హైదరాబాద్ : 10/07/2021
కాంగ్రెస్ కు పూర్వవైభవం.. రేవంత్ ప్లాన్..!
టీపీసీసీ పదవి చేపట్టాక మరింత స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. కిందిస్థాయిలో బలోపేతం కోసం పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ముందుగా డీసీసీ, పీసీసీ టీమ్స్ పై ఫోకస్ పెట్టిన ఆయన.. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చూస్తున్నారు. 12న నిర్మల్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు రేవంత్. అక్కడి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్టీలో కీలక మార్పులకు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మల్ జిల్లాతో ప్రారంభించి అన్ని జిల్లాల్లో పర్యటనలు చేయాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. నిరసనలు, సభలు, సమావేశాలు…. ఇలా ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొని జిల్లాల్లో పార్టీ నాయకులను సెట్ రైట్ చేయనున్నారు. గాంధీ భవన్ లో కుర్చుంటే పనులు సాగవని.. ప్రజల్లోనే ఉండాలని రేవంత్ నిర్ణయించారు. అందుకే వరుస జిల్లాల పర్యటనలు చేపట్టి.. పార్టీని ఊరూరా, వాడవాడకూ తీసుకెళ్లాలని చూస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితేంటి..? బలాలు, బలహీనతలు తెలుసుకుని ఉన్న కమిటీలను కొనసాగించాలా..? లేక.. కొత్త కమిటీలు నియమించాలా..? అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల్లో యువ నాయకులు ఎక్కువగా ఉంటే.. పార్టీ బలోపేతం అవుతుందనేది రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. జిల్లాల్లో యువ నాయకత్వానికి ఆయన పెద్ద పీట వేసే అవకాశం ఉంది. కాస్త దూకుడుగా ఉండే నేతలను ప్రోత్సహించాలని చూస్తున్నట్లుగా సమాచారం. పాత తరం నాయకులను పక్కన పెట్టి యువ రక్తానికే చోటు కల్పించాలనే ధోరణిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే రెండు, మూడు జిల్లాల నాయకులతో చర్చలు జరిపినట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. అయితే మార్పుల విషయంలో ఎవరూ నొచ్చుకోకుండా నిర్ణయం తీసుకోనున్నారట. మొత్తంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ తో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గట్టిగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి.
No comments:
Post a Comment