ఆశ్చర్యం.. భారత్‌కు తాలిబాన్ల శాంతి సందేశం
తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
ఆఫ్ఘాన్‌ను తాలిబాన్లు ఆక్రమించుకోవడంపై భారత్ అంతర్జాతీయ వేదికలపై ఆందోళనను వెలిబుచ్చుతున్న వేళ.. ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తమ ప్రభుత్వ వైఖరిపై సందేహాలు అక్కర్లేదని తాలిబాన్లు వార్తమానం పంపారు. ఆప్ఘాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు ఎలా ఉంటుంది? తాలిబాన్లు ఎలా ప్రవర్తిస్తారో వేచి చూడాలని కోరారు. తాలిబాన్ పాలనపై ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఎలా స్పందిస్తాయో కూడా భారతదేశం చూస్తుందని వారు చెప్పారు. ఈ మేరకు ఏఎన్ఐ వార్త సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో తాలిబాన్ ప్రభుత్వం.. భారత్‌తో స్నేహాన్నే కోరుకుంటోందన్న అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగానే.. ఆఫ్ఘాన్‌లో హిందువులు, సిక్కుల రక్షణపై కూడా తాలిబాన్లు శాంతి సందేశం పంపారు. వారికి ఎలాంటి సమస్య రాదని భరోసా ఇచ్చారు. ఈమేరకు కాబూల్‌లోని గురుద్వారాలో తలదాచుకున్న హిందూ, సిక్కుల బృందాన్ని స్వయంగా వెళ్లి తాలిబాన్ ప్రతినిధులు కలిశారు. తమ నుంచి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. మరోవైపు పాక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా భారత్ పట్ల సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్ చేస్తున్న అభివృద్ధి పనులను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
ఇండియా పట్ల తాలిబాన్లు ఇటీవలికాలంలోనూ ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదు. అలాగే ఆ దేశంలో భారత్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో నిజంగానే తాలిబాన్లు మారిపోయారా అన్న ఆశ్చర్యం కలుగుతోంది.
No comments:
Post a Comment