Saturday, January 29, 2022

సంజయ్ వ్యవహారంలో పోలీసుల చర్యలు సమర్థనీయమే..!

సంజయ్ వ్యవహారంలో పోలీసుల చర్యలు సమర్థనీయమే..!

జాగరణ దీక్ష చేసిన బండి సంజయ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుని సీపీ సత్యనారాయణ సమర్థించుకున్నారు. సంజయ్ విషయంలో తాము చట్టబద్దంగా వ్యవహరించామని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం లోక్ సభ స్పీకర్ వరకు వెళ్లింది. ఫిబ్రవరి 3న లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు అందాయని సీపీ సత్యనారాయణ తెలిపారు.

బండి సంజయ్ విషయంతో తాము చట్టబద్ధంగానే వ్యవహరించామని ఆయన అన్నారు. తనతో పాటు కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, సీఐ లక్ష్మీబాబు, జగిత్యాల డీసీపీలకు నోటీసులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని.. కాకపోతే వారంతా కరోనా నిబంధనలు పాటిస్తున్నారని వివరించారు. కానీ.. బండి సంజయ్ కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని.. దీంతో అతని పై చర్యలు తీసుకోవలసి వచ్చిందని అన్నారు.

కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష చేశారు. ఆయన చేస్తున్న దీక్ష కరోనా వ్యాప్తికి కారణం అవుతోందని పోలీసులు భగ్నం చేశారు. ఆ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తరువాత పోలీసులు సంజయ్ ని ఆరెస్ట్ చేశారు.
అయితే.. ఈ వ్యవహారంపై బండి.. పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. సంజయ్‌ ఫిర్యాదును ప్రివిలేజ్‌ కమిటీకి స్పీకర్‌ ఓం బిర్లా పంపారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రివిలేజ్‌ కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది. దీంతో.. కరీంనగర్ పోలీసుల అధికారులకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

No comments:

Post a Comment