Tuesday, August 31, 2021

తెలంగాణ‌లో స్కూళ్ల ఓపెనింగ్‌కు హైకోర్టు బ్రేక్

హైదరాబాద్ : 31/08/2021

తెలంగాణ‌లో స్కూళ్ల ఓపెనింగ్‌కు హైకోర్టు బ్రేక్

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

తెలంగాణ‌లో స్కూళ్ల ఓపెనింగ్‌కు బ్రేక్ ప‌డింది. సెప్టెంబ‌ర్ 1 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దేశంలో క‌రోనా మూడో ద‌శ‌ ముప్పు పొంచి ఉంద‌న్న నిపుణులు హెచ్చ‌రిస్తున్న క్ర‌మంలో స్కూళ్ల‌లో ప్రత్యక్ష బోధన వద్దని దాఖలైన పిటిషన్ల‌పై తాజాగా హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో స్కూళ్లు తెర‌వాల‌న్న జీవోపై వారం పాటు హైకోర్టు స్టే విధించింది.

ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థుల‌ను బలవంతం చేయొద్ద‌ని కోర్టు ఆదేశించింది..అలాగే గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు అప్పుడే పునః ప్రారంభించ‌వ‌ద్ద‌ని సూచించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవ‌ద్ద‌ని కూడా తెలిపింది.

అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలోనే రోజుకి లక్ష కేసులు పెరుగుతున్న విష‌యాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని తెలిపారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయ‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు.

మ‌రోవైపు సుదీర్ఘ‌కాలంగా పాఠశాలలు మూసివేయ‌డం పిల్ల‌లపై మానసిక ప్ర‌భావం చూపుతోంద‌ని, దీంతో తప్పనిసరిగా ఓపెన్ చేయాలని UNICEF చెప్పిందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. స్కూల్స్ మూసివేసి ఉండ‌టంతో పిల్ల‌లు న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని వివ‌రించారు. స్కూళ్ల‌లో ఆహార సరఫరాపై డీఈఓ నేతృత్వంలో పర్యవేక్షిస్తామ‌ని తెలిపారు. ఏజీ వాద‌న‌లు విన్న హైకోర్టు.. సెప్టెంబర్, అక్టోబర్‌లో కోవిడ్ తీవ్రస్థాయికి చేరొచ్చ‌ని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్‌వో కు ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించింది. ఇప్ప‌టికే వ్యాక్సిన్ పూర్తి కాలేదని, డిసెంబర్లో పూర్తి చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వమే చెబుతున్న‌ప్పుడు.. వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ఎలా తెరుస్తార‌ని అడిగింది.

ఒకవేళ పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని నిల‌దీసింది. చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని.. పాఠశాలల మేనేజ్మెంట్లు శిక్ష‌ను భ‌రిస్తాయా అని ప్రశ్నించింది. స్కూల్స్ తెరవకపోతే మేనేజ్మెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడిగింది హైకోర్టు. పిల్లలను స్కూల్స్ కు పంపకపోతే కూడా తల్లిదండ్రులపైన ఏమైనా చర్యలు తీసుకునే అధికారం మీకు ఉందా అని ప్ర‌భుత్వాన్ని అడిగింది. ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోలో యాజ‌మాన్యాల‌ మీదగాని, పిల్లల తల్లిదండ్రుల మీద గానీ ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్ప‌లేదు క‌దా అని ప్ర‌స్తావించింది.


No comments:

Post a Comment