Saturday, July 3, 2021

కేసీఆర్ గ్రాఫ్ డౌన్..?

హైదరాబాద్ : 03/07/2021

కేసీఆర్ గ్రాఫ్ డౌన్..?

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 

ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగలు.. ఇంకోవైపు గ్రూపు తగాదాలు.. టీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైందా..? కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందా..? ఊకదంపుడు ఉపన్యాసాలు.. అమలుకాని హామీలను ప్రజలు నమ్మడం లేదా..? పార్టీలోనూ నాయకుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వారికి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో గ్రూపు తగదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ లోని కొందరు ఎమ్మెల్యేలు తమని అవమానిస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు పిలవడం లేదంటూ వాపోతున్నారు.

గతంలో అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పై కాచిగూడ కార్పొరేటర్ చైతన్య ఆరోపణలు చేయగా.. ఇప్పుడు చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై మండిపడ్డారు. తాను కార్పొరేటర్ అయినప్పటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో బొంతు రామ్మోహన్ ఉప్పల్ ఎమ్మెల్యే టిక్కెట్ ను అశించారు. అయితే పార్టీ అధిష్టానం సుభాష్ రెడ్డికే ఇచ్చింది. తర్వాత గ్రేటర్ ఎన్నికలప్పుడు చర్లపల్లి డివిజన్ నుంచి తన భార్యను పోటీ చేయించి… మేయర్ ని చేయాలనుకున్నా అది సాకారం కాలేదు. దీంతో అప్పటినుంచి సైలెంట్ గా ఉంటున్న బొంతు దంపతులు.. సడెన్ గా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం వెనుక కారణం లేకపోలేదని అంటున్నారు ఆయన అభిమానులు. తనకు పోటీగా టిక్కెట్ అడిగినందుకే సుభాష్ రెడ్డి.. బొంతు రామ్మోహన్ పై కోపం పెంచుకున్నాడని.. సమయం దొరికినప్పుడల్లా ఇబ్బంది పెడుతున్నారని… అందుకే శ్రీదేవిని ఏ కార్యక్రమానికి పిలవడం లేదని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం వీళ్ల పంచాయితీ పార్టీలో హాట్ టాపిక్ మారింది. మేయర్ విషయంలో కాస్త అలిగిన బొంతు.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా.. వెన్నంటే కనిపించే ఆయన.. ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేతో వివాదం ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయా..? లేక కేటీఆర్ ను కాకా పట్టి ఏదైనా చక్రం తిప్పుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రోజురోజుకూ టీఆర్ఎస్ నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాలు పార్టీకి నష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. అసలే.. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో.. ఈ గ్రూప్ తగాదాల వల్ల భవిష్యత్తులో తలనొప్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు.


No comments:

Post a Comment