.ఇలాంటి వారు వారి పదవులకు రాజీనామ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి నిరసన ప్రదర్శన జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ ప్రదర్శన లో బాలల హక్కుల సంఘం తరఫున తమ డిమాండ్ తెలిపింది.సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల సమస్యల పట్ల మన గొంతు విప్పుదాం. మళ్లి ఇవి పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే,కాని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఉంది, న్యాయ వ్యవస్థను పటిష్ట చట్టపరమైన చర్య తీసుకోవాలి అని విన్నపం.

మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

*మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం పండుగగా, తొలకరి పలకరింపు రైతులు, రైతు కూలీల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని రైతులు పంటలకు సిద్ధం కావాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రైతాంగాన్ని కోరారు.కొన్ని పరిమితమైన పంటల సాగుపైన దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గి తెగుళ్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి వల్ల నేల సారం పెరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలని సూచించారు.ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

_శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా? వి. రవికృష్ణ_

*"శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా? వి. రవికృష్ణ*

*సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భూముల వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రశ్నించిన సామజిక కార్యకర్త,న్యాయవాది వి. రవికృష్ణ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 7:

ఇప్పుడు కొందరు చెబుతున్నట్లుగా సర్వే నం.706 నిజంగానే ప్రభుత్వ భూమి, శికం-సర్కారీ భూమి లేదా అక్రమ కబ్జా అయితే దాదాపు పదేళ్ల పాటు మీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?. నిజంగా అది ప్రభుత్వ భూమి అయితే:
▪️ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది?
▪️ మ్యుటేషన్ ఎలా జరిగింది?
▪️ పట్టాదారు పాస్‌బుక్‌లు ఎలా జారీ అయ్యాయి?
▪️ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ "శికం-పట్టా"గా ఎందుకు చూపిస్తున్నారు?
▪️ సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.
➡️డాక్యుమెంట్ నం.3213/2014 తేదీ 15-12-2014న శంకర్‌పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది.
➡️02-06-2014 నుంచి డిసెంబర్ 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కాలంలో మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు స్వయంగా ఎంపీగా, అనంతరం ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రభుత్వ రికార్డులు, ధరణి వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ వర్గీకరణలను పక్కన పెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ నిర్వహించడం వల్ల నిజాలు మారవు.కనీసం "శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా?.
*ప్రశ్నలు చాలా సులభం:*
భూమి అక్రమమైతే మీ ప్రభుత్వం పదేళ్ల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. అక్రమం కాకపోతే ఇప్పుడు రాజకీయ కథనాల కోసం "కబ్జా", "ల్యాండ్ గ్రాబింగ్" అంటూ ప్రచారం ఎందుకు చేస్తున్నారు. చట్టం, అధికారిక రికార్డులు, సమర్థ అధికారుల విచారణే నిజాన్ని తేల్చాలి — యూట్యూబ్ తీర్పులు కాదు.

Sunday, June 7, 2026

_సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన_

*పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి*

*సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి.కానిస్టేబుల్ రాజు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS.నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల.రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా  మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో  పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.ఈ సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  గారు స్పందిస్తూ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్లి  ఏఆర్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పడం జరిగింది.అలాగే రేపు వారి యొక్క స్వగ్రామమైన ఉల్పర గ్రామం వంగూరు మండలం నందు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

_సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి_

*సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి*

*సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు - తెలంగాణ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై  కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది.

_రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు_

*న్యాయం కోసం ఎదురుచూసి కన్నుమూసిన వృద్ధురాలు*

*రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు*

*మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "వృద్ధ మహిళ న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంకు చెందిన చెన్‌బసమ్మ మరణం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా?. అనారోగ్యంతో బాధపడుతూ, తనకు సంబంధించిన ఆస్తి మరియు న్యాయ సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు పక్షవాతంతో మంచానికి పరిమితమైన 75 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి చెన్‌బసమ్మ గారు చివరకు 29-05-2026న కన్నుమూశారు.మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "75 ఏళ్ల వృద్దురాలు పక్షవాతంతో మంచాన పడ్డా సంవత్సరాలనుండి న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యామాల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం CMOHYD,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు, స్థానిక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశవేశ్వరరెడ్డి కి, తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి,తాండూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇదేనా ప్రజాపాలన - ప్రగతి పాలన అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే — తన జీవితకాలంలో న్యాయం కోసం ఎదురు చూసిన ఒక వృద్ధురాలికి న్యాయం చేయలేకపోతే, రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
ప్రభుత్వ కార్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రజావాణి, ఉన్నతాధికారులు, ఇంకా అనేక వేదికల ద్వారా సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం దొరకకపోవడం బాధాకరం.అనేక ఫిర్యాదులు, పత్రాలు, వినతులు, ఆధారాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, చెన్‌బసమ్మ గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మహిళా హక్కుల గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఒక వృద్ధ మహిళ న్యాయం కోసం ఎదురుచూస్తూ కన్నుమూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
"న్యాయం ఆలస్యమైతే అది కూడా అన్యాయమే" అనే సూత్రాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.చెన్‌బసమ్మ గారు ఇక లేరు.కానీ ఆమె అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పేదలకు న్యాయం పొందే హక్కు ఉందా?వృద్ధుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితమా?అధికారులు స్పందించకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటంటే, చెన్‌బసమ్మ గారు జీవించి ఉండగా పరిష్కారం కాలేకపోయిన ఈ సమస్యను ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.అదే "ఆమె ఆత్మకు నిజమైన శాంతి కలిగించే మార్గమని" వారు కోరుతున్నారు.
— కుటుంబ సభ్యులు