Thursday, January 13, 2022

మరోసారి పప్పులో కాలేసిన కేటీఆర్!

మరోసారి పప్పులో కాలేసిన కేటీఆర్!

రాజకీయాల్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు కామన్. ప్రతిపక్షాలు కామెంట్స్ చేయడం.. అధికార పక్షం కౌంటర్స్ ఇవ్వడం తరచూ జరిగేవే. ఈ క్రమంలోనే ఛాలెంజ్ లు విసురుకుంటూ ఉంటారు నాయకులు. అయితే.. ఏదో సవాల్ చేశామన్నట్లు కాకుండా దానిపై బలంగా నిలబడితేనే జనాల్లో ఓ గుర్తింపు ఉంటుంది. లేకపోతే పరువు గోవిందా. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు ఐటీ మంత్రి, కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్న కల్వకుంట్ల తారక రామారావు.

రాష్ట్రంలో రైతులకు తాము చేస్తున్నంత మేలు ఏ రాష్ట్రం చేయడం లేదనేది కేటీఆర్ వాదన. దీనిపై చర్చకు ఎవరొస్తారో రండి చూద్దామని ఈమధ్య సవాల్ చేశారు. ఆయన ఛాలెంజ్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వీకరించారు. చర్చకు సై.. ప్లేస్ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే అంటూ ప్రతి సవాల్ విసిరారు. వీళ్లిద్దరి సవాళ్లను చూసి.. రైతుల మేలు కోసం తొలివెలుగు చర్చా వేదికను నిర్వహించింది. ప్లేస్, టైమ్ చెప్పి ఇద్దర్నీ ఆహ్వానించింది. రైతులపై అర్ధవంతమైన చర్చ జరగాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తొలివెలుగు స్టూడియోకు వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. కానీ.. కేటీఆర్ మాత్రం గమ్మునుండిపోయారు. సరిగ్గా అదే టైమ్ లో ఆస్క్ కేటీఆర్ అంటూ ట్విట్టర్ లో కూర్చున్నారు. అయితే.. నెటిజన్లు ఆయనకు అక్కడ చుక్కలు చూపించారు. తొలివెలుగు డిబేట్ కు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. సవాల్ చేసి తప్పించుకోవడం ఏంటని ప్రశ్నించారు.
నిజానికి కేటీఆర్ కు ఇది కొత్తేం కాదని అంటున్నారు విశ్లేషకులు. గతంలో వైట్ ఛాలెంజ్ సమయంలోనూ ఇలాగే తప్పించుకున్నారని గుర్తు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ కేసు వ్యవహారం నుంచి వైట్ ఛాలెంజ్ పుట్టింది. డ్రగ్స్ కేసు నుంచి సెలబ్రిటీలను బయటపడేయడానికి అధికార పక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని.. సదరు నాయకులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే టెస్ట్ చేయించుకోవాలని.. వైట్ ఛాలెంజ్‌ కు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. దీనికి కేటీఆర్ ‌కూడా అంతే దీటుగా స్పందించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని.. ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్ చేయించుకునేందుకైనా సిద్ధమన్నారు. కానీ.. రాహుల్ గాంధీ రావాలంటూ మెలిక పెట్టారు. సవాల్ చేసిన మనిషిని వదిలేసి వేరేవాళ్ల పేరును తెరపైకి తీసుకురావడంపై అప్పట్లోనే కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి. ఛాలెంజ్ చేయడం ఎందుకు.. లేనిపోనివి చెప్పి తప్పించుకోవడం దేనికి అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇక.. సంచలనం రేపిన సైదాబాద్ బాలిక అత్యాచారం నిందితుడు రాజు అరెస్ట్ విషయంలోనూ కేటీఆర్ పరువు పోగొట్టుకున్నారు. ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారంటూ ట్వీట్ చేశారు. కానీ.. అప్పటికి అతడ్ని పోలీసులు పట్టుకోలేదు. అయినా.. ఆమాత్రం తెలియకుండానే ట్వీట్ చేశారు. దీనిపై ఆయనకు ప్రతిపక్షాలు, ప్రజలు చివాట్లు పెట్టారు. ఇలా కేటీఆర్ పరువు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎంతో చేశాం అని ప్రెస్ మీట్లలో గొప్పలు చెప్పుకుంటుంటారు కేటీఆర్. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ పథకాలే కాపీ కొడుతున్నాయని పదే పదే చెబుతుంటారు కూడా. అలాంటిది రైతు సమస్యలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరితే మాత్రం రాలేదు. అంటే.. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరా? అన్నదాతలు అప్పుల పాలయ్యారా? ఆత్మహత్యలు పెరిగాయా? ఛాలెంజ్ చేసి ఎందుకు రాలేదు? ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో అసలేం చేయలేదా? అనే సందేహాలు రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నాయి.

No comments:

Post a Comment