Friday, January 28, 2022

డ్రగ్స్ వాడకంపై పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా మలచాలి అప్పుడే డ్రగ్స్ అరికట్టడం జరుగుతుంది... సీఎం కేసీఆర్

Courtesy by : @TelanganaCMO Twitter 

పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు వినూత్నరీతిలో ఆలోచించి ప్రతి ఒక్కరి సహకారంతో దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకంపై పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా మలచిననాడే తెలంగాణ నుంచి ఈ సమస్యను సమూలంగా నిర్మూలించడం సాధ్యమవుతుందని సీఎం శ్రీ కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ అధికారుల సదస్సు’ జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు.

ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని, 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా, తేజోవంతంగా పనిచేయాలన్నారు.

అద్భుత పనితీరు కనబరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు ఆక్సెలరేటెడ్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

No comments:

Post a Comment