హైదరాబాద్ : 13/08/2021
జూబ్లీహిల్స్ సొసైటీ కొత్త కమిటీలో విభేదాలు.. ఏదైనా కుట్ర ఉందా..?
– జూబ్లీహిల్స్ సొసైటీ.. కొత్త కమిటీ కయ్యం
– ప్రెసిడెంట్ వర్సెస్ సెక్రటరీ
– ఫైళ్ల విషయంలో మొదలైన రచ్చ
– అసలు.. ఈ ఫైళ్ల గోల ఏంటి..?
– సెక్రటరీ అధికారాలకు కత్తెర ఎందుకు..?
– పాత ఫైళ్లకు ఫోరెన్సిక్ ఆడిటింగ్.. జరుగుతోందా..?
జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్, బిల్డింగ్ సొసైటీలో సీన్ రివర్స్ అవుతోంది. పాత కమిటీ చేసిన అక్రమాలను ఎకిపారేయాలని కుర్చీలో కూర్చున్న కొత్త కమిటీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీ ఏర్పడి ఐదు నెలలు కాకుండానే రికార్డుల గోల పరాకాష్టకు చేరింది. సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ తనను బెదిరింపులకు గురిచేసి.. రెండు గంటలపాటు గదిలో బంధించారని సెక్రటరీ మురళీ ముకుంద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన దగ్గర ఉన్న తాళాలను చేజిక్కించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో అధ్యక్షుడు, సెక్రటరీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సొసైటీ రికార్డుల రూమ్ లో భద్రంగా ఉండాల్సిన 200 ఫైళ్ల మిస్సింగ్ పై గంటల కొద్దీ చర్చ నడిచింది. ఈ క్రమంలోనే బై లా ప్రకారం తన దగ్గర ఉండాల్సిన రికార్డుల రూమ్ తాళాల్ని లాక్కునేందుకు చూశారని మురళీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ రూమ్ ని సీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఫైళ్లకి రక్షణ కల్పించాలని ఆయన.. సహకార శాఖ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశారు.
అసలు ఈ ఫైళ్ల గోల ఏంటి..?
గత పాలకమండలి చేసిన తప్పిదాలు, అక్రమాలపై కీలకమైన పత్రాలు మిస్ అయ్యాయి. ఇది ఎలా జరిగిందో విచారణ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొత్త కమిటీలో ఒకే ప్యానల్ నుంచి గెలిచిన వారిమధ్య విభేదాలు రావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త ప్రెసిడెంట్.. పాత అక్రమాలను అడ్డుపెట్టుకుని కొత్త దందా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పాలకమండలిలోని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కమిటీ చేసిన తప్పిదాలే మనం చేస్తే ఎలా అని వాదన జరిగినట్లు సమాచారం. ఫైళ్లకు రక్షణ కల్పించాలని సెక్రటరీ కోరడంపై గతంలో కంటే ఇప్పుడే ఆ రికార్డులు మిస్ అవుతున్నాయా..? ఒకవేళ అదే నిజమైతే.. ఎవరు చేస్తున్నారు..? ఎవరిపై ఆధిపత్యం కొనసాగడానికి ఇలా వ్యవహరిస్తున్నారు..? మళ్లీ సొసైటీని ఒక్కరి గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? కాబట్టే విభేదాలు భగ్గుమన్నాయా..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
సెక్రటరీ అధికారాలకు కత్తెర అందుకేనా..?
ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న మురళీ ముకుంద్ అధికారాలకు కత్తెర వేస్తూ మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయన కార్యదర్శి పదవిలో కొనసాగుతారు కానీ.. అధికారాలు ఉండవని ఏ నిర్ణయం అయినా పాలక మండలిదే ఫైనల్ అని అంటున్నారు సభ్యులు. మరోవైపు పాత ఫైళ్లు అన్నింటికీ ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిగేలా డెలాయిట్ కంపెనీతో ఒప్పందం జరుపుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ వివాదంపై సహకార శాఖ ఎలా స్పందిస్తుంది..? ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా..? ఎవరు పైచేయి సాధిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment