Wednesday, January 12, 2022

అవినీతి అధికారులతో ప్రమాదం..!

అవినీతి అధికారులతో ప్రమాదం..!


ముఖ్యమంత్రి మానస పుత్రిక ధరణితో ఇటు రైతులకు అటు ప్రభుత్వానికి తలపోటుగా మారిందన్నారు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ కుమార్. ధరణి బాధితుల జాబితాలో రైతులే కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టులు కూడా ఉన్నారని చెప్పారు. రాయలేని వ్యధను, తీర్చలేని దుఃఖాన్ని ఇది కలిగిస్తోందని ప్రభుత్వాన్ని బద్నాం చేసే గుదిబండగా మారిందని హెచ్చరించారు.

హైదరాబాద్ లో ఎక్కడబడితే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు నారగొని. చెరువుల్లో, నాలాలపై, ప్రభుత్వ భూముల్లో, పార్కుల్లో ఇలా ఎన్నో నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. అంటే ఇందులో రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారులు, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లే కనిపిస్తోందని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్న నిర్మాణాలకే కొంత మొత్తంలో చేతులు తడపాల్సి వస్తోంది.. ఇక అక్రమ నిర్మాణాలంటే పెద్ద మొత్తంలోనే నోట్ల కట్టలు చేతులు మారి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.


నిర్మాణం అనేది ఒక రోజులోనో, వారంలోనో పూర్తయ్యేది కాదన్నారు నారగొని. అవినీతి అధికారుల కను సన్నల్లోనే ఇదంతా జరుగుతోందని చెప్పారు. అవినీతి అధికారులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై సరైన చర్యలు లేకపోవడం వల్లే రికార్డులను చాలా సులువుగా తారుమారు చేస్తున్నారని ఆరోపించారు.


ఘట్ కేసర్ దగ్గరలో అధికార పార్టీ నాయకుడు సుమారు 11 ఎకరాల హెచ్ఎండీఏ లేఅవుట్ చేశాడని వివరించారు. అతను అమ్ముకున్న కొంతకాలానికి కొన్నవాళ్లు వారి అవసరాల కోసం అదే భూమిని అమ్ముకుందామని అనుకుంటే అది వక్ఫ్ బోర్డ్ భూమి అని రిజిస్ట్రేషన్ ఆపివేశారన్నారు. ఇక్కడ అవినీతి జరిగిందా, నిర్లక్ష్యం జరిగిందా తెలియదు కానీ.. అది ప్రైవేట్ భూమి కాకుంటే హెచ్ఎండీఏ పర్మిషన్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన తరువాత వక్ఫ్ బోర్డ్ భూమి ఎలా అవుతుందన్నారు. కొన్నవారి పరిస్థితి ఏంటి? అధికార పార్టీ నేతనే మోసపోయాడు.. అతని దగ్గర కొన్నవారు ఆందోళన చెందుతున్నారు.. బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని వివరించారు నారగొని ప్రవీణ్ కుమార్.


No comments:

Post a Comment