ప్రపంచం ప్రమాదంలో ఉంది.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ హెచ్చరిక

కరోనా మహమ్మారితో ప్రపంచం ‘ప్రమాదకరమైన దశ’లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అద్నాం గోబ్రెయేసన్‌ హెచ్చరించారు. కొవిడ్‌ వైరస్‌ డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ జనాభాకు టీకాలు వేసిన దేశాల్లో దవాఖానాల్లో రోగుల సంఖ్య మళ్లీ పెరగడంపై ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటికీ ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని.. డెల్టా వేరియంట్‌ ప్రమాదకరమైందని, వైరస్‌ కాలక్రమేణా మారుతున్నందున నిరంతరం దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కఠినమైన నిఘా, ప్రారంభంలో వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్‌ చేయడం ఇప్పటికీ ముఖ్యమేనన్నారు.

WHO Director Warns About corona delta variant
WHO Director Warns About corona delta variant

మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలను నివారించడం, ఇండ్లను వెంటిలేషన్‌ చేయడానికి తగిన ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని టెడ్రోస్‌ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి కొవిడ్‌ టీకాలు వేసేలా చూడాలని ప్రపంచ నేతలను కోరారు. తక్కువ టీకాలు వేసిన దేశాల్లో వైరస్‌ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఫార్ములాను పంచుకోవాలని ఫైజర్‌, బయో ఎన్‌టెక్‌, మోడెర్నా సంస్థలకు సూచించారు. దీంతో ఎక్కువగా టీకాలు ఉత్పత్తి చేసి, గ్లోబల్‌ ఇమ్యునైజేషన్‌ పెంచి మమహమ్మారి ఉధృతిని త్వరగా తగ్గించవచ్చన్నారు