హైదరాబాద్ : 03/08/2021
చక్‌దే ఇండియా.. తొలిసారి సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు
- ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు
- గుర్జీత్‌కౌర్ సూపర్ గోల్
- క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం
- డిస్కస్ త్రోలో కమల్‌ప్రీత్ కౌర్‌కు నిరాశ
హాకీలో అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. అంచనాలకు భిన్నంగా అదరగొడుతూ మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించారు. గుర్జీత్‌కౌర్ సూపర్ గోల్‌తో సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో కంగారూలను చిత్తుచేశారు. సమిష్టి ప్రదర్శనతో ఆసీస్‌కు కన్నీళ్లు మిగిల్చారు. పటిష్ఠమైన డిఫెన్స్, చురుకైన స్ట్రైకింగ్‌తో రాణిరాంపాల్ సేన ప్రత్యర్థిని పడగొట్టింది. తద్వారా విశ్వక్రీడల్లో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించిన అమ్మాయిలు ఔరా అనిపించారు. అర్జెంటీనాతో సెమీస్ పోరులో గెలిస్తే.. భారత హాకీ చరిత్రలో స్వర్ణయుగం మళ్లీ మొదలైనట్లే.
కండ్ల ముందు ఏదైనా అద్భుతం జరిగితే.. కొన్ని సెకన్ల పాటు మెదడు అచేతన స్థితికి చేరుతుందన్నట్లు.. ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌లో భారత అద్భుత విజయాన్ని కండ్లారా చూసిన ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉన్నచోటే కుప్పకూలి ఏడుపు లంఘించుకుంటే.. హాకీ కోర్టులో రాణి పరివారం సింహనాదం చేసింది! ‘హ్యాట్రిక్ పరాజయాల అనంతరం అదృష్టం కలిసొచ్చి క్వార్టర్స్ చేరిన భారత్.. నాకౌట్‌లో మూడు సార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాకు అసలు పోటీనివ్వగలదా’ అనే వాదనల మధ్య బరిలోకి దిగిన మన అమ్మాయిలు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మైదానంలో చిరుతలను తలపిస్తూ.. కంగారూల పనిపట్టారు. పోరాటానికి మారుపేరైన ఆస్ట్రేలియన్ల ప్రయత్నాలను మనవాళ్లు అడ్డుకున్న తీరు చూసి తీరాల్సింది! చివరి ఎనిమిది నిమిషాల్లో మనవాళ్ల ఆటను వర్ణించేందుకు అద్భుతం, అమోఘం, అమేయం అనే ఉపమానాలు కూడా తక్కువే!‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అన్న మాటలను ఆదర్శంగా తీసుకున్న మహిళల హాకీ జట్టు.. భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయాన్నందుకుంది. సంకల్పం బలంగా ఉంటే.. విధినైనా జయించగలం అనే మాటలను రుజువు చేస్తూ.. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన క్షణాలను సాక్షాత్కరించింది. హాకీలో పూర్వవైభవాన్ని గుర్తుచేస్తూ.. పురుషుల జట్టు సెమీస్ చేరిన మరుసటి రోజే మహిళలూ సెమీస్‌లో అడుగుపెట్టి భారత అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తారు!
టోక్యో: విశ్వక్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాను ముచ్చెమటలు పట్టించిన రాణి రాంపాల్ బృందం తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ భారత్ 1-0తో రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. మూడోసారి ఒలింపిక్ బరిలో నిలిచిన భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా.. బుధవారం జరుగనున్న సెమీఫైనల్‌లో అర్జెంటీనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం భారత పురుషుల హాకీ జట్టు 49 ఏండ్ల తర్వాత సెమీస్‌కు అర్హత సాధిస్తే.. ఒక్క రోజు తేడాలో మహిళల జట్టు సేమ్ సీన్ రిపీట్ చేసి.. క్రీడాభిమానుల ఆనందాన్ని డబుల్ చేసింది. మన జట్టు తరఫున డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ (22వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. ‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపు వెనుక ఎన్నో ఏండ్ల కృషి, పట్టుదల ఉన్నాయి. సెమీస్‌లో అడుగుపెట్టడం గర్వంగా ఉంది’అని గుర్జీత్ పేర్కొంది. విశ్వక్రీడల్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలతో నిరాశ పరిచిన మన అమ్మాయిలు.. ఆ తర్వాత వరుసగా ‘హ్యాట్రిక్’విజయాలు నమోదు చేసుకోవడం విశేషం.
ఆహా ఏమా ఆట..
ఒత్తిడిని జయించడంలో జగజ్జేతలైన ఆస్ట్రేలియన్లను కీలక పోరులో.. భారతీయులు బెదరగొట్టారు. మ్యాచ్ సాగిన 60 నిమిషాల్లో ఒక్క క్షణం కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిన మన అమ్మాయిలు ఆఖరికి కంగారూలకు కన్నీళ్లు మిగిల్చారు. నిదానంగా మ్యాచ్‌ను ఆరంభించిన రాణి బృందం.. సమయం గడుస్తున్నా కొద్దీ పదునైన ఆటతో ముందుకు సాగింది. ప్రత్యర్థి దూకుడు పెంచి అటాకింగ్ గేమ్‌తో పదేపదే గోల్స్ కొట్టే ప్రయత్నం చేసినా.. మన డిఫెండర్లు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఇక గోల్ పోస్ట్ ముందు సవిత గోడ కట్టేయడం ఈ మ్యాచ్‌లో భారత్‌కు బాగా కలిసొచ్చింది. తొలి క్వార్టర్‌లో భారత్‌కు రెండు చాన్స్‌లు రాగా.. మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆసీస్‌కు 20వ నిమిషంలో వచ్చిన తొలి పెనాల్టీ కార్నర్‌ను భారత డిఫెండర్లు చక్కగా అడ్డుకోగా.. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలో భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన గుర్జీత్ కౌర్.. ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా.. కంగారూలను బోల్తా కొట్టిస్తూ.. లో ఫ్లిక్ ద్వారా భారత్ ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ ఆధిక్యంలో నిలువగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియన్లు జోరు పెంచారు. పదే పదే భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినా.. మన డిఫెండర్లు వాటిని తిప్పికొట్టారు. చివరి ఎనిమిది నిమిషాల్లో ఆసీస్‌కు దక్కిన నాలుగు పెనాల్టీ కార్నర్లను మనవాళ్లు అడ్డుకోవడంతో భారత్ విజయం ఖాయమైంది.
స్వర్ణంతో తిరిగిరండి : షారూక్
ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు చేరిన మహిళల హాకీ జట్టుపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. స్వర్ణంతో తిరిగిరావాలని షారూక్ ఆకాంక్షించాడు. టీమ్‌ఇండియా హాకీ కోచ్ జోయర్డ్ మరీనే పెట్టిన ‘సారీ ఫ్యామిలీ.. నేను తర్వాత వస్తాను’ ట్వీట్‌కు ఆయన స్పందిస్తూ.. ‘ఫర్వాలేదు. మీరు వచ్చేప్పుడు కోట్లాది మంది కుటుంబసభ్యుల కోసం బంగారు పతకం తీసుకురండి. ఈసారి ధన్‌తేరస్ కూడా నవంబర్‌లో ఉంది. ఫ్రమ్: మాజీ కోచ్ కబీర్ ఖాన్’ అంటూ రీట్వీట్ చేశాడు. దీనికి మరీనే స్పందిస్తూ..
‘మీ మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. మేం అన్నీ తీసుకొస్తాం ఫ్రమ్: ది రియల్ కోచ్’ అంటూ రిైప్లె ఇచ్చాడు. మహిళల హాకీ ఇతివృత్తంగా వచ్చిన ‘చక్ దే ఇండియా’ చిత్రంలో షారూక్ ఖాన్ కోచ్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
అచ్చం సినిమా స్పీచ్‌లాగే..
‘భావోద్వేగాలు నిండిన ఈ క్షణాన ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. కానీ నాకు నా జట్టుపై నమ్మకముంది. ఈ బృందం అద్భుతాలు చేయగలదని నేను నమ్ముతున్నా.. మీరు కూడా ఇదే నమ్మండి. ఫలితం దానంతటదే వస్తుంది. కేవలం ఈ 60 నిమిషాల గురించే ఆలోచించండి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనవసరం. ఈ గంటసేపు మీ అత్యుత్తమ ఆట ప్రదర్శిస్తే చాలు’ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ పోరు ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ రాణి రాంపాల్.. జట్టును ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఈ మాటలనే మంత్రాలుగా పటించిన మన అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టారు. గ్రౌండ్‌లో చిరుతలను తలపిస్తూ.. కంగారూల మెడలు వంచారు.
No comments:
Post a Comment