Saturday, January 8, 2022

రాఘవ కేసుల చిట్టా.. అన్ని వివరాలు వెల్లడించిన ఏఎస్పీ

రాఘవ కేసుల చిట్టా.. అన్ని వివరాలు వెల్లడించిన ఏఎస్పీ

కలకలం రేపిన పాల్వంచ రామకృష్ణ ఘటన, వనమా రాఘవ అరెస్ట్ పై మీడియా సమావేశం నిర్వహించారు పోలీసులు. ఏఎస్పీ రోహిత్ రాజ్ అన్ని వివరాలు వివరించారు. 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర రాఘవను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయన్నారు ఏఎస్పీ. గతంలో నమోదైన కేసులపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. రామకృష్ణ సెల్ఫీ వీడియోలో తన బాధను తెలిపాడని… రాఘవ డబ్బులతో పాటు తన భార్యను కూడా అడిగినట్లు చెప్పాడన్నారు. ఘటన జరిగిన రోజే ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించామని చెప్పారు. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ ఒప్పుకున్నట్లు తెలిపారు.


రాఘవతో పాటు గిరీష్, మురళీ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు రోహిత్ రాజ్. వీరిద్దరితోపాటు రమాకాంత్, శ్రీనివాస్ అనే మరో ఇద్దరు రాఘవను తప్పించే ప్రయత్నం చేశారని.. నలుగురిని సెక్షన్ 212 కింద అరెస్ట్ చేశామన్నారు.


వనమా రాఘవ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వాపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నాడు. కొద్దిరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొత్తగూడెం బంద్ కూడా నిర్వహించాయి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలనే డిమాండ్ రాష్ట్రమంతా వినిపిస్తోంది. ఇప్పటికే రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.

No comments:

Post a Comment