Friday, August 6, 2021

జ‌డ్జిలంటే అంత చుల‌క‌నా… సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ అసంతృప్తి!

హైదరాబాద్ : 06/08/2021

జ‌డ్జిలంటే అంత చుల‌క‌నా… సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ అసంతృప్తి!

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

దేశంలో జడ్జిలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు తమకు వచ్చిన బెదిరింపుల గురించి ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు లేదా సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి దర్యాప్తు సంస్థలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం జార్ఖండ్ లోని ధన్ బాద్ లో  అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .

తప్పుడు ఆదేశాలు ఇస్తే న్యాయ వ్యవస్థపై మచ్చ పడుతుందన్న ఎన్వీ రమణ.. “న్యాయమూర్తులు పోలీసులకు లేదా సీబీఐకి ఫిర్యాదు చేస్తే వారు స్పందించడం లేదు.. ఇక ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే సాయమే చేయడం లేదు” అని అన్నారు.

జలై 28 న ఉదయం జాగింగ్ చేస్తున్న జడ్జి ఆనంద్ ను దుండగులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో.. ఖాళీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను ఆటో రిక్షా అకస్మాత్తుగా ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. పైగా వాహనం కూడా దొంగిలించబడిందని తెలిసింది. ఈ ఘటను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది.  సీబీఐ వైఖరిలో తాము మార్పును ఆశించినట్లు సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటివరకైతే ఎటువంటి మార్పు లేదని అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్  తో చెప్పారు. ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నట్టు తెలిపారు సీజేఐ. ఈ వ్యాఖ్యలను తాను “పూర్తి బాధ్యతతో పరిశీలించాకే చేస్తున్నట్లు చెప్పారు. గ్యాంగ్స్టర్లు అలాగే ఉన్నత స్థాయి నిందితులకు సంబంధించిన కేసులలో వాట్సాప్ , ఇతర సోషల్ మీడియా పోస్ట్లతో న్యాయమూర్తులను బెదిరిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఆనంద్ మరణం చాలా దురదృష్టకరం..‌‌ న్యాయమూర్తులకు భద్రత కల్పించాలని సీజేఐ చెప్పారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. మరోవైపు విచారణ సందర్భంగా.. కేసును సీబీఐకి అప్పగించినట్టుగా జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ సుప్రీం దృష్టికి తీసుకెళ్లగా.. “అంతటితో మీ పని అయిపోందా.. మీరు మీ చేతులు కడుక్కున్నారు.. అంతేనా ” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే, సరిహద్దు దాటిన చిక్కులు ఉన్నందున ఈ విషయాన్ని కేంద్ర ఏజెన్సీకి అప్పగించామని ఏజీ వివరించారు. విచారణ పురోగతిని సోమవారం కోర్టుకు తెలియజేయాలని సీజేఐ విచారణను వాయిదా వేశారు.


No comments:

Post a Comment