Monday, August 16, 2021

అఫ్గానిస్థాన్‌ పరిస్థితులఫై జో బైడన్ కీలక ప్రకటన

అంతర్జాతీయ వార్తలు : 17/08/2021

అఫ్గానిస్థాన్‌ పరిస్థితులఫై జో బైడన్ కీలక ప్రకటన

ఈనాడు మీడియా సౌజన్యంతో 

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తొలిసారి నోరు విప్పారు. శ్వేతసౌధంలో సోమవారం బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్‌ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనన్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొన్నారు. అఫ్గాన్‌ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని జో బైడెన్‌ పేర్కొన్నారు. అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడమే అని అన్నారు.

అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడతానన్నారు. ఈ నిర్ణయంపై చింతించడం లేదన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్‌ తెలిపారు.

అఫ్గాన్‌ జాతి నిర్మాణం మా లక్ష్యం కాదు..

అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్‌ హెచ్చరించారు. మరో దేశ అంతర్యుద్ధంలో అమెరికా పోరాడాలని తాను సైనిక బలగాలకు చెప్పనన్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని తెలుసన్నారు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో తాను నాలుగో అధ్యక్షుడినని, అయితే ఈ బలగాల ఉపసంహరణ పనిని ఐదో అధ్యక్షుడికి బదిలీ చేయదలుచుకోలేనన్నారు. 2009లో తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అఫ్గాన్‌లో సైనిక దళాలను మోహరించడంపై వ్యతిరేకించినట్లు తెలిపారు. తాను అమెరికా ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడంలేదన్నారు. 2001 సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్‌ తెలిపారు. అంతేకాని అఫ్గాన్‌ జాతి నిర్మాణం చేయడం తమ లక్ష్యం కాదన్నారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక అఫ్గాన్‌ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. కాబుల్‌ విమానాశ్రయంలో అఫ్గాన్‌ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి విమానాల టైర్లపై ఎక్కి ప్రయాణించి మరణించారు. ఈ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటనపై బైడెన్‌ స్పందిస్తూ ఈ దృశ్యాలు తనను కలతపెట్టాయన్నారు.

అన్నీ ఇచ్చినప్పటికీ సంకల్ప బలం మాత్రం ఇవ్వలేకపోయాం

మరోవైపు అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను బైడెన్‌ విమర్శించారు. అఫ్గాన్‌ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. అఫ్గాన్‌ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్‌ అన్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్‌ డాలర్లను అందించామని.. ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయన్నారు. అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ఇక ఏమాత్రం అఫ్గాన్‌ సంక్షోభం అమెరికా జాతీయ భద్రత ఆసక్తి కాదన్నారు. అఫ్గానిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, ఆ దేశ ప్రజలకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. అఫ్గాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అఫ్గాన్‌లో ఉన్న అమెరికా పౌరులను తరలించనున్నట్లు బైడెన్‌ పేర్కొన్నారు.

అమెరికా, నాటో బలగాల ఉపసంహరణతో తాలిబన్లు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ దేశ రాజధాని కాబుల్‌ను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. మరోవైపు దేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తి విమానాల్లో ఇతర దేశాలకు వెళ్లారు.

No comments:

Post a Comment