హైదరాబాద్ : 21/08/2021
పాలమూరు మంత్రిపై ప్రగతి భవన్ గన్?
తొలివేలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్ టార్గెట్‌లోకి వెళ్లారా? వారం రోజులుగా మంత్రిపై వస్తున్న అక్రమాల ఆరోపణలపై సీక్రెట్ ఎంక్వైరీ జరుగుతోందా? హుజురాబాద్ ఉప ఎన్నికలోపే ఆయన పోస్ట్ ఊస్టింగ్ కాక తప్పదా?అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొద్దిరోజులుగా మీడియాలో ఆయనపై వస్తున్న వార్తలు.. ఇప్పుడు బేగంపేట్ క్యాంప్ ఆఫీస్‌లోనూ క్రేజీ కబుర్లుగా మారాయని తెలుస్తోంది. మంత్రి వర్గం నుంచి ఎప్పుడెప్పుడు ఒకరో, ఇద్దరినో తప్పించాలని కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని జరుగుతున్న ప్రచారం మధ్య.. ఆయన కన్ను ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్‌పై పడినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్, హైదరాబాద్‌లో శ్రీనివాస్‌గౌడ్ కుటుంబం, బంధువులకు ఉన్న ఆస్తులపై కేసీఆర్ రహస్యంగా దర్యాప్తు జరిపించారని… అది పూర్తయ్యి ఆయన టేబుల్‌పైకి చేరిందని ప్రగతి భవన్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.
తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం కేసీఆర్ ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఉన్నవారిలో ఎవరి తప్పించాలన్నది పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఉన్నవారంతా కూడా తానే స్వయంగా ఏరికోరి తెచ్చుకున్నవారే కావడంతో.. ఎవరిపై వేటు.. ఎలా.. అన్నది ఆయన తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్‌ను తప్పించినప్పటికీ.. ఆయన వ్యవహారం వేరు. ఒకరకంగా తిరుగుబాటు చేసినంత పనిచేసి.. ఈటల తనకు తానే వెళ్లిపోయారు. కానీ మిగిలిన వారు అలాకాదు.. అందరూ తన మాటే శాసనంగా నడుచుకునేవారు. దీంతో సమయం కోసం వేచి చూస్తూ..అప్పుడప్పుడు కేసీఆర్ మంత్రులపై రాళ్లు వేసి చూస్తున్నారని తెలుస్తోంది. అలా కరీంనగర్ మంత్రి గంగుల కమాలకర్‌ను ఆ మధ్య దాదాపుగా తప్పించేందుకు సిద్దమయ్యారు కానీ.. చివరి నిమిషంలో అది ఆగిపోయింది. కానీ కేసీఆర్ టాస్క్ మాత్రం కంప్లీట్ కాలేదని తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళితుల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్న కేసీఆర్ .. అందుకోసం కచ్చితంగా తాజా కేబినెట్‌లోని ఒక మంత్రిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ మధ్య ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ధైర్యం చేసి ఎవరో ఒకరిని పక్కనబెట్టక తప్పేలా లేదని ఆయన దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే సమయం చూసి.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేసీఆర్ గురి పెట్టారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పక్కా స్కెచ్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. శ్రీనివాస్‌గౌడ్‌ను నొప్పించకుండా.. తానొవ్వకుండా పక్కనబెట్టే మార్గం కేసీఆర్ ఆలోచిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా సీడ్‌బౌల్‌లో రికార్డ్ సృష్టించారనే పేరుతో శ్రీనివాస్‌గౌడ్‌ను స్వయంగా కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిచి అభినందించడంలో ఆంతర్యం ఇదేనని విశ్లేషిస్తున్నారు. మంచి పనిచేస్తే అంతలా మెచ్చుకున్న కేసీఆర్.. శ్రీనివాస్‌గౌడ్‌ను తప్పించారంటే ఏదో పెద్ద కారణమే ఉండొచ్చని ప్రజలకు సందేశం వెళ్తుందని, దీంతో బీసీ మంత్రిని తప్పించారనే అపవాదు కూడా రాదన్నది కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అని విశ్లేషిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందే.. పాలమూరు మంత్రి బలికాక తప్పదేమోనని అంచనా వేస్తున్నారు.
No comments:
Post a Comment