Friday, August 27, 2021

తెలంగాణ హైకోర్టు ఇంచార్జ్ సీజేగా.....ఎంఎస్ రామచంద్రరావు!

హైదరాబాద్ : 27/08/2021

*తెలంగాణ హైకోర్టు ఇంచార్జ్ సీజేగా.....ఎంఎస్ రామచంద్రరావు!*

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఇన్‌ఛార్జ్‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావుకు హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ హిమా కోహ్లి రిలీవ్ కాగానే జస్టిస్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టాలని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత లా కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు కుమారుడే జస్టిస్ రామచంద్రరావు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన జస్టిస్ రామచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీలో 1989లో ఎల్ఎల్‌బీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం విద్యను అభ్యసించారు. 1989 సెప్టెంబరు 7న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన ఐఆర్‌డీఏ, ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్, డీసీసీబీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ, ఐపీఈ, సెబీ, తదితర సంస్థలకు న్యాయవాదిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాదిగా సివిల్, కంపెనీ, పరిపాలన, ఆర్బిట్రేషన్ కేసులను వాదించారు. ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012 జూన్ 29న నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు.. 2013 డిసెంబరు 4 నుంచి న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment