Thursday, January 13, 2022

దొంగలు.. దొంగలు.. కోట్లు పంచుకున్నారు

దొంగలు.. దొంగలు.. కోట్లు పంచుకున్నారు

– స‌ర్కారీ భూములకు చెన్నై కంపెనీ గ్రహణం
– గోప‌న్ ప‌ల్లిలో 5 ఎక‌రాలకు 100 కోట్ల రుణం
– బ్యాంకు యాక్ష‌న్ దాకా.. సర్కార్ మొద్దు నిద్ర
– జేకేఎస్ కన్ స్ట్రక్షన్ తీరుతో అవాక్కయిన అధికారులు
– టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని వివ‌రాలు కోరిన సీబీఐ
– తొలివెలుగు చేతిలో సీబీఐ లేఖ
– గ‌తంలో రుణాలు ఎగ్గొట్టిన వారిపై చర్యలేవి

తొలివెలుగు క్రైం బ్యూరో:హైద‌రాబాద్ భూములు ఇప్పుడు ఆసియాలోనే టాప్ రేట్లు ప‌లుకుతున్నాయి. ఇలాంటి భూముల‌కు లిటిగేష‌న్స్ కోకొల్ల‌లు. అయితే.. ప్ర‌భుత్వం త‌న భూమిని కాపాడుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. గ‌తంలో ఆంధ్రా పాల‌కులు భూముల‌ను దోచుకుంటున్నార‌ని గ‌గ్గోలు పెట్టిన టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బ‌డా బాబుల చేతిలో ఉన్న సర్కారీ భూముల‌ను కాపాడలేక‌పోతోంది. చిన్నా చిత‌క కేసులు గెలిచి జ‌బ్బ‌లు చ‌రుచుకుంటోంది త‌ప్ప.. పెద్ద పెద్ద కంపెనీలు, వ్య‌క్తుల జోలికి వెళ్లడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రైవేట్ వ్య‌క్తుల‌కు భూములు దోచిపెడుతోందనటంలో అతిశయెక్తి లేదు.


జేకేఎస్ చేసింది ఇదే!

గ‌తంలో ప్ర‌భుత్వ భూముల‌ను అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేసుకుని బ్యాంకుల్లో త‌నఖా పెట్టుకున్నారు. 2013లో జేకేఎస్ కంపెనీ గోప‌న్ ప‌ల్లిలోని స‌ర్వే నెంబ‌ర్ 36ని బై నెంబ‌ర్స్ 36/A/3 తో వేసుకొని రిజిస్ట్రేష‌న్ చేయించుకుంది. అయితే.. మొత్తం ఈ స‌ర్వే నెంబ‌ర్ పై 403 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండాలి. ఇందులో కొన్ని సొసైటీల‌కు కేటాయించ‌గా మిగులు భూమి వంద ఎక‌రాల్లోనే ఉంటుంది. ఇందులో నుంచి ఎలాంటి టైటిల్ లేకుండానే ఫేక్ లింక్ డాక్యుమెంట్ల‌తో 5 ఎక‌రాలు రిజిస్ట్రేష‌న్ చేయించుకొని ఎస్బీఐలో తాక‌ట్టు పెట్టారు. ఎలాంటి వాయిదాలు క‌ట్ట‌క‌పోవ‌డంతో ఈమధ్యే వేలం పాట వేశారు. దీంతో ప్ర‌భుత్వం సీఐడీ ద‌ర్యాప్తు జ‌రిపిస్తున్నామ‌ని క‌ల‌రింగ్ ఇచ్చుకుంటోంది. ఎస్బీఐ బ్యాంకుకి లెట‌ర్ రాశామ‌ని చెప్పుకుంటోంది.

తొలివెలుగు క్రైం బ్యూరో చేతిలో సీబీఐ లెట‌ర్

గ‌త కొద్ది రోజులుగా ఈ వ్య‌వ‌హారం చినికి చినికి గాలి వాన‌లా మారింది. అయితే.. ఎందుకు ఈ హడావిడి అని ఇన్వెస్టిగేష‌న్ చేస్తే బెంగ‌ళూరు సీబీఐ టీం తెలంగాణ స‌ర్కార్ కు లేఖ రాసింది. గ‌త నెల 15న‌ డిప్యూటీ క‌లెక్ట‌ర్, శేరిలింగంప‌ల్లి తహశీల్దార్ లకు సీబీఐ అధికారి సుమిత్ సునైనా లేఖ రాశారు. బెంగుళూరు నుంచి తొలివెలుగు ఎక్స్ క్లూజివ్ గా దీన్ని సంపాదించింది. అయితే ఇందులో వారు కోరిన‌ట్లు ఇక్క‌డ ఏ రికార్డులు లేవు. 403 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి అని ఎప్ప‌టి నుంచో రికార్డులు త‌ప్ప.. పొజిష‌న్ మెయింటైన్ చేయ‌డం లేదు. సొసైటీల‌కు ఇచ్చిన భూముల‌ను కూడా అప్డేట్ చేసుకోలేదు. ఇంత లోపే ఎస్బీఐ బ్యాంక్.. పేప‌ర్స్ లో ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంతో అస‌లు ప్ర‌భుత్వ భూములపై జ‌రుగుతున్న వ్య‌వ‌హారం ఎక్క‌డ బయ‌ట‌కు పొక్కుతుందో అని ఆగ‌మేఘాలపై క‌లెక్ట‌ర్ సీఐడీతో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ప్ర‌భుత్వ భూముల‌ను నంచుకుతింటున్నారు.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ద‌శాబ్దాల రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి ఎదిగింది. హైద‌రాబాద్ భూములపై వేల కోట్ల సెటిల్మెంట్లు చేస్తున్నారు. అందుకు గ‌తంలో కేవ‌లం రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ల‌తో వంద‌ల ఎక‌రాల‌ను దోచుకుతిన్న గోల్డ్ స్టోన్ ప్ర‌సాద్, ఆయ‌న అమ్మిన వారు, మై హోం, ఫినిక్స్, వాస‌వి, సాహితి, ప్రణీత్, జ‌య‌భేరి.. ఇలా చెప్పుకుంటూ పోతే డ‌జ‌న్ కంపెనీల వ్య‌వ‌హారం తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వ భూముల‌ను క్లియ‌ర్ చేసుకుని వంద‌ల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తాయి. పైగా భూముల్లో సి. క‌ళ్యాణ్ అనే నిర్మాత‌.. రెండెక‌రాల భూమిని తాక‌ట్టు పెట్టి 80 ఎక‌రాల భూమిగా బ్యాంకు నుంచి విడిపించుకొని.. హఫీజ్ పేట‌లో దందాలు చేస్తున్నారు. ఇలా రియ‌ల్ ఎస్టెట్ పేరుతో వంద‌ల ఎక‌రాల‌కు ఎస‌రు పెట్టి వేల కోట్లు సంపాదిస్తున్న వారిని తొలివెలుగు క్రైం బ్యూరో ఆధారాల‌తో స‌హా చూపిస్తోంది. కానీ వీరంద‌రిపై చ‌ర్య‌లు ఉండ‌వు. ఎందుకంటే.. బెంగ‌ళూర్, చెన్నైలో పోలీసుల‌తో పాటు సీబీఐ కాకుండా.. అన్ని తెలంగాణ పోలీసుల‌తోనే ముడిప‌డి ఉన్నాయి. కాబ‌ట్టి.. ఇవ్వ‌న్ని బయ‌ట‌కు పొక్క‌వు. జేకేఎస్ లాగా భూముల‌కు టైటిల్ లేకుండా రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ల‌తో రుణాలు తీసుకున్న వారి పై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిపించాలి. అప్పుడే హైద‌రాబాద్ భూముల్లో ఏం జ‌రుగుతుందో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

No comments:

Post a Comment