Courtesy by : link Media ప్రజల పక్షం
దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు.
1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు.
డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.
ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎంపీలు శ్రీ బీబీ పాటిల్, శ్రీమతి కవితా నాయక్, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ రెడ్యానాయక్, శ్రీ రవీంద్ర కుమార్ నాయక్, శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రాజేందర్ రెడ్డి, శ్రీ సుంకే రవిశంకర్, శ్రీ కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీ గాదరి కిశోర్ కుమార్, శ్రీ సాయన్న, శ్రీమతి రేఖా నాయక్, శ్రీ అబ్రహం, శ్రీ హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ శ్రీ అనురాగ్ శర్మ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి. ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్, సీఎంఓ అధికారులు శ్రీ నర్సింగ రావు, శ్రీ భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రవి గుప్తా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు, పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment