Wednesday, January 19, 2022

మహిళలపై జరిగే ఆన్ లైన్ దాడుల్లో వారి లైంగికత, లైంగిక సంబంధాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?

మహిళలపై జరిగే ఆన్ లైన్ దాడుల్లో వారి లైంగికత, లైంగిక సంబంధాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?

Courtesy by : BBC మీడియా తెలుగు ట్విట్టర్ 
  • పద్మ మీనాక్షి
  • బీబీసీ ప్రతినిధి

వేధింపులక గురైన మహిళ

"నీకు ఒకరితో కాదు, ఇద్దరి ముగ్గురితో సంబంధాలున్నాయి."

"నువ్వు సంసారానికి అర్హురాలివేనా?"

"నీతో కలిసి ఎవరు తకగలరు?"

అంటూ మహిళల లైంగికత, వ్యక్తిత్వం ఆఖరుకు శరీర భాగాలను కూడా దూషిస్తూ, అవమానపరుస్తూ చేసే ట్వీట్లు, వేధింపులు ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ లో ఎక్కువయ్యాయి. ఇవి ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు, సెలెబ్రిటీలు, ఉద్యమకారులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది.

మేము ఆర్‌ఎస్‌ఎస్ అభిమానులం."

"మేము ముస్లిం అమ్మాయిలను మారుస్తాం."

ఇవన్నీ ఇటీవల క్లబ్ హౌస్ అనే యాప్ లో జరిగిన ఒక చర్చలో మాట్లాడినట్లు జైమీన్ అనే వ్యక్తి 'ది ప్రింట్'కు చెందిన జర్నలిస్ట్ తనుశ్రీ పాండే చేసిన ట్వీట్ కు సమాధానంగా చెప్పారు. వీటి పట్ల జాతీయ మహిళా కమీషన్ స్పందించాలంటూ తను తనుశ్రీ కోరారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

ఇటీవల ఆన్ లైన్‌లో వేధింపులను ఎదుర్కొన్న కొంత మంది మహిళా జర్నలిస్టులు, ఉద్యమకారులతో బీబీసీ మాట్లాడింది.

ఒక మహిళ మాట్లాడే అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టి, ఆమె కుటుంబ నేపథ్యం, లైంగికత, ఆఖరుకు మరణించిన కుటుంబ సభ్యుల గురించి కూడా ట్రోల్స్ ద్వారా అవమానపరిచి, బెదిరించి గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని ప్రోగ్రెస్సివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్ కన్వీనర్ సంధ్య అభిప్రాయపడ్డారు.

ఇదంతా గత నాలుగేళ్లుగా మరింత పెరిగిందని ఆమె అంటారు.

సంధ్య

ఫొటో సోర్స్,SANDHYA/FACEBOOK

ఫొటో క్యాప్షన్,

సంధ్య

"మీకు కుటుంబాలు లేవు, సంసార స్త్రీలు కారు. కుటుంబాలు కూల్చుతారు. విలువలు లేవు అని అంటూ దూషిస్తారు. ట్రోలర్స్ దృష్టిలో విలువలంటే దూషించడం, అవమానించడమా?" అని సంధ్య అడిగారు.

టెక్ ఫాగ్ అనే యాప్ ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొంత మంది ప్రముఖులు, , మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోందని ఇటీవల వైర్ పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా పాలక పక్షానికి అనుకూలంగా లేని మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోందని, దీని ద్వారా వారిని అవమానపరిచి, వేధించడమే లక్ష్యమని వైర్ కథనం చెబుతోంది.

ఈ దాడులను చాలా వరకు ధ్రువీకరణ కాని అకౌంట్ల ద్వారా చేస్తున్నట్లు తేల్చింది.

దీనికి స్పందిస్తూ రానా ఆయూబ్ అనే విలేఖరి "ఇందులో ఆశ్చర్యపోయేందుకు ఏమి లేదు" అని ట్వీట్ చేశారు.

ఇలా లక్ష్యం చేసుకోవాలనుకునే వ్యక్తుల మతం, లింగం, లైంగిక ఆసక్తులు, భాష, వయసు, రాజకీయ అనుబంధం. కొన్ని సార్లు ఆ వ్యక్తుల చర్మం రంగు, ఆఖరుకు వారి రొమ్ము పరిమాణాన్ని కూడా వారి డేటాబేస్ లో పొందుపరిచి అవసరమైనప్పుడు అన్ని విధాలా వేధింపులకు పాల్పడుతూ ఉంటారు. దాంతో, కొన్ని వేల అకౌంట్ల నుంచి వేధింపులకు గురయ్యేలా చేస్తారు" అని వైర్ పేర్కొంది.

జనవరి 01 2021 నుంచి మే 31 2021 వరకు వైర్ నిర్వహించిన పరిశోధనలో మహిళా జర్నలిస్టులు చేసిన ట్వీట్లకు 4.6 మిలియన్ సమాధానాలు రాగా, అందులో 18% అంటే 8 లక్షలకు పైగా సమాధానాలు టెక్ ఫాగ్ నిర్వహిస్తున్న అకౌంట్ల నుంచి వస్తున్నట్లు తేలింది.

అందులో 67% అంటే (5.36 లక్షల) సమాధానాలు అవమానకరంగా, వేధింపులతో కూడుకుని ఉన్నాయి.

"సోషల్ మీడియాలో కనిపిస్తున్న ధోరణి, సమాజం సాధించిన అభ్యుదయాన్ని నాలుగు దశాబ్ధాల వెనక్కి లాక్కుని వెళ్లినట్లు అనిపిస్తోంది. టెక్నాలజీ సాయంతో 30 ట్వీట్లను ఒక రోజులో లక్ష ట్వీట్లుగా మార్చే కొన్ని శక్తులు అభ్యుదయ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది కచ్చితంగా అధికారిక శక్తుల సహాయంతో జరుగుతున్న పనే" అని ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ పద్మజ షా అన్నారు.

"నిజానికి సమాజం మారలేదు. ఇది కొన్ని వర్గాలు, టెక్నాలజీ ద్వారా వారి నమ్మకాలను సమాజంలో నాటేందుకు చేస్తున్న ప్రయత్నం" అని ఆమె అన్నారు.

వేధింపులకు పాల్పడే వారి భాషకు, ఆలోచనలకు మూలం ఎక్కడని అంటూ, ఏ ధర్మం మనిషిని, మహిళను అవమానపర్చమని చెబుతోందని సంధ్య ప్రశ్నించారు.

వేధింపులక గురైన మహిళ

ఫొటో సోర్స్,GETTY IMAGES

స్త్రీల లైంగికతను ఎందుకు ప్రస్తావిస్తున్నారు?

అయితే, స్త్రీల పవిత్రతకు శీలాన్ని ముడిపెడుతూ సమాజం ఇచ్చిన ప్రాముఖ్యమే ఇటువంటి దాడులకు, భావజాలానికి కారణం అని సామాజిక కార్యకర్త దేవి అంటారు.

"సాహిత్యంలో, సినిమాల్లో కూడా కూడా మహిళల పవిత్రతకు శీలంతో ముడిపెట్టారు. స్త్రీని అణచివేయాలంటే వారి లైంగికత, శరీర భాగాలపై దాడి చేయడమే వారికి సులభంగా దొరికే ఆయుధం" అని దేవి అన్నారు.

మహిళను ఒక లైంగిక వస్తువుగా, రంగు, అందంతో పోల్చి చూస్తారు. మహిళ అంటే అందం, పురుషుడు అంటే డబ్బు, అధికారానికి ప్రతిబింబంగా చూసినంత వరకు ఈ ధోరణి మారదని అంటారు ఆమె.

"ఒక స్త్రీ శీలం కోల్పోతే, ఆమెతో పాటు అదే చర్యలో పాల్గొన్న పురుషుడు కూడా శీలం కోల్పోయినట్లు కాదా? కానీ, పురుషత్వాన్ని అధికార స్వభావంతో చూస్తూ, స్త్రీ శీలాన్ని మాత్రం కించపరిచే విధంగా మాట్లాడతారు. ఈ చర్యలో పురుషుడికి ఎటువంటి అవమానం లేదా" అని దేవి అన్నారు.

ఒక వైపు స్త్రీ దేవత అనే సంస్కృతికి పరిరక్షకులం అని చెప్పుకుంటూ , మరో వైపు స్త్రీని అవమానించడం విరుద్ధ విలువలను ప్రతిబింబిస్తోందని పద్మజ షా అభిప్రాయపడ్డారు.

ఆత్మహత్యలకు కూడా దారి తీయవచ్చు

వీటి ప్రభావం ఎన్నో ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న వారిపై పెద్దగా పడనప్పటికీ, వారి కుటుంబాలపై, సాధారణ మహిళలపై తీవ్రంగా ఉండవచ్చని ఇటీవల ఆన్‌లైన్‌‌లో ట్రోలింగ్ కు గురైన హైదరాబాద్‌కు చెందిన తులసి చందు అన్నారు. వేదన భరించలేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులకు కూడా దారి తీయవచ్చని చెప్పారు.

ఆమె స్వతంత్ర జర్నలిస్టుగా చేస్తున్న వీడియోలకు వ్యతిరేకంగా ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో కామెంట్లు చేసి పోస్టులను వైరల్ చేశారు.

టెక్ ఫాగ్ యాప్ ద్వారా ఇస్మత్ ఆరా, హిబా బేగ్, నేహా దీక్షిత్, ఫాతిమా ఖాన్, జ్యోతి యాదవ్, సాక్షి జోషి లాంటి కొంత మంది మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసినట్లు వైర్ కథనం పేర్కొంది.

ఈ ధోరణిని కొంత కాలంగా ఎదుర్కొంటున్న సంధ్య మాత్రం "అపరిచితుల వ్యాఖ్యలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

గొంతు మూయించడం, అభిప్రాయ వ్యక్తీకరణను ఆపడమే ట్రోలర్స్ ఉద్దేశ్యం అయినప్పుడు వారికెటువంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

అయితే, దేవి మాత్రం అటువంటి వారికి ఎదురు తిరగడం ద్వారానే చాలా సార్లు నోరు మూయించగలం అని అన్నారు. "కానీ, ప్రతి సారి ఇది సాధ్యపడదు. నా ఆరోగ్యకరమైన తర్కాన్ని వాదించలేక వారు అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తే నేనెందుకు వారితో సమానంగా వాదించాలి" అని దేవి అడిగారు.

"భయంకరమైన విషాన్ని ఎలా ఎదుర్కొంటాం?" అని అన్నారు.

“ఒక్కొక్కసారి నన్ను చంపేయమని కూడా పిలుపులు ఇచ్చే పోస్టులు కూడా వచ్చాయి. అది నాతో పాటు, నా కుటుంబాన్ని కూడా భయాందోళనలకు గురి చేసిన సంఘటన” అని సంధ్య చెప్పారు.

వీడియో క్యాప్షన్,

అమ్మాయిలూ... ఆన్‌లైన్ వేధింపుల నుంచి ఇలా తప్పించుకోండి

వ్యవస్థ ఎలా స్పందిస్తోంది?

వేధింపులు ఇంట్లో అయినా, ఆన్‌లైన్ లో అయినా నేరంగానే పరిగణించాలని పద్మజ షా అంటారు. మహిళ వ్యక్తిత్వం, ఉనికిని లైంగికతతో ముడిపెట్టేస్తారు. లైంగికంగా అవమానపర్చడం, అత్యాచారం చేస్తాం అనే పదాలను వాడి బెదిరింపులకు పాల్పడతారని అన్నారు.

తులసిపై జరిగిన వేధింపుల గురించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తులసి తెలిపారు.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నప్పటికీ, ఫేస్‌బుక్‌కు నోటీసులు ఇవ్వగా వారి నుంచి ఇంకా ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీబీసీతో ఏసీపీ సైబర్ క్రైమ్స్ కె.వి.ఎం. ప్రసాద్‌ చెప్పారు.

అయితే, ఇదే విషయం పట్ల ఫేస్‌బుక్ కు కూడా రిపోర్ట్ చేయగా, ఈ కామెంట్లు తమ కమ్యూనిటీ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ఫేస్‌బుక్ సమాధానమిచ్చినట్లు తులసి తెలిపారు. ఫేస్‌బుక్ లో ఎవరో ట్యాగ్ చేస్తుంటే అలెర్ట్ పంపిస్తున్నప్పుడు, ఫోటో మార్ఫింగ్ అయినప్పుడు, పదాలు అవమానకరంగా ఉన్నప్పుడు, అది కమ్మూనిటీ నిబంధనలకు అనుగుణంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఫేస్ బుక్

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఇటీవల ఫేస్‌బుక్ మహిళలకు తమ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా ఉండేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం చేసింది.

ఇటువంటి పోస్టుల పట్ల ఫేస్‌బుక్ ఎలా స్పందిస్తుందని బీబీసీ అడిగినప్పుడు, ఫేస్‌బుక్ ప్రతినిధి నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు.

వ్యవస్థ వీటి పట్ల చర్యలు తీసుకోకపోవడం వల్లే బుల్లీ బాయ్ లాంటి యాప్స్ వెలుగు చూశాయి అని సంధ్య అన్నారు.

వారి పై చర్యలు తీసుకోవడం పక్కన పెడితే, కనీసం, అసభ్యకర రీతిలో ప్రవర్తించిన వారి అకౌంట్‌ను తొలగించడం కానీ, అసభ్యకర రీతిలో ఉన్న పోస్టులను కూడా తొలగించకపోవడం విచారకరమని తులసి అన్నారు.

“ఇటువంటి పరిస్థితుల్లో, దాడి చేసే వారికి భయం ఎలా కలుగుతుందని అంటూ చట్టాల కంటే సోషల్ మీడియా వేదికలు బలమైనవా?" అని తులసి ప్రశ్నించారు.

ముంబయి కి చెందిన స్వతంత్ర విలేఖరి సాక్షి జోషి పై జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేసినప్పుడు ముంబయి పోలీసులు సత్వరమే స్పందించారని సాక్షి ట్వీట్ చేశారు.

అయితే, ఇదే తరహా స్పందన సాధారణ ప్రజల ఫిర్యాదుల పట్ల కూడా ఉండాలని నెటిజెన్ల ట్వీట్లు చేస్తున్నారు. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, రాజకీయ నాయకులు, ప్రముఖులు మాత్రమే కాకుండా, సాధారణ వ్యక్తులు వేధింపులకు గురైనప్పుడు కూడా వ్యవస్థ స్పందించాలని పద్మజ షా అన్నారు.

మహిళా కమీషన్ డిమాండ్ మేరకు ఐపీసీ‌లో 153 సెక్షన్ ఏ, 295ఏ, 354ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సైబర్ సెల్ డీసీపీ కె.పి.ఎస్ మల్హోత్రా తెలిపారు.

సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మహిళ శరీర భాగాలను, లైంగికతను అవమానిస్తూ చేసే వేధింపులు పెరిగాయి.

ఫొటో సోర్స్,SABARITHA

ఫొటో క్యాప్షన్,

సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మహిళ శరీర భాగాలను, లైంగికతను అవమానిస్తూ చేసే వేధింపులు పెరిగాయి.

పరిష్కారం ఎక్కడ?

వీటిని వెనక నుంచి నడిపించే శక్తులపై చర్యలు తీసుకోవాలని జెండర్ నిపుణులు అంటున్నారు.

“చాలా మంది అమ్మాయిలు న్యూనతా భావానికి లోనవ్వడమే అసలైన సమస్య. అమ్మాయి ఎదురు తిరిగినప్పుడు, లేదా ధైర్యంగా ఎదుర్కొన్న నాడే వాటిని నిరోధించవచ్చు" అని దేవి అంటారు.

"భరించు లేదా పోరాడు." అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తే స్వభావాన్ని మాత్రం అణచివేసుకోకూడదని దేవి అంటారు.

వేధింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న నాడే వీటిని అరికట్టడం సాధ్యం అవుతుందని పద్మజ షా అంటారు.

వేధింపులతో కూడిన పోస్టులు, ట్వీట్ల పై చర్య తీసుకునే విధంగా ఐటీ చట్టాలు కూడా రూపొందించాలని తులసి అంటారు.

"వ్యవస్థ పై ఇంకా నమ్మకముంది. వారు స్పందిస్తారని భావిస్తున్నాను" అని ఆమె ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు

No comments:

Post a Comment