సీఎం కేసీఆర్‌కు షాకింగ్ న్యూస్.. ఇక వారంతా రోడ్లపైనే మకాం!
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తయని కొట్లాడి మరీ సాధించిన రాష్ట్రంలో నిరుద్యోగుల చావులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఒరిగేది ఏమి లేదని నిరుద్యోగులు భావించారు. ఉద్యోగాల సాధనకు ఉద్యమమే సరైనదని తెలుసుకున్నారు. పోరాటాలతో సాధించిన తెలంగాణలో ఉద్యోగాల కల్పనకు తిరిగి ఉద్యమించేందుకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ ప్రకటనలకు విసిగిపోయిన రాష్ట్రంలోని నిరుద్యోగులు ఇప్పట్లో కొలువులు ప్రకటించరని భావించారు. ఉద్యోగాల కోసం ప్రతిపక్షాలు, పార్టీల నాయకులు ప్రశ్నిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, స్వతహాగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి, నాయలకులకు కనిపించట్లేదా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడంతో ఆర్థికంగా కొంత మేర ఉపశమనం ఉంటుందని యువత భావించారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా దానిపై చర్చించక, ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు విసిగిపోయారు. దీంతో రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా మారింది. గ్రూపులన్నీ జతకట్టి ‘ఆలస్యమవుతోంది – మనకోసం మనమే పోరాడాలి’ అంటూ నినదిస్తున్నారు. ‘తెలంగాణ నిరుద్యోగి బచావో’ పేరుతో క్యాంపెయిన్ చేసి ఉద్యమానికి ఊతం పోస్తున్నారు. వీరంతా శుక్రవారం నాడు ఆన్లైన్ మీటింగ్‌లో తదుపరి కార్యచరణపై చర్చించారు. త్వరలో వీరంతా ప్రత్యక్షంగా సమీక్షించి ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేశారు.
మొదటగా ఈ ఉద్యమంలో వందల్లో ఉండే నిరుద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ.. పార్టీలకతీతంగా గ్రాడ్యుయేట్లను ఐక్యం చేస్తూ ఉద్యమానికి బాటలు వేసుకుంటున్నారు. ఇది కొద్ది రోజుల్లోనే లక్షల మందితో భారీ ఎత్తున ఉద్యమించేందుకు కార్యచరణ సిద్ధమవుతోంది. దీంతో కేవలం ఉద్యోగ నోటిఫికేషన్‌లకు భారీ ఉద్యమం జరిపేందుకు నిరుద్యోగులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతల సహకారం కోసం ఎదురుచూపులు
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరుద్యోగ ఉద్యమానికి సహకారం అందించాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఈ ఉద్యమానికి రాజకీయ నాయకులు కలుస్తే తమ హక్కులైన నోటిఫికేషన్లు తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నారు. అయితే పార్టీలకతీతంగా వచ్చే దిశగా ప్రత్యక్షంగా కలిసేందుకు సైతం ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగులంతా రోడ్లపైకే..
రాష్ట్రంలో ఇప్పటివరకు ఉద్యోగాల కోసం 33 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినా ఉద్యోగ నోటిఫికేషన్ రాక విసిగిపోయారు. త్వరలోనే రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకుంటాం. కొవిడ్ కారణంగా మూడు నెలలుగా తక్కువ సంఖ్యలోనే మంత్రుల కాన్వాయిని అడ్డుకుంటున్నామని, త్వరలో రోడ్లపైనే మకాం వేస్తాం.
– భీంరావు నాయక్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్
No comments:
Post a Comment