చట్టాలు రద్దు చేసిన తరువాత కూడా ఆందోళనలు ..ఎందుకు?
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ బిల్లు పాస్ చేసి చేతులు దులువుకుంది.
బహుశా ఇటువంటి అరుదైన సంఘటన ప్రపంచ చరిత్రలో ఇదేనేమో కూడా. ఎందుకంటే మాకు ఫలనావి కావాలి అని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నవి చివరకు ఒక ప్రభుత్వం స్పందించి కొందరు ఈ బిల్లులు వ్యతిరేకిస్తారు, రాజకీయంగా తమకు నష్టం కలగవచ్చు అని తెలిసినా బిల్లులు తెచ్చింది అంటే దానికి వ్యవసాయ సంస్కరణలు మీద ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత తెలుస్తుంది. ఆ డిమాండ్స్ లో చాలా వరకు నెరవేర్చే విధంగా బిల్లులు తెస్తే ఆ బిల్లులు మాకు వద్దు ఉపసహరించండి అని తిరిగి అవే రైతు సంఘాలు, విపక్షాలు ఆందోళనలు చేశారు.
ఆ బిల్లుల్లో తాము ఆశించిన సంస్కరణలు ఎక్కువ ఉండి తమకు నచ్చని సంస్కరణలు కొన్ని ఉంటే ఆ బిల్లుల్లో సవరణలు కోరవచ్చు తప్పులేదు. కానీ మొత్తం బిల్లులు ఉపసంహరించాలి అనే డిమాండ్ ఎంత వరకు సహేతుకం అని ఏ మేధావి ప్రశ్నించలేదు.
కొందరు రైతు నాయకులకు, విపక్ష నేతలకు రైతుల ప్రయోజనాల మీద శ్రద్ధ వుండే ఈ ఆందోళనలకు మద్దత్తు ఇచ్చారా? పోనీ అలాగే అనుకుంటే ప్రభుత్వం బిల్లులో పొందు పరిచిన ముఖ్య సంస్కరణలు తాము అధికారంలోకి వస్తే తెస్తాం అని విపక్ష పార్టీలు తన ఎన్నికల మేనిఫెస్టోలో గతంలో ఎందుకు రాసుకున్నారు? అంటే ఈ సంస్కరణలు రైతులకు మేలు చేస్తాయి అని తెలిసే కదా తమ మ్యానిఫెస్టోలో గొప్పగా రాసుకున్నారు. రైతు ఆందోళనకు మద్దత్తు నిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ అంటే రాకేష్ తికాయట్ 2019 లోక్ సభ ఎన్నికల డాక్యుమెంట్ లో రాసుకున్న ముఖ్య అంశాలు చూద్దాం :
1. ఈ కిసాన్ యూనియన్ డాక్యుమెంట్ చాలా విస్తారమైనది. ఇది రైతుల యొక్క ఇబ్బందులను వాటి పరిష్కార మార్గాలు సూచిస్తుంది. లిబరలైజేషన్ మరియు స్వేచ్ఛ వ్యవసాయ రంగానికి ముఖ్యం. అన్ని రాజకీయ పార్టీలు నిజంగా రైతుల మేలు కోరితే ఈ సలహాలను స్వీకరించాలి.
2. a) మార్కెట్ కమిటీల చట్టాన్ని రద్దు చేయాలి.
b) నిత్యవసర సరుకుల చట్టాన్ని రద్దు చెయ్యాలి.
క్) రైతులకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగం లోని 9వ అధికరణను రద్దు చెయ్యాలి. ఈ 9వ షెడ్యూల్ లో చేసిన రాష్ట్ర, కేంద్ర చట్టాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు. అంటే రైతులకు సంకెళ్లుగా మారిన చాలా చట్టాలు ఆర్టికల్ 31b కింద చేయబడ్డవి. అంటే కర్జ్ ముక్తి, నాయాబంది, ధన్ ముక్తి, ధన్ వాపిసి,
వ్యవసాయ భూమి అమ్ముకోవడం మీద ఆంక్షలు, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ఫ్యూచర్ ట్రేడింగ్ , సైన్స్ మరియు టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి తేవడం.
3. భారత్ అభివృద్ధి చెందాలి అంటే రైతులకు స్వేచ్ఛ లభించాలి. మా ఈ మేనిఫెస్టోలో లో పలు అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినందుకు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని అభినందిస్తున్నాము.
పంజాబ్ రైతులను దళారీ వ్యవస్థ (అథియస్) నుండి విముక్తి చేసి వారికి నేరుగా చెల్లింపులు జరపాలి అని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.
గత సంవత్సరం ఇవే డిమాండ్స్ పెట్టిన భారతీయ కిసాన్ యూనియన్ మరియు వారి సూచన మేరకు తమ మేనిఫెస్టోలో పెట్టి గొప్పలు పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవే సంస్కరణలను ఎందుకు వ్యతిరేకించి బిల్లులు వాపస్ తీసుకునేలా హింసాత్మక ఆందోళనలు చేశారు?
ఆప్ పార్టీ కూడా తమ పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోలో స్థూలంగా ఇవే వ్యవసాయ సంస్కరణలు తెస్తాం అని పేర్కొంది.
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ కూడా తమ రిపోర్ట్ లో సుమారు ఇటువంటి వ్యవసాయ సంస్కరణలు రికమాండ్ చేశారు, అన్ని రాజకీయ పార్టీలు ఈ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఆమోదించమని కోరుతూ వస్తున్నారు.
అంటే ఈ వ్యవసాయ బిల్లుల ఆందోళన వెనుక నిజంగా సాధారణ రైతులు ప్రయోజనాలు ఉన్నాయా? లేక పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్న అథియార్ అనే దళారీ వ్యవస్థ ప్రయోజనాలు ఉన్నాయా?
ఇంత సంకుచిత్వం గల రాజకీయ పార్టీలు దేశంలో ఉంటే ఏ గట్టి సమస్యలు అయినా శాశ్వతంగా ఎలా పరిష్కారం అవుతాయి?
భవిష్యత్తు లో మళ్లీ ఈ రైతు సంఘాలు ఈ సంస్కరణలు కావాలి అని ఏ ప్రభుత్వాన్ని అయినా ఏ మొహం పెట్టుకొని అడగగలరు?
పోనీ ఈ బిల్లులు ఉపసంహరించిన తరువాత కూడా దేశంలో నూ విదేశాల్లోనూ ఈ ఆందోళనలు ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు? ఈ ఆందోళనలు వెనుక ఉన్నది నిజంగా రైతు ప్రయోజనాలా? లేక మోడీ ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకతా?
అందుకే ఇప్పుడు మేధావులు ఎలా స్పందించాలో తెలియక మౌనం వహిస్తున్నారు.
No comments:
Post a Comment