హైదరాబాద్ : 01/07/2021
*ఇక ఆన్ లైన్లో మాత్రమే...*
*త్వరలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం....!*
ఆస్తి పన్ను మదింపులో అక్రమాలు, అవినీతిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను మదింపును ఆన్‌లైన్‌కే పరిమితం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు స్వీయ మదింపు చేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనుంది. ప్రస్తుత మాన్యువల్ విధానానికి త్వరలో స్వస్తి పలుకుతామని ఓ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ : జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగంలో అవినీతి రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. కొన్ని సర్కిళ్లలో బిల్ కలెక్టర్ నుంచి డీసీ వరకు వాటాల చొప్పున వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు నిత్యకృత్యమయ్యాయి.
అడిగినంత ఇస్తే ఒకలా.. లేనిపక్షంలో మరోలా పన్ను మదింపు చేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకుంటే వాస్తవ విస్తీర్ణాన్ని తగ్గించి, కేటగిరీ మార్చి పన్ను తక్కువగా నిర్ధారిస్తుంటారు. లేని పక్షంలో సెక్షన్లు, క్లాజ్‌లంటూ అదనపు భారం వేస్తారు. ఇప్పటి వరకు మదింపు లేని నిర్మాణాలకు సంబంధించి రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి పన్ను వసూలు చేయాలని చట్టం చెబుతుండగా, కొందరికి ఏడాది, మరి కొందరికి రెండున్నర, అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి పన్ను వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పౌరులే స్వయంగా పన్ను మదింపు చేసుకునే అవకాశం కల్పిస్తూ ఈ విషయంపై వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పన్ను మదింపు కోసం దరఖాస్తు చేసేందుకు సీఎస్‌సీ వద్దకు వచ్చే పౌరులకు అక్కడ ఉండే జీహెచ్‌ఎంసీ సిబ్బంది, స్వీయ మదింపు ఎలా అన్నది వివరిస్తారు. పీకే మహంతి ఎంసీహెచ్ కమిషనర్‌గా ఉన్నప్పుడే స్వీయ మదింపునకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ విధానం అందుబాటులో ఉన్నా ఆ దరఖాస్తులను కూడా బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మున్ముందు కేవలం స్వీయ మదింపు ద్వారానే పన్ను మదింపు జరుగనుందని, త్వరలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ఉన్నతాధికారొకరు తెలిపారు.
*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment