• ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి
ప్రొఫెసర్ జయశంకర్

ఫొటో సోర్స్,TELANGANA IDEOLOGUE PROF JAYASHANKAR SIR

''అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్లారా చూడాలి, ఆ తర్వాత చనిపోవాలి).''

ప్రొఫెసర్ జయశంకర్‌ తన సన్నిహితుల వద్ద తరుచూ అనే మాట ఇది. కానీ, తన చివరి కోరిక నెరవేరడం చూడకముందే ఆయన కన్నుమూశారు .

తెలంగాణ సిద్ధాంతకర్తగా మన్ననలందుకున్న కొత్తపల్లి జయశంకర్ వరంగల్ జిల్లాలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు.

తెలంగాణ కోసం తుదిశ్వాస విడిచేవరకు పోరాడిన ఆయన 2011 జూన్ 21న మరణించారు.

అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన మాట, రాత అంతా తెలంగాణ చుట్టూనే తిరిగాయని జయశంకర్ సన్నిహితులు చెబుతుంటారు.

విద్యార్థి దశ నుంచి యూనివర్సిటీ వీసీ వరకు, ఎకనమిస్టు నుంచి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు తన జీవితంలోని చాలా విషయాలను ఆయన సన్నిహితులతో పంచుకున్నారు. మరికొన్నింటిని అక్షరీకరించారు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవీ..

జయశంకర్‌ను అందరూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పిలిస్తే ఆయన మాత్రం నేను సిద్దాంతకర్తను కాను అలా పిలవకండి అని చాలా సందర్భాల్లో చెప్పేవారు.

''సిద్ధాంతకర్త అని ఎందుకొచ్చిందో నాకు తెల్వదు. నన్ను ఎప్పుడూ సిద్ధాంతకర్త అనుకోలే. అనుకోకూడదు. చాలా బహిరంగ సభలో జెప్పిన అయినా వినడం లేదు. చివరకు నన్ను టీఆర్ఎస్ సిద్ధాంతకర్తను కూడా జేసిండ్రు. నేనేం చేయాలి.'' అని అంటుండేవారు.

ప్రొఫెసర్ జయశంకర్

ఫొటో సోర్స్,KCR/FACEBOOK

''రావు సాబ్ ఇంప్రెస్ జేసిండు''

టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా అనేక పార్టీలు ఏర్పడ్డాయి. చాలా మంది నేతలు జయశంకర్ సలహాలు తీసుకునేవారు. అయితే, తెలంగాణ పోరాటంలో అనేక మంది నేతలు కలిసినా కేసీఆర్ మాత్రమే తనను ఇంప్రెస్ చేశారని జయశంకర్ చెప్పేవారు. కేసీఆర్‌ను ఆయన రావు సాబ్ అని పిలిచేవారు.

''2000 సంవత్సరం వరకు కేసీఆర్‌తో నాకు పరిచయమే లేదు. తెలంగాణ గురించి మాట్లాడాలి అని ఒకసారి కలిసిండు. రోజంతా జెప్పినా విన్నడు. నేను ఇంప్రెస్ అయింది ఏందంటే, ఏదైనా చెబితే లోతుకు బోయి అడిగేది. మిగతావాళ్లు ఎవరు లోతుకుబోయే వాళ్లుగాదు. క్రిటికల్‌గా చర్చించేటోడు. అందుకు నేను చాలా ఇంప్రెస్ అయిన'' అని కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని ఒక సందర్భంలో ఆయన వివరించారు.

బహిరంగ సభల్లో జయశంకర్‌కు కేసీఆర్‌ పాదాభివందనం చేయడంపై కొన్నిసార్లు విమర్శలొచ్చేవి.

''కేసీఆర్ నాకు పాదాభివందనం చేస్తడు. వద్దని చాలా చెప్పిన. ఆయన నన్ను ఒక ఫాదర్ ఫిగర్‌గా ట్రీట్ చేసి బర్త్‌డే రోజు మొట్టమొదట నాకు పాదాభివందనం చేయందే బయటికి రాడు ఆయన. పర్సనల్ విషయాలివన్నీ. అయితే కేవలం పొలిటికల్ ప్లాట్‌ఫాం మీద మొక్కితే పొలిటికల్ అయితది.'' అని చెప్పేవారు.

మన్మోహన్‌సింగ్‌తో 1985లోనే పరిచయం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో జయశంకర్‌కు మంచి పరిచయాలు ఉండేవి. మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నసమయంలో జయశంకర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉండేవారు.

1985 నుంచి మన్మోహన్ సింగ్‌తో తనకు పరిచయం ఉండేదని, తర్వాత కాలంలో ఆయన ప్రధాని అయినప్పుడు కూడా తనను మరిచిపోలేదని జయశంకర్ గుర్తు చేసుకునేవారు.

''1991లో నేను కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ అయిన. అప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించే కాన్వోకేషన్‌కు రావాలని ఆయనకు ఫోన్ చేశా. నా రిక్వెస్ట్‌తో ఆయన వెంటనే అంగీకరించి వచ్చారు. యూపీఏ హయాంలో నాకు రాజ్యసభ సీటు, ప్లానింగ్ కమిషన్ మెంబర్ మిస్ అయిందని, 'నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ ‌ప్రైజెస్ ఫర్ రూరల్ ఆర్గనైజేషన్'లో సభ్యుడిగా నియమించారు. తెలంగాణకు అడ్డురానంత వరకే పనిచేస్తానని షరతు విధించి అందులో చేరా.'' అని చెప్పారు.

ప్రొఫెసర్ జయశంకర్

ఫొటో సోర్స్,TELANGANA IDEOLOGUE PROF JAYASHANKAR SIR

ఫొటో క్యాప్షన్,

ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం జనసభ తరఫున 1999లో జయశంకర్ పోరాడారు.

అప్పటి నినాదం నిజమై.. అదే వర్సిటీకి వీసీయై

1953లో వరంగల్‌లోనే జయశంకర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. పై చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సిన పరిస్థితి. అప్పటికింకా వరంగల్‌లో డిగ్రీ కాలేజి లేదు. దీంతో సహ విద్యార్థులతో కలిసి ఆయన వరంగల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఉద్యమించారు.

ఆ ఉద్యమ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆయన ఒకసారి చెబుతూ, ''డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలనే మా ఉద్యమానికి టీచర్లు కూడా మద్దతిచ్చారు. మా ఉద్యమం పెద్ద ఊరేగింపుగా మారింది. డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని నినాదాలు చేసేవాళ్లం. నా నోటి నుంచి అనుకోకుండా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అని వచ్చింది. అందరు నవ్వారు. కానీ, 30 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ వచ్చింది. దానికి తర్వాత కాలంలో నేను వైస్ ఛాన్సలర్ అయ్యాను.'' అని వెల్లడించారు.

'పప్పుచారు బాగా చేసేటోన్ని'

సీఫెల్ రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలోనూ తాను వంట చేసుకొనేవాడినని జయశంకర్ చేప్పేవారు.

''నేను మంచిగ చేసేవాటిలల్లో పప్పుచారు ఒకటి. చాలా మంది లైక్ చేసేటోళ్లు. నాన్ వెజ్ కూడా చేసేది. ఏం జేసినా అందరు మంచిగనె తినేది. కాకతీయ యూనివర్సిటీ వీసీ అయిన తర్వాత వంట చేయడానికి టైం దొరకేది కాదు. దాంతో ఆపేసిన.'' అని అప్పటి సంగతులను గుర్తు చేసుకునేవారు.

ప్రొఫెసర్ జయశంకర్

ఫొటో సోర్స్,TELANGANA IDEOLOGUE PROF JAYASHANKAR SIR

ఫొటో క్యాప్షన్,

1998లో తెలంగాణ జనసభ నిర్వహించిన సభలో జయశంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేశర్ రావు జాదవ్, వరవరరావు తదితరులు పాల్గొన్నారు.

ఓయూ మీద ప్రత్యేక అభిమానం

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోషించిన పాత్రను ఆయన ప్రత్యేకంగా అభినందించేవారు.

'ఉస్మానియాను తలచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం.'' అని ఒక ఆయన గుర్తు చేసుకునేవారు.

ప్రొఫెసర్ జయశంకర్

ఫొటో సోర్స్,KOMPELLY VENKAT

గంభీరంగానే కాదు చమత్కారంగా కూడా..

''నేను ఏది విడిచిపెట్టినా రెండు విడిచి పెట్టను. ఒకటి శనివారం ఉపవాసం, రెండవది తెలంగాణవాదం'' అని జయశంకర్ తరచూ అనేవారు.

దేశపతి శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే జయశంకర్‌ ఆలోచనల్లో ఎంత గాంభీర్యం ఉంటుందో మాటల్లో ఆయన అంత చమత్కారం ఉండేది.

ఒకసారి కేసీఆర్ నివాసంలో ఆయనకు టీ ఇవ్వడానికి ఒకరు వచ్చి షుగర్ లేకుండా టీ ఇవ్వాలా అని అడిగారట. దీంతో ఆయన ''ఐ కెన్ టేక్ ఎ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో'' అని నవ్వుతూ అన్నారట.

ఆధారంవొడువని ముచ్చట (కొంపెల్లి వెంకట్ గౌడ్), తెలంగాణ ఉద్యమాల చరిత్రరాష్ట్ర ఆవిర్భావం (వి.ప్రకాశ్), తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ