వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఝలక్

దిశ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
High court, traffic police

దిశ, తెలంగాణ బ్యూరో: మీ వాహనంపై చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా?.. ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేస్తారని భయపడుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను సీజ్ చేసే అధికారం లేదని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాహనాలపై ఐదు చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వాహనాన్ని జప్తు చేసే అవకాశం ఉంది.

నగరానికి చెందిన న్యాయవాది నిఖిలేష్ వాహనంపై ఒక్క చలానా ఉందని వాహనాన్ని జప్తు చేస్తామని పోలీసు రోడ్డుపైనే నిలిపివేశారు. ఆయన బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్‌ ఉందని, వెంటనే చెల్లించాలని ఎస్సై మహేంద్రనాథ్‌ కోరగా యజమాని నిరాకరించాడు. దీంతో పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. నిబంధనల ప్రకారమే సీజ్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. తనపై ఎందుకు జరిమానా విధించారో తెలుసుకోగా ప్రవేశం లేని పై వంతెనపై బైక్ నడిపారని తెలిపారు. దానికే రూ.1635 చలానా ఎలా వేస్తారు? నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాలి కదా అని ప్రశ్నించారు. ఆయన మాటలు వినకుండా బైక్‌ను సీజ్ చేశారు. దీంతో న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా వాహనం సీజ్ చేయడంపై ఆగస్టు 11న విచారణ జరిపి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది. వాహనం తిరిగివ్వాలని ఆదేశించడంతో ఆ వాహనాన్ని తిరిగిచ్చేశారు.