హైదరాబాద్ : 24/08/2021
సీఎస్.. వాట్ ఈజ్ దిస్?.. సోమేష్‌కు రెండోసారి హైకోర్టు జరిమానా!
తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పదే పదే హైకోర్టు ముందు దోషిగా నిలబడుతున్నారు. న్యాయస్థానాల తీర్పులను ధిక్కరిస్తూ విమర్శల పాలవుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో మరోసారి ఆయనకు హైకోర్టు జరిమానా విధించింది. మాజీ సైనికుడు పి. లక్ష్మీ నారాయణ రెడ్డికి రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా ఎంకెపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 118లో గతంలో ఆయనకు కేటాయించిన 4 ఎకరాల భూమిని రెండు వారాల్లోగా అప్పగించాలని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేయలేకపోతే తదుపరి విచారణలో చీఫ్ సెక్రటరీ కోర్టుకు హాజరు కావాలని.. తమ ఆదేశాన్ని ఎందుకు పాటించలేదో వివరించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు సీఎస్‌కు హైకోర్టు జరిమానా విధించడం ఇది రెండోసారి. సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆయన ఇప్పటికే మరో ధిక్కార కేసులో.. ఇదే లక్ష్మీనారాయణ రెడ్డికి రూ.20 వేలు చెల్లించారు.
మాజీ సైనికుల కోటా కింద 2010లో తనకు కేటాయించిన 4 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఇంతవరకు ఇవ్వలేదని లక్ష్మీ నారాయణ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ వెంటనే ఆ భూమిని ఆయనకు అప్పగించాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఆ పనిచేయకపోవడంతో ఆయన మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కారం గతంలోనే రూ. 20 వేలు జరిమానా విధించింది. అయితే ఆ తర్వాత కూడా స్పందన లేకపోవడతో లక్ష్మీ నారాయణ మరోసారి హైకోర్టు తలుపుతట్టారు.
చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ,జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం లక్ష్మీనారాయణ రెడ్డి దాఖలు చేసిన ధిక్కార కేసును విచారించింది. ఈ విషయంలో మాజీ సైనికుడిదే తప్పు అని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. ప్రభుత్వం ఆయనకు భూమిని ఎప్పుడో కేటాయించిందని, కానీ మూడేళ్లుగా మాజీ సైనికుడే దాన్ని స్వాధీనం చేసుకోలేదని.. ఎలాంటి సాగు కూడా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కాగితాలపై భూమిని కేటాయించడమే కానీ.. ఆ భూమిని తనకు భౌతికంగా స్వాధీనపరచలేదని మాజీ సైనికుడు కోర్టుకు ఫిర్యాదు చేశారు. రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. మాజీ సైనికాధికారి భూమికి హద్దులు నిర్ణయించడం లేదా మరే ఇతర ప్రొసీడింగ్‌లు ఇవ్వలేదని గుర్తించింది. దీంతో సోమేష్ కుమార్‌నే తప్పుబడుతూ.. జరిమానాతో పాటు రెండు వారాల్లోగా భూమిని అప్పగించాలని ఆదేశించింది.
No comments:
Post a Comment