Saturday, July 10, 2021

బ్రాహ్మణులకు 112 కోట్లు

హైదరాబాద్ : 11/07/2021

బ్రాహ్మణులకు 112 కోట్లు

బ్రాహ్మణులకు 112 కోట్లు
  • నాలుగేండ్లలో ప్రభుత్వం అందించిన సాయం
  • బెస్ట్‌ పథకం కింద 3,637 మందికి లబ్ధి
  • ఈ ఏడాది మరో 500 మందికి ఆర్థిక అండ
  • 100 మందికి వివేకానంద విదేశీ విద్య స్కీం

ఎవరు హారతి పళ్లెంలో డబ్బులు వేస్తారా అని ఉమ్మడి పాలనలో ఎదురుచూసిన అర్చకులు.. స్వరాష్ట్రంలో, స్వపరిపాలనలో ప్రభుత్వమే వేతనం ఇస్తుండటంతో ధీమాగా, ధైర్యంగా జీవిస్తున్నారు. కటిక పేదరికంలో ఉన్నా ఓసీ కావటంతో ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులు నాడు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. చదువును మధ్యలోనే ఆపేశారు. కానీ నేడు ప్రభుత్వమే బెస్ట్‌, వివేకానంద విదేశీవిద్య వంటి పథకాలతో ఆర్థిక అండనివ్వటంతో గొప్పగా రాణిస్తున్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నది. నాలుగేండ్ల కాలంలోనే రూ.112 కోట్లు అందించింది.

హైదరాబాద్‌, జూలై 10 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అర్చకుల దగ్గర్నుంచి విద్యార్థులు, నిరుద్యోగుల వరకు వివిధ పథకాలను అమలుచేస్తూ గత నాలుగేండ్లలో రూ.112 కోట్లకుపైగా ఖర్చుపెట్టింది. ఈ ఏడాది జనవరి నాటికి ఈ పథకాల వల్ల 3,637మందికి లబ్ధి చేకూరింది. ఈ ఏడాది బెస్ట్‌ స్కీమ్‌ కింద మరో 500మంది నిరుద్యోగులు, వివేకానంద విదేశీవిద్య పథకం కింద 100 మందికి ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థిక స్థోమతలేక చదువులు మధ్యలోనే నిలిపివేసిన విద్యార్థుల దగ్గర్నుంచి అర్చకత్వం ద్వారా లభించే అరకొర సొమ్ముతో, అర్ధాకలితో జీవించిన అందరినీ ఆదుకొనేందుకు రాష్ట్రప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేసి సరిపడా నిధులను విడుదల చేసింది. మాజీ ఐఏఎస్‌ అధికారి రమణాచారి అధ్యక్షతన ఏర్పాటైన ఈ పరిషత్‌ ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలను రూపొందించి విజయవంతంగా అమలుచేస్తున్నది. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20లక్షల వరకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి గరిష్ఠంగా రూ.5లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. వేద పాఠశాలలకు రూ.2లక్షల చొప్పున గ్రాంట్‌, 75 ఏండ్లు పైబడిన 38 మంది బ్రాహ్మణ పండితులకు నెలకు రూ.2,500 చొప్పున గౌరవ వేతనం, వేద పాఠశాలల్లో అభ్యసించే 200 మంది విద్యార్థులకు నెలకు రూ.250 చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తున్నది.

బ్రాహ్మణ సదన్‌లు

బ్రాహ్మణుల కోసం హైదరాబాద్‌ శివారు గోపన్‌పల్లిలో సుమారు 6.5ఎకరాల విస్తీర్ణంలో రూ.15కోట్ల ఖర్చుతో బ్రాహ్మణ సదన్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో సువిశాల కల్యాణ మంటపంతోపాటు రెండు బ్లాక్‌లలో ఆఫీస్‌ రూమ్‌, ప్రముఖులు విడిది చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. సూర్యాపేటలో ఓ దాత ఎకరం భూమిని బ్రాహ్మణ సదన్‌కోసం దానంగా ఇవ్వటంతో అక్కడ మరో బ్రాహ్మణ సదన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.కోటి మంజూరు చేశారు. బెస్ట్‌ పథకం కింద ఇప్పటివరకు 2వేలకు పైగా నిరుద్యోగులు, ఔత్సాహిక వ్యాపారులకు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించినట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ప్రత్యేక అధికారి చంద్రమోహన్‌ తెలిపారు. ఈ ఏడాది మరో 500 మదిని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వివేకానంద విదేశీ విద్యాపథకానికి 56మందిని ఎంపిక చేశామని, మరో 40కిపైగా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నదని వివరించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు సంబంధించి అన్ని స్కీమ్‌లు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, నిధులకు ఎలాంటి ఇబ్బందిలేదని చంద్రమోహన్‌ పేర్కొన్నారు.

బ్రాహ్మణులకు 112 కోట్లు


No comments:

Post a Comment