Sunday, July 25, 2021

నిపుణులే నివ్వెరపోయారు! ‘న్యూస్‌టుడే’తో విశ్రాంత ఆచార్యుడు పాండురంగారావు


హైదరాబాద్ : 26/07/2021
   
నిపుణులే నివ్వెరపోయారు!

‘న్యూస్‌టుడే’తో విశ్రాంత ఆచార్యుడు పాండురంగారావు

Courtesy : న్యూస్‌టుడే ట్విట్టర్   (కాజీపేట)

నిపుణులే నివ్వెరపోయారు!

యునెస్కోకు సమర్పించిన పుస్తకాలు చూపిస్తూ..

‘తేలికైన ఇటుకలు, శాండ్‌ టెక్నాలజీ, శిల్ప సంపదకు వాడిన రాళ్లు రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదకు ఎంపిక కావడానికి ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇప్పుడు ఓరుగల్లు ప్రపంచ ఖ్యాతి గాంచింది. రామప్ప రామలింగేశ్వర స్వామి అనుగ్రహం, కరుణా కటాక్షాలతోనే యునెస్కో గుర్తింపు లభించింది’ అన్నారు వరంగల్‌ ఎన్‌ఐటీ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఆయనను ‘న్యూస్‌టుడే పలకరించింది. కంటివెంట వస్తున్న ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ నాటి నుంచి సాగిన కృషిని వివరించారు. ఆయన మాటల్లోనే..

21 దేశాలను పక్కకు నెట్టి..

ఆలయం నిర్మాణానికి నీటిలో తేలియాడే ఇటుకలను వాడిన తీరుకు యునెస్కో నిపుణులు నివ్వెరపోయారు. శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ వాడటం వల్ల భూకంపాల నుంచి రక్షణ, అద్భుతమైన శిల్ప సంపద, దీని కోసం వాడిన డోలమైట్‌ రాయి, దానికి అద్దపు సున్నితత్వం తదితర అంశాలు చాలా గుర్తింపునిచ్చాయి. రాగిణి, నాగిని శిల్ప సౌందర్యం యునెస్కో ప్రతినిధులను మంత్రముగ్ధులను చేసింది. 2020 వారసత్వ సంపద గుర్తింపు కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 21 దేశాలు పోటీపడ్డాయి. వీటన్నింటిని పక్కకు నెట్టి మన ఆలయం ముందు నిలిచింది. నేను, పాపారావు, సూర్యనారాయణమూర్తితో కలిసి 2019 నవంబరు 22న ప్యారిస్‌లో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు సదస్సులో పాల్గొని రామప్ప గురించి పూర్తి వివరాలను అందించాం. 1980 నుంచి తాము ఈ గుర్తింపు కోసం కృషి చేయడం ప్రారంభిస్తే 1987 నుంచి కాస్త ఊపందుకుంది. 1990లో ఆర్కియాలాజికల్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జగపతిరావు తమ అభ్యర్థనలను మన్నించి ముందుకు వచ్చారు. 1991లో హెరిటేజ్‌ ట్రస్టు ఏర్పాటు చేశాం. ముందుగా రామప్ప ఆలయంతోపాటు వేయిస్తంభాల ఆలయం, ఫోర్టు వరంగల్‌ కూడా ఉండేవి. వేయి స్తంభాల ఆలయం, ఫోర్టు వరంగల్‌ పక్కనే నివాస ప్రాంతాలు ఉండటం వల్ల ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు అనర్హత సాధిస్తాయని వాటిని తొలిగించి ఒక్క రామప్పతోనే ముందుకు వెళ్లాం.

ప్రశంసలు..

2009లో అప్పటి ప్రభుత్వం రామప్ప రక్షణకు, యునెస్కో గుర్తింపునకు ఒక జీవో జారీ చేసింది. 2017లో తిరిగి యునెస్కోకు ఒక్క రామప్ప దేవాలయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించాం. 2019లో యునెస్కో బృందం రామప్పను సందర్శించి ప్రశంసల వర్షం కురిపించింది. తర్వాత ఆలయం మీద ఆంగ్లం, అరబిక్‌, స్పానిష్‌, చీనా, రష్యా భాషల్లో వీడియోలు తీసి సమర్పించాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ యునెస్కోకు రామప్ప విశిష్ఠతను తెలుపుతూ లేఖలు రాశారు. ఈ గుర్తింపుతో పర్యాటకంగా వరంగల్‌ చాలా అభివృద్ధి చెందుతుంది. దేశవిదేశాల పర్యాటకులు గూగుల్‌లో శోధించి నేరుగా రామప్పకు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా ఉపాధి లభిస్తుంది. చార్మినార్‌, కుతుబ్‌షాహీ సమాధులు, గణపురంలోని దేవాలయ సముదాయాలు.. వారసత్వ సంపదకు రానున్న రోజుల్లో పోటీపడే అవకాశం ఉంది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కృషి ఎంతో ఉంది.

No comments:

Post a Comment