బూజుపట్టిన స్వీట్లు.. బేకరీ యజమానికి చుక్కలు చూపించిన వ్యక్తి..!
కరాచీ బేకరీలోని తినుబండారాలు ఎంత ఫేమసో తెలిసిందే. ఫెస్టివల్స్ సమయంలోనే కాదు.. ఇతర రోజుల్లోనూ ఆ షాపుల్లో రద్దీ కనిపిస్తుంటుంది. అయితే.. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఎంతటి ఫేమస్ షాపైనా ఈగలు తోలుకోవాల్సిందే. తాజాగా కరాచీ బేకరీలో కొనుగోలు చేసిన స్వీట్స్ బూజు పట్టాయంటూ ఓ వినియోగదారుడు చేసిన పోస్ట్ వైరల్ అయింది. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ను ట్యాగ్ చేస్తూ ఫోటోలతో సహా అన్ని వివరాలు తెలిపాడా వ్యక్తి. దీనిపై స్పందించిన అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… శ్రీనివాసరావు అనే వ్యక్తి ఖాజాగూడలోని కరాచీ బేకరీలో స్వీట్స్ కొనుగోలు చేశాడు. బాక్స్ ఓపెన్ చేశాక అవి బూజు పట్టి కనిపించాయి. దీంతో మంత్రి కేటీఆర్, ఇతర అధికారులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్.. వెంటనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. వెంటనే బేకరీకి వెళ్లి తనిఖీలు నిర్వహించగా.. పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్ వినియోగం, మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడాన్ని గమనించారు అధికారులు. అంతేకాదు కోవిడ్ రూల్స్ కూడా పాటించడం లేదని నిర్ధారించుకున్నారు. అక్కడికక్కడే 10వేల రూపాయల జరిమానా విధించారు.
No comments:
Post a Comment