Monday, August 23, 2021

దళితులు కేసీఆర్ నే నమ్మలేదు.. మల్లేపల్లిని నమ్ముతారా..?

హైదరాబాద్ : 23/08/2021

దళితులు కేసీఆర్ నే నమ్మలేదు.. మల్లేపల్లిని నమ్ముతారా..?

దళితులు కేసీఆర్ నే నమ్మలేదు.. మల్లేపల్లిని నమ్ముతారా..?

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!

దళిత బంధును స్వాగతించి.. సక్సెస్ చేద్దాం అంటూ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపునివ్వడం… దాన్ని కేసీఆర్ సొంత పత్రిక పతాక శీర్షికలో ప్రచురించడంపై దళిత మేధావుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో మేధావులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ కు భజన చేసే మల్లేపల్లి చెబితే దళితులు నమ్ముతారా..? అని కొందరు అంటుంటే.. ఆయన ఇంతకన్నా ఏం చెబుతారులే అని మరికొందరు వ్యగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కేసీఆర్ భారీ సభ పెట్టి దళిత బంధును ప్రారంభిస్తే.. వారం తరువాత మల్లేపల్లి వెబినార్ ద్వారా ఈ పథకాన్ని స్వాగతిద్దామని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏమై ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అందులోనూ హుజూరాబాద్ లో ఉండే దళిత మేధావులు, రిటైర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పిలుపునివ్వడం ఏంటని చర్చిస్తున్నారు. దళిత బంధును దళితులు విశ్వసించడం లేదనే అనుమానం కేసీఆర్ కు వచ్చిందా..? లేక ఇంటెలిజెన్స్ నివేదికలు నెగెటివ్ గా వచ్చాయా..? అందుకే.. మల్లేపల్లిని రంగంలోకి దింపారా..? అనే కోణాల్లో మాట్లాడుకుంటున్నారు. లేకుంటే పథకం ప్రారంభమైన ఇన్నాళ్లకు మల్లేపల్లి ఎందుకు మాట్లాడతారని అనుమానిస్తున్నారు.

కేసీఆర్ స్వయంగా హుజూరాబాద్ వెళ్లి భారీ సభ నిర్వహించి పథకాన్ని ప్రారంభిస్తే.. నమ్మని దళితులు.. మల్లేపల్లి చెబితే ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు మేధావులు. ఇంత చిన్న లాజిక్ ను కేసీఆర్ ఎలా మిస్ అయ్యారని అంటున్నారు. పథకం పెట్టి దానికి కావాల్సిన నిధులు ఇచ్చి అమలు చేయించే కేసీఆర్ ను నమ్మకుండా.. మల్లేపల్లిని నమ్ముతారా అని అడుగుతున్నారు. అసలు.. దళితుల కోసం మల్లేపల్లి చేసింది ఏమీ లేదని చెబుతున్నారు. కేవలం తన కుటుంబ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ పెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఆయన నిర్వహించే సంస్థకు స్థలం ఇచ్చి.. బిల్డింగ్ నిర్మాణానికి నిధులు ఇవ్వడమే కాకుండా కేసీఆర్ బుద్ధ ప్రాజెక్ట్ డైరెక్టర్ పదవి కట్టబెట్టారని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని మల్లేపల్లికి కేసీఆర్ కు పదవులు వచ్చాయని… దళితులకు ఒరిగిందేం లేదని నిలదీస్తున్నారు. ఘంటా చక్రపాణి, మల్లేపల్లి, గోరెటి వెంకన్న, సుమన్ ఇలా కొంతమందికి పదవులు వస్తే దళితులందరికీ వచ్చినట్లు కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థను నడిపే మల్లేపల్లి… దళిత బంధుకు సహకరించండి అని చెబుతూనే ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వం దళితులకు చేసిందేంటో కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు దళిత మేధావులు. అప్పుడే దళిత్ స్టడీస్ అన్న పదానికి అర్థం ఉంటుందని చెబుతున్నారు. అలాకాకుండా కేవలం కేసీఆర్ కు సహకరించండి అని అనడం లో అర్థం లేదని అంటున్నారు. ఇదంతా చూసి ఆయన నడుపుతున్నది సెంటర్ ఫర్ దళిత్ స్టడీసా..? లేక సెంటర్ ఫర్ కేసీఆర్ స్టడీసా అని కొందరు దళిత మేధావులు సెటైర్లు వేస్తున్నారు. తాను దళిత మేధావిని అని చెప్పుకునే మల్లేపల్లి.. ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు దళితులకు చేసిందేంటి..? చెయ్యందేంటి..? చేసిన మోసాలేంటి..? ఇలా అన్ని విషయాలు చెప్పి దళిత బంధుకు సహకరించాలి అంటే అర్థం ఉండేదని.. అలాకాకుండా కేసీఆర్ కు సపోర్ట్ చేయండని చెప్పడం తన స్వార్ధ ప్రయోజనాల కోసమే చెప్పినట్లుగా ఉందని విశ్లేషణ చేస్తున్నారు. అలాగే నిధులు ఎక్కడి నుండి వస్తాయి..? ఎలా వస్తాయి..? విధి విధానాలు ఏంటి..? దానివలన ఎలాంటి ప్రయోజనాలు దళితులకు ఉంటాయి..? గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలకు దీనికి ఉన్న తేడా ఏంటి..? ఇలా అన్ని విషయాలను మల్లేపల్లి ప్రస్తావించి ఉంటే బాగుండేదని నిలదీస్తున్నారు దళిత మేధావులు. ఇక కేసీఆర్ తన మంత్రివర్గంలో దళితులకు ఎందుకు సముచిత స్థానం కల్పించలేదో..? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చేయలేదో..? మంత్రివర్గంలో మాల సామాజికవర్గానికి అవకాశం ఇస్తే మాదిగకు ఇవ్వకుండా… మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే మాలకు ఇవ్వకుండా కేసీఆర్ ఎందుకు అలా చేశాడో చెప్పాల్సిందని నిలదీస్తున్నారు. ఏడేళ్లలో అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ దండ వేసి ఎందుకు దండం పెట్టలేదో..? తెలంగాణ భవన్ లో ఉన్న చిత్రపటాన్ని ఎందుకు తీసేశారో..? ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత తెచ్చింది ఎవరో..? దాని మిగులు నిధులు క్యారీ ఫార్వార్డ్ చేస్తామని చెయ్యంది ఎవరో..? ఆ నిధులను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కాకుండా ఇతర అవసరాలకు మళ్లించింది ఎవరో కూడా వివరిస్తే బాగుండేదని విశ్లేషణ చేస్తున్నారు. ఈ తప్పొప్పులను ఎత్తి చూపిస్తూ దళిత బంధుకు సహకరించాలంటే.. దళితులు నమ్మేవారని సలహా ఇస్తున్నారు. అలా కాకుండా ఏకపక్షంగా కేసీఆర్ కు సహకరించండని మల్లేపల్లి చెప్తే.. దళితులు నమ్ముతారా..? అని ప్రశ్నిస్తున్నారు మేధావులు.

No comments:

Post a Comment