హైదరాబాద్ : 03/07/2021మగ్గం చప్పుడాగింది...నేతన్నలకు కొవిడ్ దెబ్బ
ఈసారీ హాస్టళ్లు తెరవక విలవిల
టెస్కో కొనాలని కోరుతున్న కార్మికులు
ఈనాడు,(ట్విట్టర్) సౌజన్యంతో
మగ్గాలు మూగబోయాయి. నేతన్నలు చెమటోడ్చి చేసిన తివాచీలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. సర్కారు ఇస్తుందనుకున్న రాయితీ సరిగా రావడం లేదు. తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన డిజైన్లను విపణిలో వినియోగదారులు మా కొద్దంటూ కొత్త వాటి వైపు చూస్తున్నారు. నైపుణ్యం మెరుగుపరుచుకోక పాత పనిని వదులుకోలేక నేతన్నలు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా, ఈ కష్టాలు సరిపోవన్నట్టు కొవిడ్ వారి బతుకులపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత రంగంపై ఆధారపడ్డ సుమారు ఐదు వేల కుటుంబాలు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా కొత్తవాడలో తివాచీలు నేసే సంఘాల్లో లక్షల కొద్దీ కార్పెట్లు పేరుకుపోయాయి. ఆరు నెలల నుంచి టెస్కో తివాచీలను కొనుగోలు చేయకపోవడంతో గడ్డుకాలం ఎదురవుతోంది.
వరంగల్ కొత్తవాడలో సుమారు 50 వరకు చేనేత సంఘాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారు వెయ్యి మందికిపైగానే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని ప్రతి విద్యార్థికి ఏటా రెండేసి తివాచీలు, దుప్పట్లను ప్రభుత్వం అందజేసేది. ఈ క్రమంలో 12 లక్షలకుపైగా తివాచీలను ఇక్కడే కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసేది. అప్పుడు ‘ఆప్కో’ ప్రతినెలా సరకును కొనుగోలు చేసి బిల్లులు చెల్లించేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. ఆంధ్రప్రదేశ్ అక్కడి హాస్టళ్లకు మన వద్ద కొనడం లేదు. బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తుండడంతో గిరాకీ గణనీయంగా తగ్గింది. పైగా రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థులకు ఒకే దుప్పటి, ఒకే కార్పెట్ ఇస్తుండడంతో ఉత్పత్తి పడిపోయింది. నిరుడు కరోనా విజృంభించడంతో సర్కారు హాస్టళ్లేవీ తెరుచుకోకపోవడంతో ఇక్కడ ఉత్పత్తి చేసిన లక్షలాది కార్పెట్లు సంఘాల్లోనే నిల్వ ఉన్నాయి. కరోనా మొదటి దశ ఉద్ధృతి తగ్గాక నవంబరులో హాస్టళ్లు తెరచుకోవడంతో ‘టెస్కో’ సంఘాల్లో ఉన్న స్టాక్‌లో కొంతమేర కొనుగోలు చేయడంతో నేతన్నలు ఈ విద్యా సంవత్సరం కోసం భారీ సంఖ్యలో తివాచీలను సిద్ధం చేసి పెట్టారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం హాస్టళ్ల ప్రారంభానికి, ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వకపోవడంతో, టెస్కో మళ్లీ ముఖం చాటేయడంతో చేనేతలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. రాయితీ రావట్లేదు
రాష్ట్ర ప్రభుత్వం చేనేతల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నా, సాంకేతిక సమస్యలతో అవి చేరడం లేదు. చేనేత మిత్ర పథకం కింద నూలు కొనుగోలు చేస్తే 40 శాతం రాయితీ ప్రకటించింది. కేవలం ‘నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ వద్ద కొంటేనే రాయితీకి అర్హులు. అందులోనూ నూలు కొన్నాక సాంకేతిక సమస్యల వల్ల బిల్లులు అప్‌లోడ్ కాకపోవడంతో ఆ కొద్ది రాయితీ అందడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి చేనేతకు ఏటా రూ. 24వేలు నేరుగా అందజేస్తున్నారు. నూలు రాయితీ మార్చి అదే విధంగా తమకు నగదు అందజేస్తే ఉపకరిస్తుందని నేతన్నలు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం వీరి కోసం ‘త్రిఫ్ట్ ఫండ్ మనీ సేవింగ్ సీ్కీం’ ప్రకటించింది. ఇందులో చేనేతలు నెలనెలా ఎంత పొదుపు చేస్తే ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసి 36 నెలల తర్వాత వడ్డీతో కలిపి ఇస్తుంది. గతేడాది కొవిడ్ సమయంలో సర్కారు ఈ పథకంలో పొదుపు చేసిన వారికి డబ్బులు అందజేసింది. తర్వాత ఈ పథకం కొనసాగడం లేదు. ఆత్మనిర్భర్ భారత్‌లో వీధి వ్యాపారులకు రూ. 10 వేల రుణం అందుతోందని అలా తమకు ఏదో ఒకటి అందించినా కరోనా కష్ట కాలంలో కొంతలో కొంత ఆసరాగా ఉండేదని నేతన్నలు కోరుతున్నారు.
సర్కారు వెంటనే కొనాలి
- ఎలగం సాంబయ్య, శత్రంజి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు
రైతుల పరిస్థితి చూసి సర్కారు ధాన్యం మొత్తం కొంటోంది. అదే విధంగా కష్టకాలంలో ఉన్న చేనేతల వద్ద ఉన్న స్టాక్ మొత్తం ‘టెస్కో’ కొనుగోలు చేస్తేనే మాకు అయిదేళ్లూ నోట్లోకి పోయేది. మా ఒక్క సంఘంలోనే 20వేల తివాచీలు పేరుకుపోయాయి. అప్పుసప్పు చేసి చేనేతలకు కూలి చెల్లిస్తున్నాం. రోజుకు 200 కూడా రావట్లేదు
- విజయ, చేనేత కార్మికురాలు, కొత్తవాడ
నా భర్త చనిపోయాడు. నేను కష్టపడి చేనేత పని చేసి పిల్లలను చదివించా. మా అబ్బాయి మొదట్లో ఈ పనే చేసేవాడు. రోజుకు రూ. 200 గిట్టుబాటు కాక వేరే ఉద్యోగం చూసుకున్నాడు. నాకొచ్చే రోజు కూలితో ఒక నూనె ప్యాకెట్ కూడా రావడం లేదు. సర్కారే సాయం చేయాలి. మారలేకపోతున్నారు
కొత్తవాడలో తివాచీలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా వచ్చినా వీరి బతుకులు మారడం లేదు. ఇక్కడ జాతీయ స్థాయిలో మెరిసిన చేనేత కళాకారులు ఉన్నారు. కానీ వీరి తివాచీలకు మార్కెట్లో కూడా ఆదరణ తగ్గడంతో సర్కారు ఇక్కడి చేనేతలను ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ అంటే.. తాము నేసే ఉత్పత్తి మార్చి షర్టింగ్, షూటింగ్ లను నేయాలని కొందరికి శిక్షణ ఇస్తోంది. సంఘాల్లోని చేనేతలంతా 40 ఏళ్లు దాటినవారే కావడంతో లావు నూలుతో నేసే వీరికి చొక్కాల కోసం నేసే సన్నదారం కనిపించక ఆ పని నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో చేనేత కార్మికుడికి రోజు కూలి రూ. 200 కూడా రావడం లేదు. చాలా మంది ఈ వృత్తిని వదిలి బయట పని చేసి బతుకులీడ్చే దుస్థితి నెలకొంది.
Friday, July 2, 2021
మగ్గం చప్పుడాగింది...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment