హైదరాబాద్ : 20/08/2021
అరెస్ట్.. ప్రతిసారి అవసరం లేదు – సుప్రీంకోర్టు
దేశంలో అరెస్ట్ అనేది అత్యంత సాధారణ విషయంగా మారిపోయిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల అత్యుత్సాహం కొన్నిసార్లు సమాజంలోకి వ్యక్తుల ఆత్మగౌరవాన్ని, వారి పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవాల్సి అవసరం లేదని, కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 170 అమలుపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోతాడనో లేదా సమన్ల ప్రకారం నడుచుకోలేడనే అభిప్రాయంతో పోలీసులు అరెస్ట్ చేయడం సహేతుకమైన కారణంగా కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దర్యాప్తునకు నిందితులు సహకరిస్తున్నప్పుడు కూడా అతన్ని అరెస్ట్ చేయాలనుకునే పోలీసుల ఉద్దేశ్యాన్ని తాము హర్షించలేమని తెలిపింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టుల తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది.
సీఆర్‌పీసీలోని సెక్షన్ 170 ప్రకారం ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసే సమయంలో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచాలనే విషయాన్ని ఓ అభ్యాసంగా మార్చుకున్నాయన్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. సీఆర్‌పీసీ సెక్షన్ 170 ఉద్దేశ్యం తప్పుదోవ పడుతోందని అభిప్రాయడింది. రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ అనేది వ్యక్తులకు సంక్రమించిన అతిపెద్ద హక్కు.. దాన్ని గౌరవించాలని ధర్మాసనం వెల్లడించింది. CRPC సెక్షన్ 170లోని కస్టడీ అనే పదం.. పోలీసులు లేదా న్యాయ నిర్బంధాన్ని సూచించదని.. చార్జీషీట్ దాఖలు చేసే సమయంలో అతని హాజరును మాత్రమే తెలుపుతుందని వెల్లడించింది.
కేసు దర్యాప్తు కోసం నిందితుడి కస్టడీ కచ్చితంగా అవసరమైనప్పుడో లేదా.. సాక్షులను నిందితుడు ప్రభావితం చేస్తాడని అనుకున్నప్పుడో లేదా తీవ్రమైన నేరం కావడమో లేదా పారిపోతాడని అనిపించినప్పుడో మాత్రమే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం. నిందితుడి అరెస్ట్ చేయొచ్చనే నిబంధన చట్టంలో ఉన్నప్పటికీ.. అది తప్పనిసరి ఏం కాదని తేల్చి చెప్పింది. పోలీసులు తమకున్న అరెస్టు చేసే అధికారాన్ని…దాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించింది. అరెస్ట్ చేయాలి కాబట్టి ఆ పనిచేస్తే.. అది ఒక వ్యక్తి పరువు, ఆత్మగౌరవానికి హాని కలిగించవచ్చని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఏడేళ్ల క్రితం నాటి కేసులో అరెస్ట్ మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిద్దార్థ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దాని విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఏడేళ్లుగా విచారణకు సహకరిస్తున్నప్పుడు.. కొత్తగా నిర్బంధంలోకి తీసుకోవాల్సి అవసరం లేదని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది
No comments:
Post a Comment