Friday, December 3, 2021

మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయనకు బీపీ డౌన్ కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అయితే మార్గమధ్యంలోనే రోశయ్య తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన ఆయన.. దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగానే కాకుండా తమిళనాడు, కర్నాటకకు గవర్నర్ గా పని చేశారు.

రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. హిందూ కళాశాలలో కామర్స్ లో పట్టా పొందారు. కాంగ్రెస్ నుంచి 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య.. 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా సేవలందించారు.

రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యుడు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితోపాటు రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర బడ్జెట్ ను 15 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. 1995-97 మధ్యకాలంలో ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

రోశయ్య చనిపోయిన విషయం తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

No comments:

Post a Comment