6వేల ఎన్జీవోల లైసెన్సులు రద్దు – ఏపీవే దాదాపు వెయ్యి సంస్థలు
దేశవ్యాప్తంగా 6వేల 3 ఎన్జీవోలు ఫారెన్ కంట్రిబ్యూషన్ లైసెన్సులు కోల్పోయాయి. మన దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం… FCRA ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిబంధనల పేరిట కేంద్రం ఎన్జీవోలను వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కూడా దాదాపు 6 వేల ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. జనవరి 1 నాటికి లైసెన్స్ కోల్పోయిన సంస్థలు మొత్తం 12,580. దేశంమొత్తంలో ఎఫ్ సీ ఆర్ ఏ నమోదిత సంస్థలు 22,832 సంస్థలుండగా… 16,829కి తగ్గినట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏ ఎన్జీవో అయినా విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే…విదేశీ వ్యవహారాల నియంత్రణ చట్టం కింద లైసెన్స్ తీసుకోవాలి. వాటి గడువు డిసెంబర్ 31తో ముగిసింది. లైసెన్స్ పునరుద్ధరణకు ఆయా ఎన్జీవోలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలు కారణాలతో వాటిని తిరస్కరించారు. మరికొన్ని దరఖాస్తే చేసుకోలేదు.
ఇక దేశవ్యాప్తంగా 6వేలకు పైగా ఎన్జీవోల లైసెన్సులు రద్దుకాగా… అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంస్థలే దాదాపు వెయ్యి వరకున్నాయి. క్రైస్తవ సంస్థలతోపాటు పలు ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి.
1976లో అమల్లోకి వచ్చిన ఎఫ్‌సీఆర్‌ఏ….ప్రకారం విదేశీ సంస్థలు, వ్యక్తుల నుంచి…ఎలాంటి సాయం స్వీకరించాలన్నా కొన్ని నిబంధలు, విధివిధానాలు తప్పనిసరి. యూపీఎ ప్రభుత్వ హయాంలో 2010లో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010’కు సవరణలు చేస్తూ… న్యాయ, శాసన, పరిపాలన, మీడియా రంగాలకు విదేశీ విరాళాలను నిషేధించారు.
2020లో మోదీ సర్కారు మరికొన్ని సవరణలు చేసింది. విదేశీ విరాళాలు పొందే ఎన్జీవో నిర్వాహకులు వారి ఆధార్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు విదేశీ విరాళాలు పొందటం నిషేధం. అంతే కాదు ఆయా సంస్థలు, ప్రతినిధులు…గతంలో తాము ఎలాంటి మతమార్పిళ్లకు పాల్పడలేదని…లేదని క్రిమినల్ కేసుల్లోనూ లేమని డిక్లరేషన్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. విదేశీ నిధులు పొందే సంస్థలకు ఢిల్లీ భారతీయ స్టేట్ బ్యాంకులో ఎఫ్‌సీఆర్‌ఎ ఖాతా ఉండాలి. విదేశాల నుంచి అందుకుని, వినియోగించిన విరాళాల వివరాలు వార్షిక రిటర్నులు ఏటా ఇవ్వాలి. ఈ వివరాలను ఎఫ్.సి.ఆర్.ఎ. పోర్టల్ అయిన www.fcraonline.nic.inలో పొందుపరుస్తారు. ఆరేళ్లుగా విదేశీ విరాళాలను పొందుతూ వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను సమర్పించని వాటిపై చర్యలు తీసుకుంటారు. అంతకు ముందు 2014-19 మధ్య నిబంధనలను ఉల్లంఘించిన 14,500 స్వచ్ఛంద సంస్థలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి విరాళాలు సేకరిస్తూ, వాటిని దుర్వినియోగ పరుస్తున్న అనేక సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది మోదీ సర్కారు.
స్వచ్ఛంద సంస్థలకు అత్యధిక విరాళాలు అమెరికానుంచే వస్తాయి. గత నాలుగేళ్లలో దేశంలోని వివిధ సంస్థలకు విదేశాల నుంచి 64,681 కోట్ల విరాళాలు వస్తే అందులో 40శాతం అంటే దాదాపు 25 కోట్ల రూపాయలు అమెరికానుంచి వచ్చినవే.
దేశవ్యాప్తంగా లైసెన్స్ రద్దైందని చెబుతున్న సంస్ఖల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా IMA, ఆక్సఫామ్ ఇండియా, కామన్ కాజ్, ఇమ్మాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యుబర్ క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ వంటి ముఖ్యమైన సంస్థలూ ఉన్నాయి.
ఇంకా హమ్దార్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, డిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, జామియా మిలియా ఇస్లామియా, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ సొసైటీ, కోల్‌కతాకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ (IICC), JNUలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, డిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలు కూడా ఉన్నాయి.
సెప్టెంబర్ 29, 2020 , సెప్టెంబర్ 30, 2021 మధ్య గడువు ముగిసే కొన్ని NGOల FCRA రిజిస్ట్రేషన్ చెల్లుబాటును మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది కేంద్రం.
No comments:
Post a Comment