హైదరాబాద్ : 19/07/2021
తెలంగాణలో 1036 ప్రైవేట్ స్కూళ్ల మూత!
తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో
అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తం తాగే కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే కాదు… ఒక్క పూట కూడా బడిని నడిపించే స్థోమత లేక తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు మూతబడుతున్నాయి. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 1,036 ప్రైవేట్ స్కూళ్లు మూతబడ్డట్టుగా విద్యాశాఖ చెబుతోంది. ఇందులో కూడా కరోనా కాలమైన 2019 -2021లోనే అత్యధికంగా 742 ప్రైవేట్ పాఠశాలలకు శాశ్వతంగా తాళాలుపడ్డాయని తెలుస్తోంది.
అత్యధికంగా హైదరాబాద్‌లో 300 ప్రైవేట్ స్కూళ్లు మూతబడ్డాయి. ఇందులో ఎక్కువగా సొంత భవనాలు లేనివే అధికంగా ఉన్నాయని ప్రైవేట్ స్కూళ్ల సంఘం నేతలు చెబుతున్నారు. ఆన్లైన్ క్లాసుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు సుముఖత చూపించకపోవడంతో.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న స్కూళ్లకు మూసివేయడం తప్ప మరో మార్గం కనిపించలేదని వారు గుర్తు చేస్తున్నారు.మరోవైపు ఒక్కసారి ఏదైనా స్కూల్ ప్రభుత్వం గుర్తింపు పొందితే .. అది పదేళ్ల వరకు కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది కాకపోయినా.. మరో ఏడాది అయినా స్కూల్ నడుపుకోవచ్చులే అన్న ఆలోచనతో చాలా యాజమాన్యాలు స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నాయని తెలుస్తోంది.
హైదరాబాద్ తర్వాత మేడ్చల్‌లో 53, వరంగల్‌లో 50, ఖమ్మం జిల్లాలో 44 ప్రైవేట్ స్కూల్స్ మూతబడ్డాయి. ఇవన్నీ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నవి కావడం గమనార్హం. రూరల్ ప్రాంతాలకు చెందిన పాఠశాలలకు ఈ స్థాయిలో సమస్య ఎదురుకాలేదు. వాస్తవానికి మూతబడిన స్కూళ్లలో చాలా యాజమాన్యాలు వాటిని కొనసాగించేందుకే ప్రయత్నించాయి. ఫీజులను కూడా తగ్గించాయి. కానీ తల్లిదండ్రులకు కరోనా, లాక్డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు లేకపోవడంతో.. వాటిని కూడా చెల్లించలేకపోయారు. కొన్ని చోట్ల ఈ స్కూళ్ల మూసివేత తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారింది. అర్ధాంతరంగా పాత స్కూల్‌ను క్లోజ్ చేయడంతో.. కొత్తగా మరో స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు రెట్టింపు స్థాయిలోఫీజులు చెల్లించుకోవాల్సి వచ్చింది.
No comments:
Post a Comment