Tuesday, January 25, 2022

నల్లమల్ల బిడ్డకు అత్యుత్తమ పురస్కారం......! 12 మెట్ల దర్శనం మొగులయ్యకు 'పద్మశ్రీ' ప్రకటించిన కేంద్రం

*నల్లమల్ల బిడ్డకు  అత్యుత్తమ పురస్కారం......!*

*12 మెట్ల దర్శనం మొగులయ్యకు 'పద్మశ్రీ' ప్రకటించిన కేంద్రం*
*కళారంగంలో 'నల్లమల' బిడ్డకు అత్యున్నత* *పురస్కారం*
*జానపద పాటలే* *జీవనోపాధిగా మార్చుకున్న వైనం..*

*గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన 'కిన్నెర' ఖ్యాతి*
*2015లోఉగాది పురస్కారం*

ఆడా లేడు మియాసావ్‌..
ఈడా లేడు మియాసావ్‌..
పానిగంటి గుట్టలమీద పావురాల
గుండున్నదీ..
రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..'
అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం 'కిన్నెర' కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది.
జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్‌ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్‌ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

*link Media ప్రజల పక్షం🖋️* 

No comments:

Post a Comment