Saturday, August 21, 2021

కన్ను తడవకుండా జీవితాన్నీ.. కాలు తడవకుండా ఏటినీ దాటలేమంటారు!

హైదరాబాద్ : 22/08/2021

హోటల్‌ ఓనరు చెప్పుతో కొట్టేవాడు..!

హోటల్‌ ఓనరు చెప్పుతో కొట్టేవాడు..!

ఈనాడు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
కన్ను తడవకుండా జీవితాన్నీ కాలు తడవకుండా ఏటినీ దాటలేమంటారు. వాటిని దాటుకుని మరో పదిమంది కన్నీళ్లు తుడవగలిగే స్థాయికి ఎదగడమే విజయమైతే జయరామ్‌ బనన్‌ వందరెట్లు విజయం సాధించినట్లు. నాన్న జేబులోంచి దొంగిలించిన డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయి కన్పించిన బస్సెక్కినప్పుడు... ఆ బస్సు ఎక్కడికెళ్తుందో తన జీవితం ఏ మలుపు తిరగనుందో పదమూడేళ్ల జయరామ్‌కి తెలియదు. కానీ ఇప్పుడతడు కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. పదివేల మందికి ఉపాధి కల్పించిన వ్యాపారవేత్త. అదెలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే చూద్దాం.

బాల్యాన్ని తలచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. ఒక్కోసారేమో ఆ పరిస్థితులే కదా ఈరోజు నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి... అనీ అన్పిస్తుంది. ఉడుపి హోటల్‌ లేని ఊరుండదు కదా... ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న ఉడుపి పదమూడో శతాబ్దంలో చిన్న పట్టణం. అక్కడి శ్రీకృష్ణ మందిరం చాలా ప్రసిద్ధి. భక్తులకు అన్నదానం చేయాలన్న ఆశయంతో ఆ మందిరంలో శిక్షణ పొందిన కొందరు ఇతర పట్టణాలకు వెళ్లి హోటళ్లను ప్రారంభించారు. అవే క్రమంగా ఉడుపి హోటళ్లుగా మారాయి. ఈ హోటళ్లన్నీ కూడా నిర్ణీతమైన వేళల్లో, నిర్దేశించిన ఆహారపదార్థాలను మాత్రమే వడ్డించేవి. అవే క్రమంగా పలు నగరాలకి విస్తరించాయి. వాటితో మాకేమీ సంబంధం లేదు కానీ ఆ జిల్లాలోనే కర్కల అనే చిన్న ఊళ్లో ఉండేవాళ్లం మేము. నాన్నది డ్రైవర్‌ ఉద్యోగం. ఆయన స్వభావమే అదో, ఏడుగురు పిల్లలున్న సంసారాన్ని ఈదలేని నిస్సహాయతో తెలియదు కానీ నాన్నకు ముక్కుమీద కోపం ఉండేది. ఎంత కోపం అంటే- పిల్లలం ఏ చిన్న తప్పు చేసినా వీపు విమానం మోత మోగేది. అంతమంది పిల్లలం ఉన్నా, నాన్న ఇంట్లో ఉన్నాడంటే ఆటా పాటే కాదు, మాటలూ ఉండేవి కావు. అలా ఉన్నా పర్వాలేదు కానీ, ఏ పక్కనుంచీ చెంప ఛెళ్లుమంటుందో తెలియని ఒక రకమైన భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. మమ్మల్ని నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అమ్మది.

కళ్లలో కారం కొట్టేవాడు...
కర్ర విరిగినా పర్వాలేదు కానీ పిల్లలు కట్టు తప్పకూడదన్న ఆనాటి సమాజ నియమాన్ని నాన్న తు.చ. తప్పకుండా ఆచరించేవాడు. ఆ పేదరికంలో చదువే మా జీవితాలను బాగుచేస్తుందని నమ్మేవాడేమో... మేం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించేవాడు కాదు. మార్కులు తక్కువొచ్చినా, స్కూల్లో అల్లరి చేసినట్లు తెలిసినా ఒంటిమీద వాతలు తేలేవి. పట్టలేని కోపంతో మా కళ్లల్లో కారం కొట్టిన సందర్భాలెన్నో. అలాంటి పరిస్థితుల్లోనూ నేను ఒక పరీక్ష తప్పాను. అప్పుడు నాకు పదమూడేళ్లు. నాన్న ఇంటికి వస్తే నాకు చావుదెబ్బలు గ్యారంటీ. ఎలాగైనా నాన్నకి దొరక్కుండా తప్పించుకోవాలనుకున్నాను. గోడకి తగిలించి ఉన్న నాన్న చొక్కా జేబులో కొంచెం డబ్బు దొరికింది. అది తీసుకుని ఇంట్లో నుంచి బయటపడ్డాను. బస్టాండుకి పరిగెత్తి కన్పించిన బస్సెక్కి కూర్చున్నా. బస్సు బయల్దేరింది. అది ముంబయి వెళ్తుందని తర్వాత తెలిసింది. అసలు ఇల్లు వదిలి ఏనాడూ బయటకు వెళ్లని నేను అమ్మానాన్నల్నీ అన్నదమ్ముల్నీ వదిలి అంత దూరం వెళ్లి ఎలా బతకడం అనుకుంటే దుఃఖం ఆగలేదు. ముంబయి చేరేవరకూ ఏడుస్తూనే ఉన్నాను. బాగా చదువుకోనందుకేగా నాకీ పరిస్థితి వచ్చిందని నన్ను నేను తిట్టుకున్నాను. మా ఊరి నుంచి తరచూ కుర్రాళ్లు పని వెతుక్కోటానికి ముంబయి వెళ్తుండేవారు. నేనూ అలాగే వెళ్తున్నానని అనుకున్నాడేమో బస్సుదిగి బిక్క మొహం వేసుకుని నిలబడ్డ నన్ను చూసిన మా జిల్లా వ్యక్తి తీసుకెళ్లి ఒక హోటల్లో పనిలో పెట్టాడు.

చేతులు బొబ్బలెక్కేవి

అది హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ కంపెనీ క్యాంటీన్‌. చిన్నవాడిని కాబట్టి నెలకు 18 రూపాయల జీతంతో గిన్నెలు కడిగే పని ఇచ్చారు. ఆరోజుల్లో ఇప్పటిలా డిష్‌ వాషింగ్‌ సబ్బులు లేవు. సోడా కలిపిన నీటితో పాత్రల్ని శుభ్రంచేయాల్సి వచ్చేది. దాంతో చేతులు బొబ్బలెక్కేవి. నొప్పితో ఏడుస్తూంటే క్యాంటీన్‌ ఓనరు కోపంతో చెప్పు విసిరేవాడు. నాన్న చెంప దెబ్బలకి భయపడి ఇక్కడికొస్తే ఇక్కడేమో చెప్పు దెబ్బలు తినాల్సి వస్తోందని రాత్రంతా ఏడుస్తూ పడుకునేవాడిని. అయినా మరో మార్గం లేదు కాబట్టి మళ్లీ తెల్లారుతూనే లేచి పని చేసేవాడిని. ఎదురు తిరగకుండా, చెప్పిన పని చెప్పినట్లు శుభ్రంగా చేయడం నేర్చుకున్నాను. దాంతో క్యాంటీన్‌ యజమాని నెమ్మదిగా నన్ను అభిమానించడం మొదలెట్టాడు. నా పనితీరు మెచ్చి మెల్లమెల్లగా ప్రమోషన్లూ ఇచ్చాడు. గిన్నెలు కడిగే పని నుంచి టేబుళ్లు తుడిచే పనికీ ఆ తర్వాత సర్వర్‌గా, హెడ్‌ సర్వర్‌గా, చివరికి మేనేజరునీ అయ్యాను. అప్పటికి నాకు ఇరవయ్యేళ్లు వచ్చాయి. పగలంతా పడ్డ కష్టం మరిచి పోవడానికి- అన్న సాకుతో మెల్లగా తాగుడికి అలవాటు పడ్డాను. అది మా యజమానికి తెలిసింది. మా ఊరి వాళ్ల ద్వారా నాన్నకి కబురు వెళ్లింది. అదృష్టం ఏమిటంటే ఈసారి నాన్న కర్ర పట్టుకుని రాలేదు, వాడి చావు వాడిని చావమనండి అని వదిలేశాడు. దాంతో నాకు పౌరుషం వచ్చింది. దాచుకున్న డబ్బు కొంచెం ఉంది. దాంతో సొంతంగా ఏదన్నా చేయాలనుకున్నాను. నాకు వచ్చిందల్లా హోటల్‌ పనే. కానీ ముంబయిలో ఎక్కడ చూసినా ఉడుపి హోటళ్లే. అక్కడ లాభం లేదని మా అన్నయ్య దిల్లీలో ఉన్నాడని తెలిసి రైలెక్కి దిల్లీ చేరుకున్నాను. తను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాకేమో చేసిన ఉద్యోగం చాలు, ఇక ఏదైనా సొంతంగా చేయాలని ఆశ.

హోటల్‌ ఓనరు చెప్పుతో కొట్టేవాడు..!

పెట్టుబడి రెండువేలు
ఆ ప్రయత్నాల్లో ఉండగా గాజియాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో క్యాంటీన్‌ పెట్టడానికి అవకాశం ఉన్నట్లు తెలిసింది. వెంటనే దరఖాస్తు చేశాను. 1974 నాటి సంగతిది. అప్పటి వరకు నేను దాచుకున్న డబ్బులు రెండువేలే పెట్టుబడి. ముగ్గురు వంటవాళ్లను పెట్టుకుని రుచిగా, శుచిగా చేయించేవాణ్ణి. దాంతో మంచి పేరూ లాభాలూ వచ్చాయి. జీవితం ఇక సెటిలైపోయినట్లేనని ఊరెళ్లాను. అమ్మానాన్నా సంతోషించి పెళ్లి చేశారు. భార్య ప్రేమను తీసుకుని మళ్లీ దిల్లీ చేరాను. క్యాంటీన్‌ విషయంలో సాధించిన విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇంకా పెద్దగా ఏమన్నా చేయాలనిపించింది. ఆరోజుల్లో దిల్లీలో సరైన దక్షిణాది దోసె అంటే కేవలం రెండేచోట్ల దొరికేది. ఒకటి హల్దీరామ్స్‌ వాళ్లది. అది ధర తక్కువే కానీ రుచి ఏమాత్రం దక్షిణాది దోసెలాగా ఉండేది కాదు. రెండోది ఉడ్‌లాండ్‌, దాస్‌ప్రకాష్‌ హోటళ్లలో. అవి పెద్ద హోటళ్లు కాబట్టి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. దిల్లీ నగరం స్ట్రీట్‌ ఫుడ్‌కి ప్రసిద్ధి. అక్కడ వీధుల్లో దొరికే చాట్‌ల ధరలకే సరైన దక్షిణాది దోసెలు అందించగలిగితే మంచి వ్యాపారం జరుగుతుందన్నది నా ఆలోచన. దాంతో ధైర్యం చేశాను. 1986లో డిఫెన్స్‌ కాలనీలో ‘సాగర్‌’ పేరుతో హోటల్‌ ప్రారంభించాను. వారానికి రూ.3250 అద్దె. మొదటి రోజు వచ్చిన ఆదాయం 400. ఇలాగైతే అద్దె కూడా సరిపోదే, పొరపాటు చేశానా అని ఆ రాత్రంతా మథనపడ్డాను. ఎలాగూ మొదలుపెట్టాను కాబట్టి ముందుకే వెళ్లాలనుకున్నా. తెల్లవారుజామున లేచి పనిలోకి దిగితే అర్థరాత్రి వరకూ విరామం లేకుండా చేసే వాడిని. సిబ్బంది కూడా నాకు సహకరించేవారు. రుచిలో, నాణ్యతలో, శుభ్రతలో వేలెత్తి చూపటానికి లేకుండా జాగ్రత్త పడేవాడిని. ఆ శ్రమ ఫలించింది. ఉడ్‌లాండ్‌లో దొరికేలాంటి దోసె తక్కువ ధరకి సాగర్‌లోనే దొరుకుతుండడంతో హోటల్‌ ముందు జనాలు క్యూ కట్టసాగారు.

వాజ్‌పేయీ వచ్చేవారు!
నా హోటల్‌ వ్యాపారానికి ఇక తిరుగు లేదనుకుంటుండగా అప్పటివరకూ నాకు పోటీగా ఉన్న ఉడ్‌లాండ్‌ అమ్మకానికి వచ్చింది. దాన్ని సొంతం చేసుకుని కాస్త పైస్థాయి వినియోగదారుల్నీ ఆకట్టుకునేలా పెట్టుబడి పెట్టి ఇంటీరియర్స్‌ మార్చి కొత్త హోటల్‌కి ‘సాగర్‌ రత్న’ అని పేరుపెట్టాను. పదార్థాల ధరలూ పెంచాను. అయినా గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ‘సాగర్‌ రత్న’ 35 శాఖలతో నగరంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి, రాజీవ్‌ గాంధీ కుటుంబ సభ్యులతో సహా పెద్ద పెద్ద నాయకులు మా కస్టమర్లయ్యారు. ఇక ఇతర నగరాలకీ విస్తరించడానికి అదే సరైన సమయం అనుకుని ఫ్రాంచైజీల వైపు దృష్టి సారించాను. లూధియానాలో హోటల్‌ మహారాజా రీజెన్సీలో మొదటి ఫ్రాంచైజీ ప్రారంభమైంది. నాణ్యతా  ప్రమాణాల్లో తేడా లేకుండా చూడడానికి డిఫెన్స్‌ కాలనీలోని మా మొదటి హోటల్‌లో ఆర్నెల్లు శిక్షణ పొందిన సిబ్బందే ఫ్రాంచైజీల్లో పనిచేయాలన్న నియమం పెట్టాను. అలా, తర్వాత పదిహేనేళ్లలో ఉత్తరాదిలోని ప్రధాన నగరాలన్నిటిలోనూ, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సింగపూర్‌లలోనూ మొత్తం 36 ఫ్రాంచైజీలు పనిచేయడం మొదలెట్టాయి.

తీరప్రాంతంనుంచి వచ్చిన నేను దిల్లీ ప్రజలకు సీఫుడ్‌ని రుచి చూపించాలనుకుని డిఫెన్స్‌ కాలనీలోనే ‘స్వాగత్‌’ పేరుతో కొత్త హోటల్‌ పెట్టాను. ఆరోజుల్లో నగరంలో అలాంటివి అరుదు కాబట్టి వెంటనే క్లిక్‌ అయింది. మంగళూరు, చెట్టినాడ్‌, మలబార్‌ ప్రాంత రుచులను ఇష్టపడే భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఎక్కువగా వచ్చేవారు. అతికొద్ది కాలంలోనే ‘టాప్‌ సీఫుడ్‌ రెస్టరెంట్‌’లలో ఒకటైంది స్వాగత్‌. మొత్తం 90కి పైగా రెస్టరెంట్ల చైన్‌కి యజమానినయ్యాను. టర్నోవరు కోట్లలోకి వెళ్లింది.

ఆ డీల్‌... కొంపముంచింది!

అంతా సవ్యంగా ఉంటే అది వ్యాపారం ఎందుకవుతుంది... న్యూయార్క్‌కి చెందిన ఇండియా ఈక్విటీ పార్ట్నర్స్‌ సంస్థ 180 కోట్లు పెట్టుబడి పెడతానంటే గొప్ప అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని పొంగిపోయాను. దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలన్న  ఆశయంతో జయరామ్‌ బనన్‌ గ్రూపు ఏర్పడింది. 75శాతం వాటా, సీఈవో పదవీ ఆ సంస్థకీ; 22.7శాతం వాటా, ఛైర్మన్‌ పదవీ నాకు. కానీ ఆ మురిపెం మూడేళ్ల ముచ్చటైంది. వ్యాపారం పద్ధతి మారేసరికి కష్టపడి పెంచుకున్న బ్రాండ్‌ వాల్యూ కళ్లెదుటే పడిపోవడం మొదలెట్టింది. అది చూసి తట్టుకోలేక పోయాను. వెంటనే ఒప్పందం రద్దుచేసుకుని నా వాటా తిరిగి కొనేసుకున్నాను. ఆ తర్వాత మా అబ్బాయి రోషన్‌ కూడా చదువు పూర్తి చేసుకుని వ్యాపారంలో నాకు కుడిభుజమయ్యాడు. ఇప్పుడు మా గ్రూపు కింద స్టార్‌ హోటళ్లు, బడ్జెట్‌ హోటళ్లు, క్యాంటీన్లు, బేకరీలు ఉన్నాయి. ఇవి కాకుండా రెడీ టు ఈట్‌ మీల్స్‌, పచ్చళ్లూ, స్నాక్స్‌ తయారుచేసే సంస్థ ఉంది. ఉత్తరాదిన ఉల్లీ, వెల్లుల్లీ తినని శాకాహారులు ఎక్కువ. వారికోసం ప్రత్యేకంగా ‘శ్రమణ్‌’ పేరుతో గొలుసు రెస్టరెంట్లనీ ప్రారంభించాము. వ్యాపార బాధ్యతలన్నీ రోషన్‌ చూసుకుంటున్నా, పొద్దున్నే బయల్దేరి రాత్రి వరకూ దిల్లీ నగరంలో ఉన్న మా హోటళ్లన్నీ ఓసారి చుట్టి రాకుండా మాత్రం ఉండలేను.


పది రూపాయలకే ఫుల్‌మీల్స్‌!

ర్ణాటకలోని మారుమూల గ్రామంలో పుట్టి కోట్ల రూపాయల వ్యాపారసామ్రాజ్యాన్ని సృష్టించిన జయరామ్‌ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి.

* తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంతూళ్లో సాగర్‌రత్న రెస్టరెంట్‌ని ప్రారంభించి పదేళ్లుగా పది రూపాయలకే ఫుల్‌ మీల్స్‌ అందిస్తున్నారు.

* జయరాం గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌లో పనిచేసే పదివేల మందికి పైగా సిబ్బంది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే.

* హోటల్‌ మేనేజర్‌ నుంచి పాత్రలు శుభ్రం చేసేవారి వరకూ కన్పించిన ప్రతి ఒక్కరినీ పలకరించి క్షేమసమాచారాన్ని స్వయంగా కనుక్కుంటారు జయరాం.

* ఆయనెప్పుడూ తన హోటళ్లలో కూర్చుని భోజనం చేయరు. అతిథి దేవుళ్లు కూర్చునే చోటు అది- అని నమ్మే ఆయన- ఆకలైతే వంటగదిలోనే ఒక పక్కన నిలబడి తినేస్తారట.

* వినియోగదారులు లోనికివస్తూ ఎదురుపడితే తలవంచి వారిని సాదరంగా లోనికి ఆహ్వానించడం ఇప్పటికీ ఆయనకు అలవాటు.

No comments:

Post a Comment