Monday, January 31, 2022

మెగా’ కరెప్షన్.. ఆకునూరి సంచలనం

మెగా’ కరెప్షన్.. ఆకునూరి సంచలనం

– రజిత్ కుమార్ తన నిజాయితీ నిరూపించు కోవాలి

– ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలి
– మేఘా సంస్థ విచారణ కమిటీని ప్రభావితం చేయొచ్చు
– మంత్రుల కాళ్లు మొక్కితే అధికారులకు ప్రమోషన్స్
– దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు
– విద్యా, ఆరోగ్యంపై కేటాయిస్తే దోచుకోలేరు..
-తొలివెలుగుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ

ఐఏఎస్ అధికారి రజిత్ కుమార్తె పెళ్లి అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాహ ఖర్చులకు మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ డబ్బులు సమకూర్చిందనే వార్తలు విపక్షాలకు ఆయుధంగా మారింది. తాజాగా ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలివెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

రజిత్ కుమార్ తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆకనూరి అన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ఇంత వరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోందని చెప్పారు. ఒక రిటైర్డ్ జడ్జీతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం విచారణకు ఆదేశించినా.. మేఘా కృష్ణారెడ్డి కమిటీని ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని అనుమానించారు.

తెలంగాణలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కలిసి నాకింత, నీకింత అంటూ అవినీతి సొమ్ము పంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ తెలంగాణ ప్రజల కష్టాన్ని హవాలా రూపంలో దేశం నుంచి తరలించేస్తున్నారని అన్నారు. కుల ప్రాతిపదికన అధికారులకు పదోన్నతలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి అధికారులను అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులకు కాళ్లు మొక్కితే ప్రమోషన్స్ వస్తాయనే అభిప్రాయం ఐఏఎస్ అధికారుల్లో ఏర్పడిందని ఆకునూరి మురళీ అన్నారు.

తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా.. ఇంత వరకు ఒక్క ఐఏఎస్ అధికారి కూడా సస్పెండ్ కాలేదంటే.. రాజకీయ నాయకులు, అధికారులు కమ్ముక్కై అవినీతి చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో పని చేస్తున్న ఓ ఐఏఎస్ అధికారికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ కూడా ఉందని ఇటీవల తనకు తెలిసిందని చెప్పారు. లక్షన్నర కోట్ల రెవెన్యూ ఉన్న తెలంగాణలో కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడానికి కారణం పేట్రేగిపోతున్న అవినీతి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని ఆయన వివరించారు. దీనిలో రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకే కేటాయించారని అన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడితే.. పెద్ద అవినీతి చేసుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన ఆరోపించారు. విద్యా, ఆరోగ్యం, మౌలికవసతుల కల్పనపై ఎక్కువ కేటాయింపులు పెడితే దోచుకోవడానికి అవకాశం ఉండదు కనుక లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తొలివెలుగుతో ఆకునూరి మురళీ చెప్పారు.


No comments:

Post a Comment