Sunday, August 1, 2021

Telangana Tirupati : తెలంగాణ తిరుపతి.. కురుమూర్తి సన్నిధి

హైదరాబాద్ : 01/08/2021

Telangana Tirupati : తెలంగాణ తిరుపతి.. కురుమూర్తి సన్నిధి

నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో 

ఏడేడు శిఖరాలు నడవలేని వారికోసం, నడిరేయి ఏ జామునో వెంకన్న కదలి వచ్చాడు. లక్ష్మీదేవి సమేతుడై కురుమూర్తి స్వామిగా కొలువుదీరాడు. కలియుగ దైవం స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం మహబూబ్‌ నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమరచింత (అమ్మాపూర్‌)లో ఉంది. ‘తెలంగాణ తిరుపతి’గా ప్రశస్తి పొందిన కురుమూర్తి ఆలయ విశేషాలివి.


Telangana Tirupati : తెలంగాణ తిరుపతి.. కురుమూర్తి సన్నిధి

పద్మావతితో శ్రీనివాసుడి పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుబేరుడి అప్పుతో వియ్యాలవారి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా శ్రీనివాసుడూ ఘనంగానే పెట్టిపోతలు సమర్పించాడు. అచ్చటాముచ్చటా తీరింది. అప్పు చెల్లించమని వచ్చాడు కుబేరుడు. వడ్డీ సైతం చెల్లించలేకపోయాడు స్వామి. మాట తప్పానని మనస్తాపం చెందాడు. ఆ ఆవేదన నుంచి ఉపశమనం కోసం ఏడుకొండలూ దిగొచ్చాడు. ఆయన వెంటే పద్మావతి లక్ష్మిగా నడిచింది. ఇద్దరూ కృష్ణా తీరం చేరుకున్నారు. అక్కడి ప్రకృతికి పరవశులయ్యారు. ఆకాశగంగను తలపించే జలపాతంలో ఇద్దరూ జలక్రీడలాడారు. ఆ ప్రదేశమే నేడు, మహబూబ్‌నగర్‌ ఆత్మకూరు సమీపంలోని గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందింది. జల వినోదం ముగిశాక.. మరికాస్త ముందుకెళ్లారు. అక్కడా ఏడుకొండలు కనిపించాయి. పచ్చదనం తివాచీ పరిచి వేంకటపతికి స్వాగతం పలికింది. కొండెక్కాడు స్వామి. సుగంధభరిత నానాఫల వృక్షాలతో అలరారుతున్న ఆ అచలంపై అచంచలమైన ఆనందం ఉందనిపించింది లక్ష్మీదేవికి. ‘స్వామీ! కాసేపు ఇక్కడే ఉండిపోదాం’ అన్నది. రమా రమణి కోరడమూ శ్రీనివాసుడు కాదనడమూనా! ‘అలాగే’ అన్నాడు వెంకన్న. అలా కురుమూర్తి కొండలపై బడలిక తీరేదాకా విశ్రమించారిద్దరూ. తిరుగు ప్రయాణమవుతూ తమ ప్రతిరూపాలను అక్కడే వదిలి వెళ్లారట. అలా, తిరుమలేశుడు ఇక్కడ ‘కురుమూర్తి స్వామి’గా వెలిశాడని స్థల పురాణం. అదే ‘కురుమూర్తి’ క్షేత్రమైంది. కురుమూర్తి విగ్రహం తిరుమలేశుడి మూర్తిని పోలి ఉంటుంది.

శతాబ్దాల చరిత్ర
పూర్వం కురుమూర్తిని ‘కురుమతి’ అని పిలిచేవారు. కలియుగాంతానికి ‘కురుమూర్తి’గా స్థిరపడింది. మొదట్లో సహజసిద్ధమైన గుహల్లో పెద్దరాతి గుండు కింద స్వామి విగ్రహం ఉండేది. భక్తులు గుహలోకి వెళ్లి దర్శనం చేసుకునేవారు. కాలక్రమంలో ఎందరో నరపతులు, గజపతులు కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. క్రీ.శ.1346 నుంచి ముక్కెర వంశానికి చెందిన వర్ధమానపురం (వడ్డేమాన్‌) పరగణాధీశుడు గోపాల్‌రెడ్డి మొదలు తరతరాలుగా ‘కురు మూర్తి’ని తమ ఇలవేల్పుగా భావించి ఆలయాభివృద్ధికి పాటుపడ్డారు. ఆత్మకూరు సంస్థానాధీశుడు చంద్రారెడ్డి ఇక్కడ ఆలయం నిర్మించినట్టు ఆధారాలున్నాయి. ఆయన వారసులు కొండపైకి మెట్లు, మంటపాలు, కొండ కింద కోనేరు కట్టించారు. స్వామికి రకరకాల ఆభరణాలు చేయించారు.

ఎన్నెన్నో విశేషాలు
ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలతోపాటు, కురుమూర్తి స్వామి సన్నిధిలో మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఆంజనేయుడితోపాటు కాలభైరవుడూ కురుమూర్తి క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు. కురుమూర్తికి దళితులే అర్చకులు. ఏటా కార్తిక మాసంలో ఇక్కడ జాతర ఘనంగా జరుగుతుంది. నెలరోజులపాటు జరిగే జాతరలో లక్షలమంది పాల్గొంటారు. కొండకింద రుచికరంగా వండిన మాంసాహార పదార్థాలను భక్తులందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఆచారం నేటికీ కొనసాగుతున్నది. ఆస్తికులు తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఇది.

తోలు పాదుకలు
తన తీరంలో సేదతీరిన వెంకన్న స్వామివారి పాదాలు కందిపోకుండా, తొలుత నదీమ తల్లి కృష్ణమ్మ పాదుకలు ఇచ్చిందట. ఏటా స్వామివారికి ప్రత్యేకంగా పాదుకలు సమర్పించే ఆ ఆనవాయితీ ఇంకా కొనసాగుతున్నది. వడ్డేమాన్‌ గ్రామంలోని చర్మకారులు ఈ పాదుకలు తయారు చేస్తారు. జాతరలో భాగంగా జరిగే ‘ఉద్దాల ఉత్సవం’ రోజున పాదుకలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామికి సమర్పిస్తారు. తర్వాత వాటిని ‘ఉద్దాల మంటపం’లో అలంకరిస్తారు. బ్రహ్మకడిగిన పాదాలు అలంకరించుకున్న ఈ పాదుకలతో తలపై, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగుతాయని విశ్వాసం.

No comments:

Post a Comment