గులాబీ ఎమ్మెల్యేలా.. గూండాలా?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బరితెగిస్తున్నారు. వీధి రౌడీల కంటే దారుణంగా దిగజారిపోతున్నారు. ప్రశ్నిస్తే చాలు.. వారికి ఎక్కడలేని ఉక్రోషం పొడుచుకొస్తోంది. నిరసన కనబడినా, సమస్యలపై ఎవరైనా నిలదీసినా తాము మనుష్యులం అనే విషయాన్ని కూడా మరిచిపోతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. స్వాతంత్ర్య దినం రోజునే మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి తన రౌడీయిజంపై ప్రదర్శించి చర్చనీయాంశంగా మారితే… దళితబంధు ప్రారంభోత్సవం రోజునే మరో గులాబీ ఎమ్మెల్యే ఓ బహుజన విద్యార్థి పట్ల అదే గూండాయిజాన్ని ప్రదర్శించి వార్తల్లోకెక్కారు.
సూర్యాపేట జిల్లా పనిగిరిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఓయూ జేఏసీ కన్వీనర్ పాల్వాయి నగేష్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ అనుచరులు రెచ్చిపోయారు. దారికాచి మరీ దౌర్జన్యానికి తెగబడ్డారు. విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి వీల్లేదంటూ నగేష్‌పై ముప్పేట దాడి చేశారు. హుజురాబాద్‌లో సరిగ్గా అభినవ అంబేద్కర్ కేసీఆర్ ఓవైపు దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతున్న సమయంలోనే.. టీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ దాష్టికానికి .. అదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రక్తమోడాడు నగేష్.
ఇంతకి నగేష్ చేసిందేంటి? ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఇంటిని ముట్టడించలేదు. ఆయన వాహనాన్ని అడ్డగించలేదు. టీఆర్ఎస్ ఆఫీస్ ముందు ధర్నా ఏమీ చేయలేదు. ఆ ఎమ్మెల్యేను పట్టుకుని బూతులేవీ మాట్లాడలేదు. ప్రజాస్వామ్య పద్దతిలో తన నిరసనను తెలియజేయాలని అనుకున్నాడు. పాలకుల చెవులకు ఎలాగు తుప్పుబట్టిపోవడంతో.. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహానికి ప్రజల ఆవేదనను తెలియపరచాలనుకున్నాడు. తుంగతుర్తి నియోజకవర్గంలోని 20 వేలకు పైగా దళిత కుటుంబాలకు కూడా దళిత బంధు అమలు చేయాలని.. బీసీలకు కూడా బిసి బంధు ఇవ్వాలని.. అగ్రవర్ణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పాలనుకున్నాడు. కానీ ఆ న్యాయమైన కోరికలు.. కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గ్యాదరి కిషోర్‌కు కోపం తెప్పించాయి. చివరికి రక్తం కళ్ల చూసేలా చేశాయి.
No comments:
Post a Comment